ఎట్టకేలకు ఐటీడీఏలో కదలిక

ITDA Plan For People Development In Adilabad - Sakshi

ఐటీడీఏ పాలకవర్గ   సమావేశానికి సమాయత్తం

ఈ నెల చివరి వారంలో   నిర్వహించాలనే యోచన

మూడేళ్లుగా గిరిజనాభివృద్ధికి ప్రణాళిక లేమి..

సాక్షి,ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చేది అడవులు.. గిరిజనులు.. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది. అటవిని నమ్ముకుని జీవించే గిరిపుత్రుల అభ్యున్నతికి బాటలు వేయాల్సింది సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ. అటువంటి ఐటీడీఏ మూడేళ్లుగా గిరిజనుల అభ్యున్నతికి ప్రణాళిక రూపొందించలేక పోయింది. ప్రణాళిక రూపొందించినప్పుడే అమలు చేయలేకపోయిన అధికారులు ఇక ప్రణాళిక లేమి కారణంగా ఎంతవరకు అభివృద్ధి చేశారనే ప్రశ్న తలెత్తుతోంది.

ఈ నెలలోనే..
సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పాలకవర్గ సమావేశం ఈనెల చివరి వారంలో నిర్వహించాలని యోచిస్తున్నారు. చివరిసారిగా 2016 జూలైలో జిల్లాల విభజనకు ముందు ఈ సమావేశం నిర్వహించారు. ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన ఈ సమావేశం నిర్వహించక 36 నెలలు దాటింది. వివిధ దశలో ఆటంకాలు కూడా సమావేశ నిర్వహణకు అడ్డు తగిలాయి. 2016 అక్టోబర్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. ఆదిలాబాద్‌ జిల్లా విభజనలో కొత్తగా నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్‌ మొత్తం నాలుగు జిల్లాలుగా ఏర్పడ్డాయి. జిల్లాల విభజన తర్వాత సమావేశం జరగలేదు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలో ఆదివాసీ, లంబాడాల మధ్య వివాదంతో కొద్ది నెలల పాటు శాంతిభద్రతల సమస్య ఏర్పడింది.

2018లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు పోవడంతో అసెంబ్లీ రద్దయ్యింది. అప్పట్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పంచాయతీ, ఎమ్మెల్సీ, లోక్‌సభ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వరుసగా రావడంతో కోడ్‌ అమల్లోనే ఉంది. కోడ్‌ ముగిసిన తర్వాత ప్రస్తుతం పరిస్థితులు అన్ని అనువుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐటీడీఏ గవర్నింగ్‌బాడి సమావేశ నిర్వహణకు సమాయత్తం అవుతున్నారు. ఉట్నూర్‌ ఐటీడీఏకు ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. పీఓగా కృష్ణా ఆదిత్య వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ఐటీడీఏ పా లకవర్గ సమావేశ నిర్వహణ కోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. నాలుగు జిల్లాల్లో గిరి జనుల కోసం గత 12 క్వార్టర్స్‌ (36 నెలలు)లో గిరిజనాభివృద్ధికి సంబంధించి నిధులు, ఖర్చులకు సంబంధించి నివేదికలు సమర్పించారు. త్వ రలో సమావేశం నిర్వహించనున్న దృష్ట్యా వీటికి స్పందించి స్పష్టమైన లెక్కలు ఉండాలని చైర్‌పర్సన్, పీఓ ఆదేశించారు. అయితే గడిచిన 36 నెలలకు సంబంధించి ఖర్చుల లెక్కలే జరగబోయే పాలకవర్గ సమావేశంలో పరిశీలన చేస్తారా.. లేనిపక్షంలో గిరిజనాభివృద్ధి భవిష్యత్‌ ప్రణాళిక కూడా రూపొందిస్తారా అనేది వేచి చూడాల్సిందే.

ఐటీడీఏనే ఒక ప్రత్యేకం..
ప్రస్తుతం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలుగా ఏర్పడినప్పటికీ ఐటీడీఏ మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఉట్నూర్‌ కేంద్రంగానే పనిచేస్తోంది. 2018 మేలో ఐటీడీఏ పీఓగా కృష్ణా ఆదిత్యను ప్రభుత్వం నియమించింది. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు రూపొందించినా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేసినప్పుడే వారికి ప్రయోజనం దక్కుతుంది. 1975 ఆగస్టు 1న మొదట ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోనే హెడ్‌క్వార్టర్‌తో ఐటీడీఏ ఏర్పాటు జరిగింది. 1979లో ఈ హెడ్‌క్వార్టర్‌ను ఉట్నూర్‌కు తరలించడం జరిగింది. దీని అధికార వికేంద్రీకరణ పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాలోని 44 మండలాలతో ఉంది. స్పెషల్‌ సెంట్రల్‌ అసిస్టెన్స్‌ ఫండ్‌ దీనికి వస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జియోగ్రాఫికల్‌ ఏరియా ఆధారంగా 38.13 శాతం ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ ఏరియా కిందికే వస్తాయి. ఐటీడీఏ ద్వారా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమే ఈ ప్రత్యేక విభాగం ఏర్పాటు జరిగింది.

తద్వారా జిల్లా యంత్రాంగానికి సరిసమానంగా ఇక్కడ ఒక యంత్రాంగం పనిచేస్తుంది. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పర్యవేక్షణలో ఇది పనిచేస్తుంది. విద్య, వైద్య, ఇంజనీరింగ్‌ ప్రత్యేక విభాగాలు పనిచేస్తాయి. డీఈఓ (ఏజెన్సీ), డిప్యూటీ డైరెక్టర్‌ (టీడబ్ల్యూ), డీటీడబ్ల్యూవో, అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ (ట్రైబల్‌), జిల్లా మలేరియా అధికారి, ఏడీఎంఓ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఈఈ ఉట్నూర్‌ కేంద్రంగా పనిచేస్తారు. అదే విధంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బోథ్, జైనూర్, కాగజ్‌నగర్, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూర్‌లలో ఏటీడబ్ల్యూవోలు క్షేత్రస్థాయిలో ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణను పర్యవేక్షిస్తుంటారు. ఇంతటి విభాగాలు ఉన్నప్పటికీ మూడేళ్లుగా ప్రణాళిక లేమి కారణంగా గిరిజనాభివృద్ధి సమగ్రంగా జరగడం లేదనేది స్పష్టం. 

ప్రగతి జరిగేనా..
సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ద్వారా విద్య, వైద్యంలో గిరిజనులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే ముఖ్య లక్ష్యం. ఇంజినీరింగ్‌ శాఖ ద్వారా ఏజెన్సీ మండలాల్లో రహదారుల నిర్మాణం, జీపీ భవనాలు, ఎంఎంఎస్‌ బిల్డింగ్‌ల నిర్మాణం, ఇతరత్ర విస్తృతంగా చేపట్టాలి. మూడేళ్లుగా ప్రణాళిక లేక సాగిపోతోంది. ప్రస్తుతం నాలుగు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం జరిగింది. అంతేకాకుండా పాలకవర్గ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు కలిసి ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించి సమస్యలపై చర్చతో పాటు గిరిజనుల అభివృద్ధికి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపిస్తారు. తద్వారా గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే వీలుంటుంది.

ఎల్టీఆర్‌–1959 యాక్ట్, 1970 రెగ్యులరైజేషన్‌ ప్రకారం గిరిజనేతరుల నుంచి అటువంటి భూములను స్వాధీనం చేసుకొని తిరిగి గిరిజనులకే అప్పగించాలి. అలాంటి కేసులు ఏజెన్సీ మండలాల్లో అనేకంగా పెండింగ్‌ ఉన్నాయి. వీటికోసం ప్రత్యేకంగా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పోస్ట్‌ ఐటీడీఏలో ఉందంటే ప్రాధాన్యత గ్రహించాలి. అదేవిధంగా గిరిజన ఉత్పత్తులకు సంబంధించి విక్రయించుకునేందుకు గిరిజన కోఆపరేటీవ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ లిమిటెడ్‌ ద్వారా గిరిజనులకు సరైన ఆదరణ లభించడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరింత చొరవ తీసుకొని గిరిజన ఉత్పత్తులకు ఆదరణ లభించేలా చూడాలి. తద్వారా గిరిజనులకు ఆదాయం లభిస్తుంది. సీసీడీపీ నిధులతో వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది. 

వెంటాడుతున్న సమస్యలు..
గిరిజనులకు సమస్యలు వెంటాడుతున్నాయి. సీజనల్‌ వ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు, రక్తహీనత గిరి జనాల ప్రాణాలను హరిస్తున్నాయి. సర్వేలో విద్యార్థులకు సికిల్‌సిల్, తలసేమియా వ్యాధులు బయటపడ్డాయి. అదేవిధంగా నేటికీ ఏజెన్సీ గ్రామాలకు సరైన రవాణ సదుపాయాలు లేవు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నార్నూర్‌ మండలంలో రోడ్లు తెగిపోయి అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులు పడిన ఇబ్బందులు అవగతమే. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా ఏజెన్సీ మండలాల్లో రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది.

నివేదికలు సిద్ధం  చేసుకోవాలి
ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌కు సంబంధించి వివిధ శాఖల ద్వారా ఈ మూడేళ్ల కేటాయింపులను వివరంగా తీసుకురావాలని సూచించడం జరిగింది. ట్రైకార్‌కు సంబంధించి ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ జిల్లాలో యూనిట్లను గ్రౌండింగ్‌ చేయడం జరుగుతుంది. ఎల్టీఆర్‌ కేసులకు సంబంధించి వివరాలను కూడా పాలకవర్గ సమావేశంలో చర్చిస్తాం. నాలుగు జిల్లాల అధికారులు పూర్తి సమాచారం సిద్ధం చేసుకోవాలి. – కృష్ణా ఆద్యిత, పీఓ, ఐటీడీఏ, ఉట్నూర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top