పండ్ల మొక్కలకు ప్రాముఖ్యత

Importance to fruit trees - Sakshi

  కోతులకు ఆహారమే లక్ష్యంగా ఈసారి హరితహారం

  తెలంగాణలో పెరిగిన పచ్చదనం

  అర్బన్‌ ఫారెస్టులపై ప్రత్యేక దృష్టి

  ‘సాక్షి’తో పీసీసీఎఫ్‌ పీకే ఝా

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది హరితహారంలో కోతులకు ఆహారాన్ని ఇచ్చే పండ్ల మొక్కలకు ప్రాముఖ్యత ఇస్తామని  ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) పీకే ఝా అన్నారు. గత ఏడాది హరితహారం కింద రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు 90 శాతం బతికాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ‘సాక్షి’ప్రతినిధితో మాట్లాడారు. ప్రకృతిలో పండ్ల మొక్కలు తగ్గిపోవడం, మరోవైపు మనుషులు జంక్‌ ఫుడ్‌ను ఫీడ్‌గా ఇవ్వటం వలన కోతులు వనాలు వదిలి ఊళ్ల మీదకు మళ్లాయని, తిరిగి వాటిని వనాల్లోకి పంపాలంటే సాధ్యమైనన్ని ఎక్కువ పండ్ల మొక్కలు పెంచటం ఒక్కటే మార్గమని చెప్పారు.  ‘‘కోతులు ఇష్టంగా తినే 25 రకాల పండ్ల మొక్కలను గుర్తించాం, వాటిని రాష్ట్రవ్యాప్తంగా వివిధ నర్సరీలతో పెంచుతున్నాం. ఈసారి రుతుపవనాలు ఆశాజనకంగానే ఉన్నాయి.

మొక్కలతో మేం సిద్ధంగా ఉన్నాం. ఈ ఏడాది 39.5 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. త్వరలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి హరితహారం ప్రారంభ తేదీని నిర్ణయిస్తాం. అటవీ భూములు ఉన్నచోట వందకు వంద శాతం పండ్ల మొక్కలనే నాటుతామని, అటవీ భూములు లేనిచోట కనీసం 20 శాతం కోతులు తినే పండ్ల మొక్కలు కచ్చితంగా నాటాలనే నిబంధన పెట్టుకున్నాం. మనుషులు కోతులకు కృత్రిమ ఆహారం ఇవ్వొద్దని, దీనికి అలవాటు పడిన కోతులు సహజ ఆహార అన్వేషణ మరిచిపోయి ఊళ్ల మీదకు మళ్లుతున్నాయని’’ఝా అన్నారు. 

శాటిలైట్‌ ఫోటోల ద్వారా రాష్ట్రంలో 565 స్క్వేర్‌ కిలోమీటర్ల మేరకు పచ్చదనం పెరిగినట్లు నిర్ధారణ అయింది. ఈ ఏడాది గూగుల్‌ శాటిలైట్‌ విడుదల చేసిన చిత్రాల్లో గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే 100 స్క్వేర్‌ కిలోమీటర్లకు పైగా పచ్చదనం విస్తరించిన రాష్ట్రాలుగా గుర్తింపు పొందాయి. మా పనితనానికి ఇది అద్భుతమైన గుర్తింపు. బంగారు తెలంగాణలో మా భాగస్వామ్యం బలంగా ఉండాలనే ఆశయంతో అటవీ శాఖ ఉద్యోగులు, అధికారులు సమష్టిగా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్న జల ప్రాజెక్టులకోసం మా అధికారుల చొరవ, కృషిని అభినందిస్తున్నారు. కాళేశ్వరం, సీతారామసాగర్, పాలమూరు ఎత్తిపోతల పథకానికి అత్యంత వేగంగా అటవీ అనుమతులను సాధించటంలో అధికారులు రాత్రింబవళ్లు కృషి చేశారు. కేంద్ర అటవీ శాఖ నుంచి జల ప్రాజెక్టులకు ఇంత వేగంగా అటవీ అనుమతులు గతంలో నేనెప్పుడూ చూడలేదని ఝా చెప్పారు. 

అటవీ భూముల రక్షణే ధ్యేయంగా..
ఎకోపార్కులు, అర్బన్‌ ఫారెస్టు పార్కు ల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ప్రజలకు అడవుల మీద, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యతల మీద అవగాహన కలిగించటమే ఎకో పార్కుల ఉద్దేశం. హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలోని అటవీ భూములను రక్షించుకుంటూ.. ప్రజలకు స్వచ్ఛమెన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందించే లక్ష్యంతో నే అర్బన్‌ ఫారెస్టు పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే కొండాపూర్‌లో పాలపిట్ట సైక్లింగ్‌ ఉద్యానవనం, బర్డ్‌ పార్కును అభి వృద్ధి చేశాం. 40 రకాలకు చెందిన దాదాపు 7,500 మొక్కలను ఈ పార్కులో కొత్తగా పెంచుతున్నాం. కండ్లకోయ పార్కు వినియోగంలోకి వచ్చింది. కవాల్‌ టైగర్‌ రిజర్వు ప్రాజెక్టు సమీపంలో మంచిర్యాల జిల్లా చింతగూడ గ్రామంలో కొత్త పర్యావరణ, పర్యాటక ప్రాజెక్టు కోసం ఆరు ఎకరాల భూమిని గోదావరి నది దగ్గర సేకరించి, పర్యాటక స్థల అభివృద్ధి కోసం టెండర్లు పిలిచాం.

నల్లగొండ జిల్లాలోని వైజాగ్‌ కాలనీలో నాగార్జునసాగర్‌ తీర ప్రాంతంలో మరొక పర్యావరణ ప్రాజెక్టు కోసం భూమి గుర్తించాం. ప్రతిపాదనలు కీలక దశలో ఉన్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ అడవులను దట్టమైన అటవీ ప్రాంతంగా మార్చాలనేది ముఖ్య మంత్రి ఆకాంక్ష. సుమారు 3,470 హెక్టార్లలో అటవీ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో రక్షించటంతో పాటు పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. ఆక్రమణలకు గురికాకుండా దాదాపు 40 కి.మీ పొడవునా సీ త్రూ వాల్‌ను నిర్మిస్తాం. వెదురు పరిశ్రమ (బ్యాంబూ లంబర్‌ ఇండస్ట్రీ) ఏర్పాటుకోసం రూ.22.4 కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రతిపాదనలు కీలక దశలో ఉన్నాయి. ఇదివరకు కాగితం తయారీ కోసం పేపర్‌ మిల్లులు వెదురును కార్పొరేషన్‌ నుంచి కొనుగోలు చేసేవి. ప్రస్తుతం టెక్నాలజీ మార్పు కారణంగా వీటికి డిమాండ్‌ లేదు. బ్యాంబూ లంబర్‌ ఇండస్ట్రీని స్థాపించి ఈ ప్లాంటేషన్‌లలో లభించే వెదురును పూర్తిగా ఉపయోగించుకుంటే ఇది రైతులకు ఆదాయాన్ని పెంచుతుంది అని ఝా చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top