చైనా 'బే'జార్‌

Hyderabad People Avoiding Chinese Products And Food - Sakshi

నగరంలో చాలాచోట్ల ‘చైనా బజార్‌’ పేరు కనుమరుగు

చైనా వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపని ప్రజలు

వెలవెలబోతున్న చైనీస్‌ ఫుడ్‌ కోర్టులు

పేర్లు మార్చుకుంటున్న చైనా బజార్ల నిర్వాహకులు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న నినాదం ఒక్కటే.. ‘చైనా వస్తువుల్ని బహిష్కరించాల’ని.. మన దేశంలో తన వస్తువులు అమ్ముకొని బతికే చైనా.. మన సైనికులపై రాళ్లతో దాడి చేసి పొట్టన పెట్టుకోవడం ఏంటని..? ఓవైపు కరోనా మహమ్మారిని ప్రపంచంపై వదిలి లక్షల ప్రాణాలను తీసుకుంటోందని.. మరోవైపు తన సైన్యాన్ని భారత్‌పై ఉసిగొల్పుతోందని ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే ఫోన్లలో ఉండే చైనీస్‌ యాప్‌లను వేల సంఖ్యలో డిలీట్‌ చేసి.. ‘నేను దేశభక్తి చాటుకున్నాను’ అంటూ వాట్సాప్‌లో పోస్టులు పెడుతున్నారు. ఈ నినాదం నగరంలో జోరుగా వినిపిస్తోంది. చైనా వస్తువులను బహిష్కరించాలని పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ చైనా వస్తువులనుబహిష్కరించి దేశభక్తి చాటుకోవాలని కోరుతున్నారు. మనదగ్గరే కుటీర పరిశ్రమల్లో తయారైన వస్తువులను కొనుగోలు చేయాలని అంటున్నారు. దీంతో నిత్యం కిటకిటలాడే చైనా బజార్లు వెలవెలబోతున్నాయి. చైనీస్‌ ఫుడ్‌ని సైతం నగరవాసులు ఇష్టపడటం లేదు. అప్రమత్తమైన వ్యాపారులు చైనా బజార్ల బోర్డులు తొలగిస్తున్నారు. 

అంబర్‌పేట: చైనా వస్తువులు కొనుగోలు చేయవద్దంటూ ప్రచారం నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లోని చైనా బజార్ల నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. చైనా బజార్ల బోర్డులను తొలగిస్తున్నారు. స్థానిక పేర్లతో వ్యాపారాలు సాగించుకుంటున్నారు. అవసరమైన వస్తువులను స్థానికంగా కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. 

మనమూ తయారు చేయవచ్చు..
చైనా బజార్లలో విక్రయించే చైనా వస్తువులను ఇక్కడే తయారు చేయవచ్చని పలువురు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకొని ఇక్క డ విక్రయాలు సాగించే పరిస్థితి నుంచి బయట పడేందుకు ప్రభుత్వాలు అండగా ఉండాలంటున్నారు. చైనా నుంచి వచ్చి ఇక్కడ విక్రయాలు జరిగే వరకు వేచి చూడకుండా ప్రభుత్వం నిషేధిస్తే ఇక్కడి వరకు ఎలా వస్తాయంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చైనా బజార్లలో అమ్మే ప్రతి వస్తువు చైనాది కాదంటున్నారు. 

చైనీస్‌ ఫుడ్‌ రెస్టారెంట్లు ఢమాల్‌
సనత్‌నగర్‌:  నగరంలో చైనీస్‌ ఫుడ్‌ రెస్టారెంట్లు డీలా పడిపోయాయి. చైనా వంటకాలను లొట్టలేసుకుని తినే భోజన ప్రియులు ఇప్పుడు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. నగరవాసులు సరికొత్త రుచులను ఆహ్వానించేందుకు ముందుంటారు. ఈ క్రమంలో సిటీజనుల జిహ్వా రుచులను పట్టేసిన చైనీస్‌ ఫుడ్‌ రెస్టారెంట్ల నిర్వాహకులు ఎప్పటికప్పుడు కొత్త రుచులను అందిస్తూ వచ్చారు. అయితే కరోనా తోడు తాజాగా చైనా–భారత్‌ సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘర్షణల్లో భారత సైనికులు అమరులుకావడం.. దీంతో ఆ దేశీయ ఉత్పత్తుల వాడకాన్ని నిషేధిద్దామనే ప్రచారం ఊపందుకుంది. దీనిపై సోషల్‌ మీడియాలో ఉవ్వెతున ఉద్యమమే నడుస్తోంది. ఈ క్రమంలో చైనా పేరు వినిపిస్తేనే కొంత ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. అలాంటిది చైనీస్‌ ఉత్పత్తులే కాదు.. చైనీస్‌ ఫుడ్‌పై కూడా నిషేధాన్ని విధిస్తున్నారా? అన్న పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. బిజినెస్‌ భారీగా పడిపోయి ఆయా రెస్టారెంట్లు కుదేలవ్వడమే ఇందుకు నిదర్శనం. 

5–10 శాతమే వ్యాపారం..
కరోనా వైరస్‌ చైనాలో పుట్టిందని తెలిసినప్పటి నుంచే ఆయా వంటకాలకు క్రమేపీ డిమాండ్‌ తగ్గుతూ వచ్చింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే చైనీస్‌ ఫుడ్‌ రెస్టారెంట్ల బిజినెస్‌ 30 శాతానికి పడిపోగా, లాక్‌డౌన్‌ తర్వాత మరింత పతనావస్థకు చేరుకుంది. దీనికి తోడు చైనా కవ్వింపు చర్యలకు దిగడమే కాకుండా ఘర్షణల్లో భారత్‌ సైనికులను పొట్టన పెట్టుకున్న దగ్గర నుంచి చైనా ఉత్పత్తులు అంటే మండిపోతున్నారు. ఈ క్రమంలో కేవలం 5–10 శాతం మాత్రమే వ్యాపారం జరుగుతుందనేది రెస్టారెంట్ల నిర్వాహకులు చెప్పేమాట. గతంలో లక్ష వ్యాపారం జరిగే చోట రూ.5–10 వేలకు పడిపోయింది. సాధారణంగా చైనీస్‌ రెస్టారెంట్లలో ఎక్కువ శాతం వివిధ రకాల సూప్‌లతో పాటు చికెన్, మటన్, చేపలు, రొయ్యలతో వివిధ రకాల వంటకాలను తయారుచేసి అందిస్తుంటారు. ఆయా రకాల వంటకాలు హైదరాబాదీయులను నోరూరించేవే.. కానీ చైనీస్‌ అనే పదం వినిపిస్తే చాలు.. భోజన ప్రియులు ఆమడదూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

తెరుచుకోని మెయిన్‌ ల్యాండ్‌ చైనా రెస్టారెంట్‌..
సమస్త చైనీస్‌ వంటకాలకు పెట్టింది పేరు గ్రీన్‌ల్యాండ్స్‌ ప్రాంతంలోని మెయిన్‌ ల్యాండ్‌ చైనా రెస్టారెంట్‌. సాధారణంగా ఎక్కువ శాతం ఇక్కడి వారే చైనీస్‌ ఫుడ్‌ రెస్టారెంట్లను నెలకొల్పి నిర్వహిస్తుండగా,  మెయిన్‌ల్యాండ్‌ చైనా రెస్టారెంట్‌ మాత్రం అచ్చంగా చైనీయులకు సంబంధించినదేనన్న పేరును మూటగట్టుకుంది. ఇక్కడ దొరకని చైనీస్‌ వంటకం అంటూ ఏమీ ఉండదు. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి మూసివేసిన ఈ రెస్టారెంట్‌ ఇప్పటి వరకు తెరుచుకోలేదు. అనివార్య కారణాల వల్ల తెరవలేకపోయామని, అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ నిర్వాహకులు బోర్డును కూడా ఏర్పాటుచేశారు. ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితుల్లో ఓపెన్‌ చేసినా చైనీస్‌ వంటకాలను ఎక్కువగా ఇష్టపడరనే ఆలోచనతోనే ఈ రెస్టారెంట్‌ను ఇంకా ఓపెన్‌ చేయలేదని తెలుస్తోంది. 

చైనీస్‌ ఫుడ్‌కు డిమాండ్‌ పడిపోయింది
కరోనా దెబ్బకు తోడు ఇప్పుడు చైనా, భారత్‌ మధ్య జరుగుతున్న ఘర్షణలతో చైనీస్‌ వంటకాలకు డిమాండ్‌ భారీగా పడిపోయింది. 5 శాతం మాత్రమే ఇప్పుడు జరుగుతుంది. హోటల్‌ అద్దె రూ.2 లక్షలు చెల్లించాలి. సిబ్బంది 30 మంది ఉండేవారు. ప్రస్తుతం 11 మందే విధులు నిర్వర్తిస్తున్నారు. కనీసం జీతాలు, అద్దెలు చెల్లించాలంటేనే గగనమయ్యే పరిస్థితులు ఉన్నాయి. మళ్లీ సాధారణ స్థితి ఎప్పటికి వస్తుందో తెలియడం లేదు.– నూర్, బౌల్‌ ఓ చైనా రెస్టారెంట్‌ ఉద్యోగి, బేగంపేట.

గిరాకీ లేక వెలవెలబోతున్న చైనా బజార్లు
గోల్కొండ: చైనా బజార్లలో గిరాకీ తగ్గింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో అసలే అంతంత మాత్రం గిరాకీ ఉన్న చైనా బజార్లు సరిహద్దులో చైనా దుశ్చర్య కారణంగా భారత్‌ జవాన్లు వీరమరణం పొందిన తర్వాత చైనా బజార్ల నిర్వాహకులు జాగ్రత్తపడ్డారు. చైనా వస్తువులను బహిష్కరించాలన్న పిలుపు మేరకు గుడిమల్కాపూర్, మెహిదీపట్నం, టోలిచౌకి తదితర ప్రాంతాల్లోని చైనా బజార్ల నిర్వాహకులు రాత్రికి రాత్రే తమ తమ షోరూంలలోని చైనా వస్తువులను తీసేశారు. ప్రస్తుతం ఆ షాపుల్లో ప్లాస్టిక్‌ సామాగ్రి, పూల కుండీలు, ప్లాస్టిక్‌ పూలతో పాటు హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలలో తయారైన వస్తువులను మాత్రమే అమ్ముతున్నారు. చైనా వస్తువులను ఇక నుంచి విక్రయించేదిలేదని చైనా బజార్‌ నిర్వాహకులు అంటున్నారు.

ప్రోత్సహిస్తే బావుంటుంది  
మా దుకాణంలో అమ్మే చైనా వస్తువులను ఇక్కడే తయారు చేయవచ్చు. నేను గతంలో ప్రైవేట్‌ ఉద్యోగం చేశాను. ఆదాయం సరిపోక ఈ వ్యాపారంలోకి దిగాను. హోల్‌సేల్‌ దుకాణదారుల నుంచి వస్తువులు తెచ్చుకొని అమ్ముకుంటాం. రెండు, మూడు దశల్లో తమకు ఈ వస్తువులు చేరుతాయి. చైనాలో ఉపాధి కోసం 72 గంటల్లో బ్యాంకు నుంచి రుణం మంజూరవుతుందని విన్నాను. ఇక్కడ ఆసక్తి, ప్రతిభ ఉన్నా అలాంటి ప్రోత్సాహం లేకపోవడంతో ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది.– షకీర్, అంబర్‌పేట, చైనాబజార్‌ మేనేజర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top