మెట్రో జర్నీ@ 4 లక్షలు

Hyderabad Metro Record in More Than 4Lakh Passengers - Sakshi

సోమవారం నాలుగు లక్షలమందికి పైగా ప్రయాణం

4 అదనపు రైళ్లు 120 అదనపు ట్రిప్పులు

మొత్తంగా 830 మెట్రో ట్రిప్పులు

కొద్దిసేపు బేగంపేట్‌ మెట్రోస్టేషన్‌కు తాళం  

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌వాసుల కలల మెట్రో మరో రికార్డు  సృష్టించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు పోటెత్తడంతో సోమవారం నాలుగు లక్షలకు పైగా ప్రయాణికుల జర్నీతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు మెట్రోరైళ్లలో 3.75 లక్షలమంది జర్నీ చేయడమే ఇప్పటివరకు నమోదైన రికార్డు కాగా..సోమవారం రికార్డుతో పాత రికార్డు బద్దలైంది. పలు ప్రధాన రూట్లలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో లక్షలాదిమంది మెట్రోరైళ్లను ఆశ్రయించారు. దీంతో 4 అదనపు రైళ్లు..120 అదనపు ట్రిప్పులను నడిపారు. మొత్తంగా సోమవారం 830 ట్రిప్పుల మేర మెట్రో సర్వీసులను నడపడం విశేషం. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పీక్‌ అవర్స్‌లో ప్రతి 3.5 నిమిషాలకు..ఇతర సమయాల్లో ప్రతి ఏడు నిమిషాలకో రైలును నడిపినట్లు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. స్టేషన్లలో అధిక రద్దీ నేపథ్యంలో....ట్రిప్పులను అదనంగా నడిపామన్నారు. ప్రధానంగా ఎల్బీనగర్‌–మియాపూర్‌ రూట్లలో ఎల్భీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎంజీబీఎస్, నాంపల్లి, లక్డికాపూల్, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మియాపూర్‌ స్టేషన్లు కిక్కిరిశాయి. స్టేషన్లలోకి చేరుకునేందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులు బారులు తీరారు. అన్ని మెట్రో రైళ్లు ప్రయాణికుల రద్దీతో కిక్కిరిశాయి. ఇక నాగోల్‌–హైటెక్‌సిటీ రూట్లోని నాగోల్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, బేగంపేట్, మాదాపూర్, హైటెక్‌సిటీ స్టేషన్లలో వేలాది మంది మెట్రో రైళ్లకోసం నిరీక్షించడం కనిపించింది. ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో ఆయా స్టేషన్లలో అదనపు టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేసి, ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు. 

 అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ
బేగంపేట్‌ మెట్రోస్టేషన్‌కు తాళం..
ప్రగతి భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు బేగంపేట మెట్రో స్టేషన్‌కు అధికారులు తాళం వేశారు. నిరసన కారులు స్టేషన్‌లోకి చొచ్చుకు రావచ్చనే అనుమానాలతో ముందస్తు జాగ్రత్తగా బేగంపేట మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. కాగా భద్రతా కారణాల రీత్యా బేగంపేట మెట్రో స్టేషన్‌లో రైలు ఆగదంటూ మెట్రో అధికారులు ముందుగానే ప్రతి మెట్రో స్టేషన్‌లో నోటీసు అంటించడం విశేషం. అయితే స్టేషన్‌ మూసివేత కారణంగా ఈ స్టేషన్‌లో దిగాల్సిన ప్రయాణికులు ముందు స్టేషన్‌లో దిగాల్సి రావడంతో ఇబ్బందులు పడ్డారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top