అక్రమ నిర్మాణాలకు అడ్డా   

Illegally Constructed Buildings In Sangareddy - Sakshi

కిష్టారెడ్డిపేటలో ఇష్టా రీతిన వెలుస్తున్న భవనాలు 

పత్తాలేని కార్యదర్శి పట్టించుకోని హెచ్‌ఎండీఏ అధికారులు

సాక్షి, పటాన్‌చెరు:  కిష్టారెడ్డిపేట అక్రమ నిర్మాణాలకు కేరాఆఫ్‌ అడ్రస్‌గా మారింది. పంచాయతీ కార్యదర్శి ఎవరికీ అందుబాటులో ఉండటం లేదు. హెచ్‌ఎండీఏ అనుమతులు లేనిది నిర్మాణాలు చేపట్టే ఆస్కారం అవకాశం లేదు. అయితే ఈ గ్రామ పంచాయతీలో మాత్రం కొందరు రాజకీయ నాయకులు తమ పలుకుబడి ఉపయోగించి అక్రమ పద్ధతుల్లో నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. బీరంగూడ–కిష్టారెడ్డిపేట రోడ్డుపై గత కార్యదర్శుల సంతకాలతో కూడిన అనుమతులతో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. హెచ్‌ఎండీఏ అనుమతులు ఉంటే ఆ రోడ్డు కావాల్సిన సెట్‌ బ్యాక్‌లు ఉండే అవకాశం ఉంది. కానీ పంచాయతీ అనుమతులతో సెట్‌ బ్యాక్‌లు లేకుండా నిర్మాణాలు కొనసాగుతున్నాయి.   

బీరంగూడ కమాన్‌ నుంచి సుల్తాపూర్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు జంక్షన్‌కు వెళ్లే దారిలో కిష్టారెడ్డిపేటలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సుల్తాన్‌ పూర్‌ జంక్షన్‌ నుంచి వచ్చే భారీ వాహనాలతో పాటు వేలాది కార్లు ఈ దారిలోనే వెళ్లాల్సి వస్తుంది.   అంతటి ప్రాముఖ్యత ఉన్న రోడ్డు ఇప్పుడు గోతులమయంగా ఉంది. వాస్తవానికి ఆర్‌అండ్‌బీ అధికారులు ఈ రోడ్డును డబుల్‌ రోడ్డుగా చేయాలనేది లక్ష్యంగా ఉంది. ఔటర్‌ జంక్షన్‌కు వెళ్లే రోడ్డు ఇదే కావడంతో ఆ రోడ్డుకు ఇరుపక్కల సెట్‌ బ్యాక్‌లు, పార్కింగ్‌ సౌకర్యాలు లేకుండా చేపడుతున్న నిర్మాణాలను ఆపాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామ పంచాయతీకి చెందిన పాలకవర్గం సభ్యులు కొందరు ఈ నిర్మాణాలను ఆపాలంటున్నారు. పంచాయతీ సర్పంచ్‌ ఏ.కృష్ణ కూడ గతంలో ఆ నిర్మాణాలు అడ్డుకోవాలని సూచించారు.

ఇటు రారు.. వచ్చినా పట్టించుకోరు 
అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన హెచ్‌ఎండీఏ అధికారులు కనీసం ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. తార్నకలోని హెచ్‌ఎండీఏ కార్యాలయం వీడి బయటకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక సమస్యలపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తే మాత్రం అక్రమార్కులతో చర్చలు జరిపి వారి నుంచి అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు దార్లను తార్నకకే రమ్మని చెప్తున్నారే..  తప్ప క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఆపడం లేదు. గతంలో పంచాయతీ కార్యదర్శి ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై నివేదికను హెచ్‌ఎండీఏ అధికార్లకు సమర్పించారు. మూడు నెల్లల క్రితం ఆ నివేదికలు ఇచ్చి అక్రమ నిర్మాణాలను కూల్చాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇదే విషయమై హెచ్‌ఎండీఏ అధికారి రమేశ్‌చరణ్‌ను  వివరణ కోరగా తనకు అధికారికంగా ఎలాంటి నివేదిక అందలేదన్నారు. వెంటనే అక్రమ నిర్మాణాలు ఆపాలని స్థానికులు కోరుతున్నారు.

తప్పకుండాచర్యలు తీసుకుంటాం 
అక్రమ నిర్మాణాలను కచ్చితంగా నిరోధిస్తాం, అందుకు తగిన చర్యలు తీసుకుంటాం. మండల ఈఓపీఆర్‌నకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తాం. అక్రమ నిర్మాణాలను కూల్చివేయిస్తాం. 
– వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top