లంచమివ్వాలి.. బిచ్చమేయండి!

Innovative protest of an elderly couple in Bhopalapalli - Sakshi

భూపాలపల్లిలో ఓ వృద్ధ దంపతుల వినూత్న నిరసన

 పాసుపుస్తకం కోసం తహసీల్దార్‌ డబ్బులడిగాడని ఆరోపణ

 కలెక్టర్‌ ఆదేశంతో పాసుపుస్తకం జారీ చేసిన ఆర్డీఓ

భూపాలపల్లి: ‘‘పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేం దుకు తహసీల్దార్‌ లంచం అడుగుతున్నాడు.. వయోభారంతో ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నాం.. మా దగ్గర డబ్బులు లేవు.. లంచం కోసం బిచ్చం వేయం డి’’అంటూ ఓ వృద్ధ దంపతులు శుక్రవారం భూపాలపల్లిలో వినూత్న నిరసన తెలిపారు. చేతిలో ఫ్లెక్సీ.. మెడలో ప్లకార్డులు వేసుకొని భిక్షాటన చేయడం చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న కలెక్టర్‌  స్పందించి.. వృద్ధ దంపతులకు న్యాయం చేయాలని ఆర్డీఓను ఆదేశించారు.

భూపాలపల్లి మండలం ఆజంనగర్‌కి చెందిన మాంతు బసవయ్య, లక్ష్మి దంపతులకు గ్రామ శివారులోని 50 సర్వే నంబర్‌లో 1.19 ఎకరాలు, 601లో ఎకరం, 622/42లో ఎకరం, 622/52/అ లో 31 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిన నాటి నుంచి పట్టాదారు పాసుపుస్తకాల కోసం వారు భూపాలపల్లి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ కాలి కి బలపం కట్టుకొని తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం పుస్తకాలు ఇచ్చేందుకు నిరాకరిం చారు.

దీంతో చేసేది లేక వృద్ధ దంపతులు శుక్రవారం భిక్షాటన ప్రారంభించారు. పట్టాదారు పుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్‌ సత్యనారాయణస్వామి డబ్బులు అడుగుతున్నాడని, తమ దగ్గర లేవని, ముసలివాళ్లం అయినందున ఆదుకోవాలని కోరుతూ పట్టణ ప్రధాన రహదారిలోని వ్యాపారుల వద్ద భిక్షాటన చేశారు. చేతిలో ఫ్లెక్సీ.. మెడలో ప్లకార్డు ప్రదర్శిస్తూ ప్రతి దుకాణ యజమాని వద్ద అడుక్కోవడం అక్కడున్న వారిని కదిలించింది. 

భూమిని ఎప్పుడో అమ్ముకున్నారు
బసవయ్య, లక్ష్మి తమకున్న వ్యవసాయ భూమిని ఎప్పుడో అమ్ముకున్నారని భూపాలపల్లి తహసీల్దార్‌ నారాయణస్వామి అన్నారు. ఆ భూమికి సంబంధించిన కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పారు. గ్రామంలో విచారణ చేపట్టగా 15 ఏళ్లుగా కానుగంటి కొమురయ్యనే భూమిని సాగు చేసుకుం టున్నాడని తేలిందన్నారు. దీంతో పాసుబుక్కును ఇవ్వకుండా నిలిపివేశామని తెలిపారు.

ఎట్టకేలకు పట్టా..
సోషల్‌ మీడియాలో ఈ వ్యవహారం వైరల్‌ కావడంతో కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు స్పందించారు. ఆ వృద్ధ దంపతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందివ్వాలని భూపాలపల్లి ఆర్డీఓ వెంకటాచారిని ఆదేశించారు. వృద్ధ దంపతులను తన కార్యాలయానికి పిలిపించుకున్న ఆర్డీఓ.. భూరికార్డులను పరిశీలించారు. అదే సమయంలో భూమిని కొనుగోలు చేశానని చెబుతున్న కానుగంటి కొమురయ్య రావడంతో ఈ భూమి నీకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. బసవయ్య, లక్ష్మిల భూమిని 1981లో తంశెట్టి బానమ్మ కొనుగోలు చేసిం దని, ఆమె నుంచి 1989లో తన తండ్రి కానుగంటి మొండయ్య కొనుగోలు చేశాడని, అప్ప టి నుంచి తామే కాస్తులో ఉన్నామని చెప్పాడు.

2004లో ఆర్‌ఓఆర్‌ పట్టా చేయించుకొని పట్టాబుక్కు తీసుకున్నట్లు చెప్పాడు. ఆ భూమి తమదేనని బసవయ్య, లక్ష్మి 2011 నుంచి గొడవ చేస్తుండటంతో కోర్టును ఆశ్రయించానని, కేసు నడుస్తున్న క్రమంలోనే 2015లో పహాణీ నుంచి తన పేరును అకారణంగా తొలగించారన్నాడు. దీంతో ఆర్డీఓ సదరు భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలను బసవయ్య, లక్ష్మీలకు అందజేశారు. నిజంగా భూమి కొనుగోలు చేసి ఉంటే, అన్ని డాక్యుమెంట్స్‌తో తనకు అప్పీల్‌ చేసుకోవాలని కొమురయ్యకు సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top