కేసీఆరే మా నేత..

Jogu Ramanna Emotional comments about KCR - Sakshi

అజ్ఞాతంలోకి వెళ్లలేదు.. ఆరోగ్యం బాగాలేకనే ఆస్పత్రికి.. 

ఎమ్మెల్యే జోగు రామన్న భావోద్వేగం.. కంటతడి  

సాక్షి, ఆదిలాబాద్‌: తాను పార్టీని వీడేది లేదని, కేసీఆరే మా నాయకుడని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు.. ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన.. హైబీపీ ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఎవరితో మాట్లాడలేదు. గ్రామస్థాయి నుంచి మంత్రి వరకు పని చేసిన. ఎలాంటి మచ్చ లేకుండా ప్రజలకు నిస్వార్థమైన సేవలు అందించిన. మంత్రి పదవి వస్తుందని కార్యకర్తలు, నాయకులకు భరోసా ఇచ్చిన. పదవి రాకపోవడం నిరుత్సాహానికి గురి చేసింది. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఆదేశాల మేరకు పనిచేసిన. పార్టీ పటిష్టతకు కృషి చేసిన..’అని జోగరామన్న పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్ర మాలు ఏ రోజూ చేయలేదన్నారు. కార్యకర్తలు తనకు ఆక్సిజన్‌లాంటి వారని.. మంత్రి పదవి ఆశించడంలో తప్పులేదని అన్నారు. మంత్రి పదవి రాలేదని కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహానికి లోనయ్యారని పేర్కొన్నారు. 

ఎమ్మెల్యే ఆవేదన 
తనకు అమాత్య పదవి దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే జోగురామన్న సోమవారం ఉదయం నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమైంది. మంగళవారం హైదరాబాద్‌లో అజ్ఞాతం వీడి అందరి మధ్యలోకి వచ్చారు. ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెడుతూనే.. ముఖం కిందకు వాల్చారు. పక్కనే ఉన్న ఆదిలాబాద్‌ జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ జోగు రామన్న వైపు చూస్తూ ఉండిపోయారు. మొత్తంగా ఎమ్మెల్యే మాటల్లో ఆవేదన కనిపించింది. కార్యకర్తలు ఎవరూ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని సూచించారు. మీ అండదండలతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top