టీఆర్టీ ఫలితాల విడుదలపై మధ్యంతర ఉత్తర్వులు

Interim orders on the release of TRT results - Sakshi

హైదరాబాద్‌ : టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్టీ), సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ) ఖమ్మం , వరంగల్ జిల్లాల ఫలితాల విడుదలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించ తలపెట్టిన టీఆర్‌టీ, ఎస్‌జీటీ పోస్టులలో డీఎస్సీ-2012 లో భర్తీ కాకుండా మిగిలిపోయిన వికలాంగ అభ్యర్థుల పోస్టులను టీఆర్‌టీ-2017లో వికలాంగ అభ్యర్థులకు కేటాయించకపోవటాన్ని సవాలు చేస్తూ ఖమ్మం జిల్లాకు చెందిన మురళి, వరంగల్ జిల్లాకు చెందిన మల్లికార్జున్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 

 2012 డీఎస్సీలో వికలాంగ అభ్యర్థులకు కేటాయించిన ఎస్‌జీటీ పోస్టులలో ఖమ్మం జిల్లాలో 6 పోస్టులు, వరంగల్ జిల్లాలో 19 పోస్టులు మిగిలిపోయానని, అయితే జీవో 23, 99 ప్రకారం బ్యాక్‌లాగ్‌ పోస్టులను తరవాత వచ్చే వరుస మూడు నోటిఫికెషన్లలలో కూడా వికలాంగ అభ్యర్థులతో మాత్రమే భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 తెలియ చేస్తుందని న్యాయవాది బూర రమేష్ వాదించారు.

ఖమ్మం జిల్లాలో మిగిలిపోయిన 6 పోస్టులలో కేవలం ఒక పోస్టును, వరంగల్ జిల్లాలో 19 పోస్టులలో కేవలం 10 పోస్టులు మాత్రమే వికలాంగ అభ్యర్థులకు కేటాయించారు అని బూర రమేష్ హైకోర్ట్ దృష్టికి తీసుకొచ్చారు. ఇది తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 కి విరుద్ధమని వాదించారు. బూర రమేష్ వాదనలతో ఉన్నత న్యాయస్థానం ఏకీభవించింది. అయితే పరీక్ష నిర్వహించుకోవచ్చుననీ ఈ వాజ్యం పై తుది తీర్పు వెలువడేవరకు ఖమ్మం, వరంగల్ జిల్లాలో టీఆర్‌టీ, ఎస్‌జీటీ ఫలితాలు ప్రకటించటానికి వీలు లేదు అని టీఎస్‌పీఎస్‌సీ, ఉన్నత విద్యా శాఖలకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top