 
													సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. అజహరుద్దీన్ కలిసి కేబినెట్‌లో 15 మంది మంత్రులు ఉన్నారు.
కాగా, అజహరుద్దీన్‌కు ఏ శాఖను కేటాయిస్తారన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఆయనకు కీలకమైన పదవిని అప్పగిస్తారా లేక మైనారిటీ సంక్షేమ శాఖతో సరిపుచ్చుతారా అనే చర్చ జరుగుతోంది.
ప్రమాణ స్వీకారం అనంతరం అజహరుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ‘‘నన్ను మంత్రిగా చూసినందుకు నా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు చాలా సంతోషపడుతున్నారు. నాకు మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ముఖ్యమంత్రికి, రాష్ట్ర పార్టీ నాయకులకు కృతజ్ఞతలు. నేను ప్రత్యేకమైన వ్యక్తిని... నాపై వచ్చిన ఆరోపణలన్నీ నిజం కావు. నా గురించి కిషన్ రెడ్డికి పూర్తిస్థాయిలో అవగాహన లేదు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలు సరైనవి కావు. నా తక్షణ కర్తవ్యం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం’’ అని అజహరుద్దీన్ పేర్కొన్నారు.


 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
