భద్రత కట్టుదిట్టం..!  | huge security to avoid suicidal attempts in front of government offices in jagtial | Sakshi
Sakshi News home page

భద్రత కట్టుదిట్టం..! 

Jan 26 2018 7:55 PM | Updated on Nov 6 2018 7:53 PM

huge security to avoid suicidal attempts in front of government offices in jagtial - Sakshi

ఎస్పీ కార్యాలయం వద్ద పోలీస్‌ బందోబస్తు 

ఇకపై కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాల లోపలికి వెళ్లాలంటే అర్జీదారులు కాస్త ఇబ్బంది పడాల్సిందే. దరఖాస్తుదారులు ఎవరైనా సరే తమ వెంట తెచ్చుకున్న వస్తువులు, పత్రాలను ఆయా కార్యాలయాల బయట పోలీస్‌ సిబ్బందికి చూపించాకే లోపలికి వెళ్లాల్సిన పరిస్థితులొచ్చాయి. వివిధ సమస్యలతో జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితులు ఇటీవల ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు ఆయా కార్యాలయాల వద్ద భద్రతను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. 

సాక్షి, జగిత్యాల : సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్, ఎస్పీలను కలిసేందుకు వచ్చి పురుగుల మందు తాగడం.. ఒంటిపై కిరోసిన్‌ పోసుకోవడం వంటి అఘాయిత్యాలకు చెక్‌ పెట్టడానికి పోలీస్‌ బాస్‌ భద్రత చర్యలను కట్టుదిట్టం చేశారు. ఈక్రమంలో ఇప్పటికే ఆయన తన క్యాంప్‌ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా ఓ క్యాబిన్‌ ఏర్పాటుచేశారు. ఇందులో ఓ ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు.. ఓ హోంగార్డుకు విధులు కేటాయించారు. వీరు ఎస్పీ కార్యాలయానికి వచ్చే ఆర్జీదారులు క్షేమంగా తిరిగి వెళ్లేవరకు వారిపై దృష్టిపెట్టనున్నారు.

ఎవరైన పురుగుల మందు డబ్బాలు.. కిరోసిన్‌తో వస్తే వారిని బయటే అడ్డుకుని వెంట తీసుకొచ్చిన వాటిని స్వాధీనం చేసుకుంటారు. కేవలం ఫిర్యాదుదారుడిని లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. మరోపక్క.. ఇప్పటికే ప్రతి సోమవారం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) భవనంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి నలుగురైదుగురు పోలీసులకు విధులు కేటాయిస్తున్నారు. అయితే.. ఇకపై ప్రతి సోమవారం వారి సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో ప్రస్తుతం ఒక హోంగార్డు విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇకపై కనీసం ఇద్దరైనా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ క్యాంప్‌ కార్యాలయం వద్ద నలుగురు.. కలెక్టరేట్‌లో మరో నలుగురు.. మొత్తం ఎనిమిది మంది హోంగార్డులను నియమించి వారికి అవసరమైన శిక్షణ ఇవ్వాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. 


‘నిఘా’ ఏదీ..? 
ప్రభుత్వ కార్యాలయాల ముందు ప్రజల ఆత్మహత్యాయత్నాల వెనక దళారులు ఉన్నట్లు  కలెక్టర్‌ శరత్‌ ఇప్పటికే గుర్తించారు. ప్రభుత్వ కార్యక్రమాలు.. పథకాల్లో పెరుగుతున్న దళారుల ప్రమేయంపై సీరియస్‌ అయ్యారు. అనర్హులకూ లబ్ధి చేకూరుస్తామని మాయమాటలు చెప్పి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్న వారిపై కొరడా ఝుళిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈ నెల 8న ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించే ఐఎంఏ భవనం, పరిసర ప్రాంతాల్లోనూ బాధితులు, వారి వెంట వచ్చి వెళ్లే వారిని గుర్తించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటికీ సీసీ కెమెరాలు ఏర్పాటు కాలేదు. ఇప్పటికైనా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ విషయమై జిల్లా రెవెన్యూ అధికారి శ్యాం ప్రకాశ్‌ వివరణ ఇస్తూ.. ‘ ఐఎంఏ భవనంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే సాంకేతిక సిబ్బంది వచ్చి కెమెరాల ఏర్పాటుపై పరిశీలన చేశారు. త్వరలోనే కెమెరాలు ఏర్పాటు చేస్తాం’ అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement