లా కాలేజీల్లో పెరిగిన సీట్లు

Increased the seats in law colleges - Sakshi

ఫలితాలు ప్రకటించిన ప్రవేశాల కమిటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని లా కాలేజీల్లో సీట్లు పెరిగాయి. గతేడాది రాష్ట్రంలోని 21 కాలేజీల్లో 4,322 సీట్లు అందుబాటులో ఉండగా, ఈసారి 4,712కు పెరిగాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్‌–2018 ఫలితాలను గురువారం ఆయన విడుదల చేశారు. అన్ని ప్రవేశ పరీక్షల్లో సీట్లు ఎక్కువగా, అభ్యర్థులు తక్కువగా ఉన్నారని, లాసెట్‌లో మాత్రం సీట్లు తక్కువగా ఉంటే అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం లాసెట్‌లో 15,793 మంది అర్హత సాధించారని తెలిపారు.

లాసెట్‌కు 23,109 మంది దరఖాస్తు చేశారని, వారిలో 18,547 మంది రాత పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. మూడేళ్ల లా కోర్సుకు 16,332 మంది దరఖాస్తు చేసుకున్నారని, అందులో 12,960 రాత పరీక్ష రాయగా, 11,563 మంది అర్హత సాధించారన్నారు. ఐదేళ్ల లా కోర్సుకు 4,580 మంది దరఖాస్తు చేసుకుంటే, 3,727 మంది రాత పరీక్షకు హాజరయ్యారని, 2,401 మంది అర్హత సాధించారన్నారు. పీజీ లా కోర్సుకు 2,197 మంది దరఖాస్తు చేసుకోగా, దాంట్లో 1,860 మంది హాజరైతే 1,829 మంది అర్హత సాధించారన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ లింబాద్రి, కార్యదర్శి ఎన్‌ శ్రీనివాస్‌రావు, లాసెట్‌ కన్వీనర్‌ ద్వారకానాథ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top