ప్రమోగాలకు సన్నద్ధం

Intermediate Public  Practicals Examinations - Sakshi

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌ : ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పరీక్షల సీజన్‌ మొదలుకానుంది.. ఈనెలాఖరు నుంచి ఒకదాని వెంట మరొకటి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధ్యాపకులు విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ఈనెల 28న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌(విలువలు, మానవ సంబంధాలు) పరీక్ష, 30న పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ వెంటనే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటర్‌ రెండో సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ ఏడాది నుంచి పరీక్షల విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఈ మేరకు ఇష్టారాజ్యంగా మార్కులు వేసే విధానానికి స్వస్తి  పలికారు. అయితే, సరిపడా అధ్యాపకులను నియమించకపోగా.. ప్రాక్టికల్స్‌ కోసం సామాగ్రిని ఇవ్వకుండా ప్రాక్టికల్స్‌ పరీక్షలు విద్యార్థులు ఎలా రాయగలుగుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఈసారి ప్రయోగ పరీక్షలు జరగనున్న కేంద్రా ల్లో సీసీ కెమెరాల ఏర్పాటును తప్పనిసరి చేశారు.
 
పరీక్షకు గంట ముందు  ప్రశ్నాపత్రం 
ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు జరగనున్న ఎథిక్స్, హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్షలకు సంబందించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మార్పులు తీసుకువచ్చింది. గతంలో ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలల్లో ముఖ్యమైన ప్రశ్నలను అధ్యాపకులే ఎంపిక చేసి పరీక్ష నిర్వహించేవారు. ఈ కారణంగా పరీక్షలో విద్యార్థులకు ఎక్కువ మార్కులు వచ్చేవి. అయితే, ఈ సంవత్సరం ఈ విధానానికి స్వస్తి చెబుతూ ప్రభుత్వం మార్పులు చేసింది. పరీక్ష ప్రారంభం కావడానికి అరగంట ముందు కళాశాల ప్రిన్సిపాల్‌ సెల్‌ ఫోన్‌కు ఓటీపీ నెంబర్‌ వస్తుంది. దీన్ని ఆధారంగా ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకుని వెంటనే పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఏమేం ప్రశ్నలు వస్తాయనేది అధ్యాపకులకు సైతం అప్పటి వరకు తెలియదు. దీంతో కష్టపడి చదివిన విద్యార్థులకు మాత్రమే మంచి మార్కులు వస్తాయని చెబుతున్నారు.

ప్రాక్టికల్‌ పరీక్షలకు 7,238 మంది  
జిల్లా వ్యాప్తంగా 21 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 51 ప్రైవేట్‌ కళాశాలలకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థులు 7,238 మంది ప్రాక్టికల్‌ పరీక్షలకు హారుకానున్నారు. ఇందులో బైపీసీ విద్యార్థులు 4,005 మంది కాగా, ఎంపీసీ చదివే విద్యార్థులు 3,233 మంది ఉన్నారు. కాగా, ప్రాక్టికల్‌ పరీక్షలకు కూడా ప్రశ్నాపత్రాన్ని ఆన్‌లైన్‌ విధానంలో కొద్ది సమయం ముందే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, ప్రాక్టికల్స్‌ పరీక్షల్లో జంబ్లింగ్‌ విధానం అవలంబించనుండగా.. ప్రతీ కేంద్రానికి ఓ పరిశీలకుడిని నియమిస్తారు. తద్వారా యాజమాన్యాల ప్రమేయం లేకుండా నిక్కచ్చిగా మార్కులు వేసే వెసలుబాటు కలగనుంది.

ప్రాక్టికల్‌ సామాగ్రి లేక ఇబ్బందులు 
ప్రభుత్వ కళాశాలల్లో పూర్తి స్థాయిలో ప్రాక్టికల్‌ పరీక్షలకు నిర్వహించేందుకు ప్రభుత్వం వసతులు సమకూర్చలేదు. ఈక్రమంలో జిల్లావ్యాప్తంగా మొత్తం 21 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రయోగాలు చేసేందుకు అవసరమయ్యే పరికరాలలను ఇప్పటి వరకు ప్రభుత్వం అందించలేదు. అంతేకాకుండా రీ ఏజెంట్స్, లిక్విడ్‌ వంటి వాటిని కొనుగోలు చేసేందుకు నిధులు కూడా ఇవ్వలేదు. ఇక ఒకేషనల్‌ కళాశాల, పారామెడికల్‌ కళాశాల విద్యార్థులకు కూడా ప్రాక్టికల్‌ పరీక్షలకు అనుమతించాలంటే పూర్తి స్థాయిలో వసతులు ఉండాలన్న అధికారులు.. ప్రైవేట్‌ కళాశాలల్లో ఎంత మేరకు వసతులు ఉన్నాయన్న విషయమై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

పాఠాలు చెప్పకుండానే పరీక్ష 
ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సామాజిక అంశాలపై అవగాహన ఉండాలన్న ఉద్దేశ్యంతో ఇంటర్మీడియట్‌ బోర్డు కమిటీ ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్, ఎన్విరార్‌మెంట్‌ సబ్జెక్టులను చేర్చారు.  కానీ ఈ సబ్జెక్టును బోధించేందుకు ఏ ప్రభుత్వ కళాశాలల్లో కూడా ప్రత్యేక అధ్యాపకులను నియమించలేదు. ఇక ప్రైవేట్‌ కళాశాలల్లోనూ అదే పరిస్థితి నెలకొంది.  వీటికి వచ్చిన మార్కులు ప్రత్యేకంగా మెమోలో సాధారణ సబ్జెక్టులతో  కలపకపోయినా... మార్కలు తక్కువ వచ్చినా, హాజరుకాకపోయినా ఫెయిల్‌ అయినట్లే పరిగణిస్తారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న సబ్జెక్టుల బోధన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన.. ఇప్పుడు పరీక్ష రాయాలని చెబుతుండడం గమనార్హం. 

పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం 
జిల్లాలో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్, థియరీ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్, ఎన్విరాన్‌మెంట్‌ పరీక్షలకు సంబంధించి పూర్తి స్థాయిలో బోధించాలని కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులను గతంలోనే ఆదేశించాం. అలాగే, ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులందరికీ ఉచితంగా  పుస్తకాలు అందజేశాం. గతంలో మాదిరిగా ప్రశ్నపత్రాన్ని ఇక్కడ తయారు చేయకుండా బోర్డు నుండే పంపిస్తారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండాపరీక్షలు నిర్వహిస్తాం. – వెంక్యానాయక్, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top