నేనూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినే..

I Am A Public School Student : Collector Dharmareddy - Sakshi

కలెక్టర్‌ ధర్మారెడ్డి

హవేళిఘణాపూర్‌(మెదక్‌): నేనూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినే. టీచర్లు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినేవాడినంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు కలెక్టర్‌ ధర్మారెడ్డి. మండల పరిధిలోని కూచన్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో వీజేఎన్‌ ఫౌండేషన్‌ ద్వారా 2017–18 విద్యా సంవత్సరంలో చిన్నశంకరంపేట, రామాయంపేట, హవేళిఘణాపూర్, వెల్దుర్తి, చేగుంట, మండలాలకు చెందిన పదవ తరగతి స్కూల్‌ టాపర్లు, మండలాల టాపర్లకు నగదు పురస్కారం, ప్రశంస పత్రాలను శుక్రవారం అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ అవార్డులు విద్యార్థులకు ఎంతో ప్రేరణ కలిగిస్తాయన్నారు. విద్యార్థులు కష్టపడి చదివేలా కాకుండా ఇష్టపడి చదివేలా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు కేవలం ప్రశ్న, జవాబులకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించేలా చూడాలని, ఇందులో పీఈటీలకు ముఖ్య పాత్ర ఉంటుందన్నారు. విద్యార్థి చేసే ప్రతి పనిని గ్రహించి, సమాజానికి ఉపయోగ పడే పౌరుడిగా తయారు చేయాలని సూచించారు. 

అవార్డుల ద్వారా విద్యార్థులను ప్రొత్సహిస్తున్న వీజేఎన్‌ ఫౌండేషన్‌ను కలెక్టర్‌ అభినందించారు. అనంతరం జిల్లా నోడల్‌ అధికారి మధుమోహన్‌ మాట్లాడుతూ అంకుర బోధన కార్యక్రమాన్ని త్వరలోనే ప్రాథమిక పాఠశాలలో చేపడతామన్నారు. ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్‌లు, లైబ్రెరీలు ఏర్పాటు చేశామన్నారు. లైబ్రెరీలో కేవలం పాఠ్యా పుస్తకాలు మాత్రమే కాకుండా జనరల్‌ నాలెడ్జ్‌కు సంబంధించిన పుస్తకాలు సైతం పొందుపర్చినట్లు వివరించారు.

కాగా ఆయా మండలాల టాపర్లు, స్కూల్‌ టాపర్లకు రూ. 3వేల గనదు పురస్కారంతో పాటు ప్రశంస పత్రాలను వీజేఎన్‌ పౌండేషన్‌ నిర్వాహకులు శ్రీనివాస్‌ గౌడ్, మహేష్‌ రెడ్డిలు అందించారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో కలెక్టర్‌ మొక్కలను నాటారు.

కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి రాజిరెడ్డి, జిల్లా పరీక్షల నిర్వాహకులు భాస్కర్, గ్రామ సర్పంచ్‌ మహేందర్‌ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, రామేశ్వ ప్రసాద్, ఎంపీటీసీ ప్రియాంక, ఎస్‌ఎంసీ చైర్మన్‌ పాండరిగౌడ్‌ తదితరులున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top