మెట్‌పల్లిలో జోరుగా అక్రమ నిర్మాణాలు

Illegal Constructions In Medipally - Sakshi

‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు

పట్టించుకోని టౌన్‌ప్లానింగ్‌ అధికారులు

మున్సిపల్‌ ఆదాయానికి భారీగా గండి

‘పట్టణ శివారులో జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న ఈ భవనాలకు మున్సిపల్‌ నుంచి గ్రౌండ్‌ ఫ్లోర్‌లతో పాటు రెండు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకున్నారు. కానీ అదనంగా మరో అంతస్తును నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు.’ 

మెట్‌పల్లి (కరీంనగర్‌) :   మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మా ణాలు జోరుగా సాగుతున్నా యి. టౌన్‌ప్లానింగ్‌ వి భాగం అధికారుల అం డతో నిబంధనలకు విరుద్ధంగా సా గుతున్న నిర్మాణాలతో మున్సిపల్‌ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మున్సిపల్‌ నుంచి అనుమతులు పొందకపోయిన అనుమతి తీసుకొని అంతకుమించి అంతస్తులు నిర్మిస్తున్నారు. అయినా అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. పట్టణంలోని వెల్లుల్లరోడ్‌లో ఓ వ్యక్తికి మొదట జీ+1 భవనానికి అనుమతి ఇచ్చిన అధికారులు.. తర్వాత భవనం నిర్మాణంలో ఉండగా పాత అనుమతిని పరిగణనలోకి తీసుకోకుండా కొత్తగా జీ+2 నిర్మాణానికి అనుమతులు జారీ చేశారు. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన ఈ అనుమతి వ్యవహారా>న్ని ‘సాక్షి’ ఇటీవల బయటపెట్టింది. ఆ తర్వాత పలు కాలనీల్లో ఇలాంటి అక్రమాలను స్థానికులు ‘సాక్షి’ దృష్టికి తీసుకొస్తున్నారు. వీటిపై పరిశీలన జరుపగా, అధికారులు మున్సిపల్‌ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారనే విషయం తేటతెల్లమైంది.  

కాసులిస్తేనే అనుమతులు ! 
టౌన్‌ప్లానింగ్‌ విభాగం అధికారులు ముడుపులిస్తేనే అనుమతులు జారీ చేస్తారనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. నిర్మాణాలకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ లంచం ఇస్తేనే అనుమతులు జారీ చేస్తున్నారని.. లేనిపక్షంలో దానిని షార్ట్‌ఫాల్‌ కింద పెండింగ్‌లో పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో తప్పనిసరిగా అనుమతులు జారీచేయాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. లేనిపక్షంలో అధికారులే జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు నిర్ధేశిత సమయంలోపు తమ చేతికి ముడుపులు అందింతే అనుమతులు జారీ చేస్తున్నారు. లేకుంటే ఏదో ఒకటి కారణాన్ని సాకుగా చూపుతూ సంబంధిత ఫైళ్లను పెండింగ్‌లో పెడుతూ వస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొన్ని దరఖాస్తుల విషయంలో మున్సిపల్‌కు ఫీజు రాకుండా అడ్డుపడుతున్నారనే ప్రచారం ఉంది. రూ.లక్షల్లో ఫీజు అవుతుందని దరఖాస్తుదారులకు చెబుతూ అనుమతులకు బదులు తమ జేబులు నింపుకుంటూ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే... 
టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్న విషయం ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే బయటపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానికంగా కొత్తగా నిర్మిస్తున్న భవనాల్లో 90 శాతం మేర నిబంధనలకు విరుద్ధంగానే సాగుతున్నాయి. ఇందులో కొన్ని భవనాల్లో తీసుకున్న అనుమతుల కంటే అదనంగా అంతస్తులు నిర్మించడం, మరికొన్ని అనుమతులు తీసుకోకుండానే నిర్మిస్తున్నవి ఉండడం గమనార్హం.     

ఇష్టారాజ్యానికి నిదర్శనమిదిగో.. 
పట్టణంలోని వెల్లుల్ల రోడ్‌లో జీ+1 అనుమతి తీసుకొని అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మించిన ఇంటికి అధికారులు కొత్తగా జీ+2 అనుమతులిచ్చారు. పాత అనుమతిని పక్కనపెట్టి కొత్తగా అనుమతులివ్వడం నిబంధనలకు పూర్తి విరుద్ధం. ఇదిలా ఉంటే.. శివాజీనగర్‌లో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయంలో అధికారులు జాప్యం చేయడంతో అతడు పనులు మొదలుపెట్టాడు. అనంతరం అనుమతిపత్రాల కోసం వెళితే పనులు మొదలుపెట్టిన ఇంటికివ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకున్నారు. కానీ వెల్లుల్ల రోడ్‌లో భవనానికి పాత అనుమతిని పక్కన బెట్టి కొత్తగా అనుమతులివ్వరాదు. అధికారులు అనుమతుల జారీ విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.     

టీపీబీఓ తిరుపతమ్మకు మెమో 
పట్టణంలోని వెల్లుల్లరోడ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఓ భవనానికి అనుమతులు ఇచ్చిన వ్యవహారంపై ‘సాక్షి’లో ఈ నెల 18న ‘సక్రమం పేరుతో అక్రమం’ శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. దీంతోపాటు స్థానికంగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై టీపీబీవో తిరుపతమ్మను సంజాయిషీ అడుగుతూ మెమో ఇవ్వాలని నిర్ణయించినట్లు కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆమె సెలవులో ఉన్నారని, వచ్చిన వెంటనే మెమో జారీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. 

అక్రమమైతే కూల్చివేస్తాం
నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మిస్తే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. త్వరలోనే నూతన మున్సిపల్‌ చట్టం అమలులోకి రాబోతుంది. దీని ప్రకారం అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తాం. దరఖాస్తుదారులు మున్సిపల్‌ నుంచి అనుమతులు తీసుకొని దాని ప్రకారమే భవనాలు నిర్మించుకోవాలి. అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించాం. ఎక్కడైన అలాంటివి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.  
– జగదీశ్వర్‌గౌడ్, కమిషనర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top