కొత్త ఏడాదిలోనూ భారీగా నియామకాలు | Distribution of appointment documents to GENCO AE candidates: Bhatti Vikramarka | Sakshi
Sakshi News home page

కొత్త ఏడాదిలోనూ భారీగా నియామకాలు

Jan 7 2025 1:19 AM | Updated on Jan 7 2025 1:19 AM

Distribution of appointment documents to GENCO AE candidates: Bhatti Vikramarka

జెన్‌కో ఏఈ అభ్యర్థికి నియామక పత్రం అందజేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి, కేకే, షబ్బీర్‌అలీ

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఏడాదిలో 56 వేల కొలువులు భర్తీ చేసినట్లు వెల్లడి

జెన్‌కో ఏఈ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ

సాక్షి, హైదరాబాద్‌:     ‘ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసింది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి జాబ్‌ కేలండర్‌ ప్రకటించింది. పారదర్శకంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి ఏడాదిలో 56 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. ప్రతి నెలా ఏదో ఒక నియామక పత్రాలు అందజేస్తున్నాం. నూతన సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున నియామకాలుంటాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తాయి..’అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.

తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)లో ఏఈ పోస్టులకు ఎంపికైన 315 మంది అభ్యర్థులకు సోమవారం ఆయన నియామక పత్రాలు అందజేశారు. సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొలువుల కోసం కొట్లాడిన నిరుద్యోగుల ఆశలను గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పాలకులు అడియాసలు చేశారని విమర్శించారు. కొలువులు లేక నిరాశ నిస్పృహలకు గురైన నిరుద్యోగ యువత ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఉద్యోగాలు వస్తాయని భావించి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని అన్నారు. వారి ఆశలు వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు, స్వయం ఉపాధి కల్పించేందుకు సీఎం, మంత్రివర్గం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు.  

9న రెన్యూవబుల్‌ ఎనర్జీ పాలసీ ప్రకటన 
దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఈ నెల 9న తెలంగాణ రెన్యూవబుల్‌ ఎనర్జీ పాలసీ–2025ని ప్రకటించనున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. తెలంగాణను మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఇందుకోసం అదనంగా 20 వేల మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. 2030 నాటికి రాష్ట్ర గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 22,448 మెగావాట్లకు చేరుకుంటుందని సెంట్రల్‌ ఎలక్రి్టసిటీ ఆథారిటీ (సీఈఏ) అంచనా వేసిందని, ఆ మేరకు విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.     

‘చెమట చుక్కలకు తర్పీదు’లోగో ఆవిష్కరణ
సింగరేణి సంస్థ రూపొందించిన ‘చెమట చుక్కలకు తర్పీదు’లోగోను డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. దేశ, విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై కోల్‌ బెల్ట్‌ యువతకు అవగాహన కల్పించేందుకు సింగరేణి సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్‌ అలీ, ఇంధన శాఖ ముఖ్య కార్యదిర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, సింగరేణి సీఎండీ ఎన్‌.బలరాం నాయక్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement