డీజీపీఎస్‌ సర్వేతో అక్రమ మైనింగ్‌ గుర్తింపు

Illegal Mining Recognition With DGPS Survey - Sakshi

పెద్దేముల్‌ వికారాబాద్‌ : డీజీపీఎస్‌ (డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజీషనింగ్‌ సిస్టం)తో అక్రమ మైనింగ్‌ను గుర్తించవచ్చని మైనింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌(డీడీ) వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని మైనింగ్‌ కార్యాలయంలో అధికారులు, సుద్ద, క్వారీ యజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అంతకు ముందు పెద్దేముల్‌ మండలం కందనెల్లి తండా శివారులో ఉన్న క్రషర్‌ వద్ద హారితహారం సందర్భంగా మొక్కలు నాటారు.

అనంతరం డీడీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. డీజీపీఎస్‌ సర్వే ద్వారా అక్రమాలను గుర్తిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి లీజు తీసుకొని నిర్ణయించిన హద్దులు దాటితే డీజీపీఎస్‌ ద్వారా సులభంగా తెలుస్తోందని తెలిపారు. ఒడిశా రాష్ట్రంలో డీజీపీఎస్‌ ద్వారా చేపట్టిన సర్వే మంచి ఫలితాలను ఇస్తోందని చెప్పారు. ముఖ్యంగా తాండూరు ప్రాంతంలో సుద్ద, నాపరాయి, ఎర్రమట్టికి సంబంధించిన భూములు లీజు తీసుకొని.. ఆ తర్వాత పక్కనే ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో కూడా అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు.

ఈ సర్వే ద్వారా హద్దులు దాటిన వారిపై చర్యలు తీసుకుంటామని డీడీ తెలిపారు. అనంతరం లీజుదారులకు డీజీపీఎస్‌ వ్యవస్థపై అవగాహన కల్పించారు. సుద్ద, క్వారీకి సంబంధించి అన్ని వ్యవహారాలు ఆన్‌లైన్‌లోనే చేయాలని ఆదేశించారు. సుద్ద ఫ్యాక్టరీల పరిసరాల్లో కాలుష్యం వెదజల్లకుండా మొక్కలు నాటాలని సూచించారు. తాండూరు ప్రాంతంలో కాలుష్యం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్‌ ఏడీ రవి, అధికారులు సాంబశివ, రమేష్‌ ఉన్నారు.   

  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top