జెన్‌కో చేతికే హైడల్‌ ప్రాజెక్టులు | hydel power projects to genco | Sakshi
Sakshi News home page

జెన్‌కో చేతికే హైడల్‌ ప్రాజెక్టులు

Jun 8 2018 1:48 AM | Updated on Jun 8 2018 1:48 AM

hydel power projects to genco - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి నదులపై కొత్త జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)కు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషీ ఉత్తర్వులు జారీ చేశారు.

కృష్ణా, గోదావరిపై జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతలను నీటిపారుదలశాఖకు అప్పగిస్తూ 2010 మార్చి 11న నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీవో 21)ను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

జెన్‌కో చేతికి తుపాకులగూడెం ప్లాంట్‌!
తెలంగాణ ఆవిర్భావం తర్వాత జెన్‌కో ఆధ్వర్యంలో దిగువ జూరాల, పులిచింత జల విద్యుత్‌ కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టగా, ఇప్పటికే దిగువ జూరాల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. పులిచింతల విద్యుదుత్పత్తి కేంద్రం పనులూ చివరి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే జెన్‌కో చేతిలో జలవిద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన పనులు ఉండవు. మరోవైపు దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరిపై తుపాకులగూడెం వద్ద బ్యారేజీతోపాటు 240 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని వ్యాప్కోస్‌ సంస్థ డీపీఆర్‌లో సిఫారసు చేసింది.

అలాగే గోదావరిపై తుమ్మిడిహెట్టి, ఎల్లంపల్లి, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, దుమ్ముగూడెం రిజర్వాయర్ల పనులను జరుపుతుండటంతో వాటికి అనుసంధానంగా జల విద్యుత్‌ కేంద్రా ల నిర్మాణానికి ఉన్న అవకాశాలపై ప్రభుత్వం అధ్యయనం జరుపుతోంది. నీటిపారుదలశాఖ ఆధ్వర్యంలో డ్యామ్‌లను, జెన్‌కో ఆధ్వర్యంలో జల విద్యుదుత్పత్తి కేంద్రాలను నిర్మిస్తున్నారు. జల విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్మాణం, డిజైన్ల రూపకల్పన, నిర్వ హణలో జెన్‌కో  అనుభవాన్ని కలిగి ఉంది.

అయితే గోదావరిపై కొత్త జల విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణ పనులు చేపట్టేందుకు ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన ఉత్తర్వులు జెన్‌కోకు అడ్డుగా మారాయి. ఈ నేప థ్యంలో పాత ఉత్తర్వులను సవరించి తుపాకులగూడెం జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులను తమకు అప్పగించాలని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం అభిప్రాయంగా కోరగా నీటిపారుదలశాఖ  శాఖ సానుకూలంగా స్పందించింది. జల విద్యుత్‌ కేంద్రాల నిర్మాణ పనులను జెన్‌కోకు అప్పగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. దీంతో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement