సోషల్‌ చెత్తకు చెక్‌ | IIIT Plan For Avoid Mis Use Of Social Media | Sakshi
Sakshi News home page

సోషల్‌ చెత్తకు చెక్‌

Oct 14 2019 4:02 AM | Updated on Oct 14 2019 4:02 AM

IIIT Plan For Avoid Mis Use Of Social Media - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: సామాజిక మాధ్యమాల్లో అవాంఛనీయ సమాచారానికి చెక్‌ పెట్టేందుకు నగరంలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బృందం వినూత్న టూల్‌ను రూపొందించింది. ‘నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌’ పేరిట రూపొందించిన ఈ టూల్‌ అనవసర సమాచారాన్ని కట్టడి చేయడంతో పాటు అలాంటి సమాచారం వచ్చినప్పుడు అలర్ట్‌ను సైతం ఇస్తుంది.  కౌమార దశలో ఉన్నవారు అవాంఛిత ఫొటోలు, సమాచారాన్ని చూసినప్పుడు వారిలో  భావోద్వేగాలు విపరీత ప్రవర్తనకు దారితీస్తుంటాయి. ఈ అవాంఛనీయ సమాచారాన్ని కట్టడి చేసేందుకు ఈ టూల్‌ను రూపొందించింది.

టూల్‌ పనిచేస్తుందిలా.. 
ఎన్‌ఎల్‌పీ టూల్‌ను పిల్లలు తరచూ వాడే మొబైల్‌ లేదా సిస్టమ్‌లో ఇన్‌స్టాల్‌ చేయాల్సి ఉంటుంది. ఈ టూల్‌ మొదట ఇన్‌స్ట్రాగామ్‌లో వచ్చే అవాంఛిత ఫొటోలు, సెక్స్‌ సంబంధిత దృశ్యాలు, జాతి విద్రోహ చర్యలు, ఇతర బావోద్వేగాలను రెచ్చగొట్టే ఫోటోలు, సమాచారాన్ని ఫిల్టర్‌ చేస్తుంది. వీటి నుంచి అవసరమైన సమాచారాన్ని మాత్రమే అందిస్తుందని ఈ టూల్‌ రూపొందించిన బృందంలోని సభ్యుడు వాసుదేవవర్మ ‘సాక్షి’కి తెలిపారు. వాంఛనీయం కాని సమాచారం వచ్చినప్పుడు ఆయా లింక్‌లు, ఫొటోలను ఓపెన్‌ చేయరాదన్న అలర్ట్‌ను ఇస్తుందని చెప్పారు. పాజిటివ్‌ సమాచారానికి సంబంధించిన అలర్ట్‌లు సైతం యూజర్లకు అందిస్తుందని తెలిపారు. ఇటీవలి కాలంలో కౌమార దశలో ఉన్న బాలబాలికల్లో సోషల్‌ మీడియా వినియోగం అనూహ్యంగా పెరిగిందని.. వీరిలో బావోద్వేగాలు అదుపులో ఉండని కారణంగా సుమారు 30 నుంచి 35 శాతం మందిలో విపరీత ప్రవర్తనలు, చెడు దారిపట్టడం, డిప్రెషన్‌కు గురవడం వంటి విపరిణామాలు సంభవిస్తున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైందని చెప్పారు.
 
త్వరలో మిగతా మాధ్యమాలకు.. 
ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ టూల్‌ను తొలుత ఇన్‌స్ట్రాగామ్‌కు మాత్రమే పరిమితం చేశామని.. ఇది సత్ఫలితాలను ఇస్తోందని వాసుదేవవర్మ తెలిపారు. కొన్ని రోజుల పాటు దీనిని పరిశీలించిన తర్వాత ట్విట్టర్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్‌ తదితర సామాజిక మాధ్యమాల్లోనూ వినియోగించే అంశంపై దృష్టిసారించామని చెప్పారు. దీనికి అనుగుణంగా ఈ టూల్‌లో మార్పుచేర్పులు చేస్తామని వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement