ప్రభుత్వం చేపట్టిన సర్కారు స్థలాల క్రమబద్ధీకరణ భూ కబ్జాదారుల పాలిట వరంగా మారింది. రూ.లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో రాత్రికి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ :ప్రభుత్వం చేపట్టిన సర్కారు స్థలాల క్రమబద్ధీకరణ భూ కబ్జాదారుల పాలిట వరంగా మారింది. రూ.లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపట్టి రెగ్యులరైజేషన్ చేసుకున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది ఈ అక్రమార్కులతో చేతులు కలిపి ప్రభుత్వ స్థలాలను దొడ్డిదారిన భూ ఆక్రమణదారులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇలా మంచిర్యాలకు సమీపంలో ఉన్న ముల్కల్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రికి అక్రమ నిర్మాణాలు చేపట్టిన భూ ఆక్రమణదారులపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. అలాగే కోర్టు వివాదాల్లో ఉన్న భూములను సైతం గుట్టుగా క్రమబద్ధీకరించుకునేందుకు రంగం సిద్ధమవుతోంది.
మంచిర్యాల నడిబొడ్డున రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలంలో గతంలో ఏకంగా ఓ అపార్టుమెంట్ నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణంపై కేసు హైకోర్టులో ఉంది. ఈ అపార్టుమెంట్‌ను కూడా అధికారులు క్రమబద్ధీకరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాల్లో పెద్ద మొత్తంలో చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం న్యాయస్థానం పరిధిలో ఉన్న భూములను క్రమబద్ధీకరించడం వీలు లేదు. అలాగే చెరువు శిఖం, నాలా, దేవాదాయ, మున్సిపల్, భూదాన్ స్థలాలను క్రమబద్ధీకరించడం కుదరదు. కానీ నిర్మల్, ఆదిలాబాద్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, భైంసా తదితర పట్టణాల్లో చెరువు శిఖం స్థలాల క్రమబద్ధీకరణకు యత్నిస్తున్నారు.
పాత తేదీల్లో గ్రామ పంచాయతీ రశీదులు..
ఉచిత క్రమబద్ధీకరణ జీవో నెం.58 కింద జిల్లా వ్యాప్తంగా 25,452 దరఖాస్తులు వచ్చాయి. అలాగే జీవో 59 కింద సుమారు 1,600 మంది దరఖాస్తు చేసుకున్నారు. 125 గజాల స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. ఇలా జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను ఈ నెల 4 నుంచి విచారణ చేపట్టారు. 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు ప్రభుత్వ స్థలాల్లో ఉన్న నివాస స్థలాలను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. అయితే.. కొందరు అక్రమార్కులు పంచాయతీ కార్యదర్శులతో కుమ్మక్కై ఇటీవల నిర్మాణాలు చేపట్టి వాటికి 2014 జూన్ కంటే ముందే నిర్మించినట్లు పాత తేదీల్లో రశీదులు సృష్టించి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులు, భూ ఆక్రమణదారులు, చోటామోటా నేతలు కలిసి ప్రభుత్వ భూములను అప్పనంగా కాజేసేందుకు చాలా చోట్ల ఈ క్రమబద్ధీకరణను ఆసరాగా చేసుకున్నారు. ఇలా క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులపై అధికారులు పకడ్బందీ విచారణ చేపట్టని పక్షంలో రూ.లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు అధికారికంగానే భూ ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లిపోనున్నాయి.