రేపటి నుంచి జేఈఈ మెయిన్‌ దరఖాస్తులు | JEE Main Applications From Tomorrow | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి జేఈఈ మెయిన్‌ దరఖాస్తులు

Aug 31 2018 1:48 AM | Updated on Aug 31 2018 1:48 AM

JEE Main Applications From Tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, జీఎఫ్‌టీఐల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభంకానుంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పూర్తి చేసింది. ఇప్పటివరకు ఈ పరీక్షను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్వహించగా, ఇప్పుడు ఎన్‌టీఏ ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

దీంతో ఎన్‌టీఏ తమ వెబ్‌సైట్‌ను (https:// www. nta. ac. in)  అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ఈ వెబ్‌సైట్‌ ద్వారానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎన్‌టీఏ పేర్కొంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్‌ లింకును వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రానున్న జనవరిలో నిర్వహించే జేఈఈ పరీక్ష కోసం సెప్టెంబర్‌ 1 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ పరీక్షలను 2019 జనవరి 6 నుంచి 20 వరకు నిర్వహించనుంది.

ఫలితాలను జనవరి 31న విడుదల చేయనుంది. అనంతరం ఏప్రిల్‌లో రెండోసారి నిర్వహించే పరీక్ష కోసం 2019 ఫిబ్రవరి 8 నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. ఆ పరీక్షలను ఏప్రిల్‌ 6 నుంచి 20 వరకు నిర్వహించనుంది. ఫలితాలను ఏప్రిల్‌ 30న విడుదల చేయనుంది. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా చర్యలు చేపట్టింది. మరోవైపు యూజీసీ నెట్‌కు కూడా సెప్టెంబర్‌ 1 నుంచి 30 వరకు దరఖాస్తులను స్వీకరించేందుకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేసింది.  

Advertisement

పోల్

Advertisement