గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పాలక మండలి .......
ఏటూరునాగారం: గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పాలక మండలి సమావేశాలను సకాలంలో నిర్వహించడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారు. ప్రతి మూడు నెలలకోసారి పాలక మండలి సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండు సార్లు మాత్రమే ఐటీడీఏ పాలకమండలి సమావేశాలు నిర్వహించారు. చివరి సమావేశం గత ఏడాది ఏప్రిల్ 8వ తేదీన జరిగింది. సమావేశం జరిగి నేటికి ఏడాది. సంవత్సర కాలంగా సమావేశం ఊసే లేదు. ఐటీడీఏ అధికారులు సమావేశం నిర్వహణను పట్టించుకోకపోవడంతో గిరిజన సంఘాలు తప్పుబడుతున్నాయి. రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి చందూలాల్ సొంత నియోజకవర్గలోనే ఐటీడీఏకు ఈ గతి పట్టిందంటే.. ఇతర ఐటీడీఏ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమేరకు నిధులు విడుదల చేశాయో...ఏమేరకు పనులు పూర్తి చేశారో అధికారులకు తప్పా మరొకరికి తెలియదు. ప్రతి ఏడాది ఐటీడీఏకు కోట్లాది రుపాయాలు అభివృద్ధి కోసం వివిధ పథకాల కింద కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్నా వాటి అమలులో జరిగే లోపాలను గుర్తించక పోవడం వల్ల గిరిజనులకు అందకుండా పోతున్నాయి. గిరిజన గూడేలకు ఇప్పటికీ రవాణా, తాగునీటి సౌకర్యం, మౌలిక సదుపాయలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇందిర జలప్రభ బోర్లు, విద్య, ఉపాధి హామీ, ఇంజనీరింగ్ శాఖ, స్పెషల్ ఎంఐ, అటవీ హక్కుల చట్టం, పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ, వైద్య విభాగం, పట్టుపరిశ్రమ, ఉద్యానవన శాఖ, ఎల్‌టీఆర్, ఐకేపీ, గిరిజన సహకార సంస్థ, ఎకనామికల్ సపోర్ట్ స్కిం వంటి పథకాలు గిరిజనులకు అరకొరగానే అందుతున్నారుు.
పాలకమండలి నిర్వహించాలి
- పొడెం బాబు, తుడుందెబ్బ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు
పాలక మండలి సమావేశాలు మూడు నెలలకోమారు నిర్వహించాలి. గిరిజనులకు కావాల్సిన అభివృద్ధి పథకాలు, చేపట్టాల్సిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. ఐటీడీఏ స్థితిగతులు పాలకమండలి ద్వారానే ప్రజలకు వెల్లడవుతాయి. తక్షణమే పాలకమండలి నిర్వహించాలి.


