
జిల్లా స్థాయిలో సిట్, రెవెన్యూ డివిజన్లలో స్పెషల్ టీమ్
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు
రిజర్వ్ ఫారెస్టులో అటవీయేతర అవసరాలకు వ్యక్తులు, సంస్థలకిచ్చిన భూములను స్వాదీనం చేసుకునేందుకే టీమ్‌ల ఏర్పాటు
ఈనెల 15లోగా ఫారెస్ట్, సీఏ బ్లాక్‌లు, నోటిఫై చేయని బ్లాక్‌లలో ఇచ్చిన పట్టాలు, అటవీ ఆక్రమణలపై పూర్తి నివేదికకు ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: అటవీ భూములపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మళ్లీ అటవీ భూముల ఆక్రమణలు ఊపందుకోవడం, కొంతకాలంగా అటవీ, రెవెన్యూ శాఖల పరిధిలోని భూముల లెక్కలు, సరిహద్దు, సమన్వయ సమస్యలు తీవ్రం అయ్యాయి. ఈ నేపథ్యంలో అటవీభూముల అన్యాక్రాంతం, అటవీభూముల యాజమాన్య హక్కులు, అటవీ–రెవెన్యూ శాఖల మధ్య ఉన్న వివాదాల పరిష్కారానికి ఒక అడుగు ముందుకు పడింది.
రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వ్ ఫారెస్టుల్లో అటవీయేతర అవసరాలకు వ్యక్తులు, సంస్థలకు కేటాయించిన భూముల స్వా«దీనానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు (స్పెషల్ టీమ్స్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖ ఆదీనంలోని రిజర్వ్ ఫారెస్ట్ భూములను అటవీయేతర అవసరాల నిమిత్తం వ్యక్తులు, సంస్థలకు కేటాయింపులపై సిట్ పరిశీలన జరుపుతుంది.
ఇలాంటి భూముల కేటాయింపు, అ«దీనంలో ఉన్న వ్యక్తులు, సంస్థల నుంచి స్వా«దీనం చేసుకొని మళ్లీ అటవీశాఖకు అప్పగిస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోపాటు, కొన్ని రాష్ట్రాల్లో అటవీ ఆక్రమణలు, ఇతర అంశాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశాలకు అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని తప్పక ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కోర్టుల్లో, ఎన్‌జీటీ వద్ద కొన్ని కేసుల విషయంలో పిటిషన్ల (సివిల్) నేపథ్యంలో సిట్‌లు, స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.
ఈ నెల 15వ తేదీలోగా మొత్తంగా ఫారెస్ట్ బ్లాకులు, కాంపెన్సరేటరీ ఎఫారెస్టేషన్ బ్లాక్స్ (సీఏ బ్లాకులు), నోటిఫై చేయని బ్లాక్‌లలో ఇచ్చిన పట్టాలు, అటవీ ఆక్రమణలు, అటవీ వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించిన పూర్తి నివేదిక సమరి్పంచాలని జిల్లా అటవీ అధికారులకు పీసీసీఎఫ్ డా.సి.సువర్ణ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు రెవెన్యూ–అటవీశాఖల మధ్య ఎంతమేర వివాదాల్లో అటవీభూమి ఉందనే దానిపై అధికారికంగా స్పష్టమైన అంచనాలు లేవని తెలుస్తోంది.
ఇవీ పీసీసీఎఫ్ ఆదేశాలు..
ఇప్పటి వరకు కేటాయించిన పట్టాల గుర్తింపు, రిజర్వ్ ఫారెస్ట్, కాంపెన్సరేటరీ ఎఫారెస్టేషన్, అన్ నోటిఫైడ్ బ్లాక్‌లలో ఆక్రమణల గుర్తింపునకు అనెగర్జ్‌లను, నమూనా పత్రాలను అటవీ అధికారులకు పీసీసీఎఫ్ పంపించారు.
అనెగ్జర్–1లో : రాష్ట్రంలోని అన్ని సర్కిల్, జిల్లా, డివిజన్, అటవీ రేంజ్, బీట్, బ్లాక్‌లు, కంపార్ట్‌మెంట్‌ల వారీగా ఇప్పటి వరకు కేటాయించిన అటవీ పట్టాలు (ఎకరాల్లో), వీటి పరిధిలో ఆక్రమణలకు గురైన ప్రాంతాలు (ఎకరాల్లో), ఇంకా రెవెన్యూ శాఖతోపాటు ఇతర వివాదాలు, తదితరాలను పొందుపరచాలని ఆదేశించారు.
అనెగ్జర్–2లో : నోటిఫై చేసిన కాంపెన్సరేటరీ ఎఫారెస్టేషన్ (ప్రత్యామ్నాయ అటవీకరణ) బ్లాక్‌లతోపాటు ప్రతిపాదిత సీఏ బ్లాక్‌ల్లో సర్కిల్, జిల్లా, డివిజన్, అటవీ రేంజ్, బీట్, సీఏ బ్లాక్‌లు, కంపార్ట్‌మెంట్‌ల వారీగా ఇప్పటివరకు కేటాయించిన అటవీ పట్టాలు (ఎకరాల్లో), వీటి పరిధిలో ఆక్రమణలకు గురైన ప్రాంతాలు (ఎకరాల్లో), ఇంకా రెవెన్యూ శాఖతోపాటు ఇతర వివాదాలు తదితరాలను పొందుపరచాలని సూచించారు.
అనెగ్జర్–3లో: నోటిఫై చేయని బ్లాక్‌ల కోసం (అన్ నోటిఫైడ్ బ్లాక్‌లు) సర్కిల్, జిల్లా, డివిజన్, అటవీ రేంజ్, బీట్, సీఏ బ్లాక్‌లు, కంపార్ట్‌మెంట్‌ల వారీగా...ఇప్పటివరకు కేటాయించిన అటవీ పట్టాలు (ఎకరాల్లో), వీటి పరిధిలో ఆక్రమణలకు గురైన ప్రాంతాలు (ఎకరాల్లో), ఇంకా రెవెన్యూ శాఖతోపాటు ఇతర వివాదాలు వంటి వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన ఇప్పటికే గతనెలలో 8న, మళ్లీ 19వ తేదీన అరణ్యభవన్ నుంచి జిల్లాల వారీగా ఆక్రమణలకు సంబంధించి డేటాను పంపించాలని ఆదేశాలు జారీ అయ్యాయి