
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ సోకకుండా మాస్కు ధరించడం తప్పనిసరి చేసినా.. నగరవాసులు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. మాస్కు ధరించకపోతే పోలీసులు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్న విషయం తెలిసిందే. మాస్కు ఉల్లంఘనలను సీసీ కెమెరాల్లో అమర్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పోలీసు శాఖ గత వారం రోజులుగా గుర్తిస్తోంది. బుధవారం వరకు కేసుల సంఖ్య 4,719 దాటాయి. ఇలా నమోదవుతున్న కేసుల్లో జిల్లాల్లో తక్కువగా, నగరాల్లోని కమిషనరేట్లలో అధికంగా ఉండటం గమనార్హం. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ ఉల్లంఘనలు మరీ అధికంగా ఉన్నాయి. (అవి తగ్గడంతోనే రిస్క్ పెరిగింది)
పాతబస్తీలో ఈ నిబంధనను ప్రజలు సరిగ్గా పట్టించుకోవడం లేదు. కేవలం ఐదు రోజుల్లోనే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,315 కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో వరంగల్ (603), రామగుండం (472), రాచకొండ (390), ఖమ్మం (197) నిలిచాయి. కాగా, కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు అందరూ విధిగా మాస్కు ధరించాల్సిందేనని డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు.