
ఘనంగా పూలోత్సవం
‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యా లో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అనే పాటతో కొత్తగూడెం పట్టణం మార్మోగింది.
కొత్తగూడెం : ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యా లో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అనే పాటతో కొత్తగూడెం పట్టణం మార్మోగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏర్పాటు చేసిన బంగారు బతుకమ్మ ఉత్సవాలు స్థానిక ప్రకాశం స్టేడియంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. తొలుత మేదర్‌బస్తీలో జేఏసీ నాయకులు మేరెడ్డి జనార్థన్‌రెడ్డి ఇంట్లో ఆమె బతుకమ్మలను అలంకరించారు.
మహిళలకు బొట్టు పెడు తూ బతుకమ్మ ప్రాచుర్యాన్ని వివరించారు. అనంతరం సింగరేణి మహిళా కళాశాలలో విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు. ఆ తర్వాత రుద్రంపూర్‌లో తెలంగాణ జాగృతి కో-కన్వీనర్ బండారు సాగర్ ఇంటి వద్ద బతుకమ్మను అలంకరించారు. అనంతరం రుద్రంపూర్‌లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి రామవరంలో టీబీజీకేఎస్ అధ్యక్షులు ఆకునూరి కనకరాజు ఇంట్లో బతుకమ్మను పేర్చారు. ఆ తర్వాత వివేకవర్థిని డిగ్రీ కళాశాలలో విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు.
పట్టణంలో ఉత్సవ శోభ..
రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలతో మహిళలు నిర్వహించిన ప్రదర్శనలతో కొత్తగూడెం ప్రత్యేక శోభను సంతరించుకుంది. కొమ్ముడోలు, ఒగ్గు కళాకారుల డప్పునృత్యాలు, మహిళల ఆటపాటలతో పట్టణం కళకళలాడింది. స్థానిక ముర్రే డు వాగు నుంచి ప్రకాశం స్టేడియం వరకు బతుకమ్మలతో ప్రదర్శన నిర్వహించారు. ప్రత్యేక వాహనాల్లో విద్యుద్దీపాలతో అలంకరించిన బతుకమ్మలు ఆకర్షించాయి.
బతుకమ్మలతో నిండిన ప్రకాశం స్టేడియం..
స్థానిక ప్రకాశం స్టేడియం రంగురంగు పూలతో అలంకరించిన బతుకమ్మలతో నిండిపోయింది. కూరగాయలు, బంతి, తామరపూలతో ప్రత్యేకంగా తయారు చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్టేడియంలో బతుకమ్మ ఆడేందుకు అధికారు లు 22 సర్కిళ్లను ఏర్పాటు చేశారు. బతుకమ్మ ఉత్సవాలకు హాజరైన కల్వకుంట్ల కవిత అన్ని సర్కిళ్ల వద్దకు వెళ్లి మహిళలతో బతుకమ్మ ఆటలు ఆడారు.
సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు బతుకమ్మ పాటలతోప్రకాశం స్టేడియం మార్మోగింది. కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం, వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావ్, బానోత్ మదన్‌లాల్, కోరం కనకయ్య, కలెక్టర్ ఇలంబరితి, జేసీ సురేంద్రమోహన్, ఎస్పీ ఎ.వి.రంగనాధ్, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఐటీడీఏ పీవో దివ్య, కొత్తగూడెం ఆర్డీవో డి.అమయ్‌కుమార్, డీఎస్పీ రంగరాజు భాస్కర్, ఎమ్మెల్సీ బాలసాని ల క్ష్మీనారాయణ, కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్ పులి గీత, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు దిండిగాల రాజేందర్ పాల్గొన్నారు.
ఉద్యమంలో బతుకమ్మ ఆటలే కీలకం
తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఆటలు కీలకంగా నిలిచాయని, అలాంటి బతుకమ్మను ఘనంగా నిర్వహించుకోవడం మన బాధ్యత అని కవిత అన్నారు. గురువారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బంగారు బతుకమ్మ సంబరాలలో ఆమె మాట్లాడుతూ కొత్తగూడెంలో సీమాంధ్రులు అధికంగా ఉన్నారని, వారు కూడా బతుకమ్మ ఉత్సవాలలో మమేకం కావడం హర్షణీయమని అన్నారు. బంగారు తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. మహిళలకు భద్రతతో కూడిన బంగారు తెలంగాణను నిర్మిస్తామన్నారు.