టికెట్‌ తీసుకోరే..  | Huge number of people not taking tickets in RTC buses | Sakshi
Sakshi News home page

టికెట్‌ తీసుకోరే.. 

Feb 25 2020 2:23 AM | Updated on Feb 25 2020 2:23 AM

Huge number of people not taking tickets in RTC buses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘బస్సులో టికెట్‌ తీసుకోకుంటే ఇక బాధ్యత ప్రయాణికుడిదే. ప్రయాణికులకు విధించే పెనాల్టీలు పెంచండి. టికెట్‌ తీసుకోనందుకు ప్రయాణికులనే పూర్తి బాధ్యులను చేయండి.’ఇదీ ఆర్టీసీ సమ్మె ముగిసిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశం. దీనికి సంబంధించి ఉత్తర్వులు రానప్పటికీ ఆర్టీసీ అధికారులు మాత్రం దాన్ని అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ చర్యతో ప్రయాణికుల్లో భయం కలిగి టికెట్‌ తీసుకోని వారి సంఖ్య బాగా తగ్గాలి. కానీ పరిస్థితి దానికి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో ఇటీవల క్రమం తప్పకుండా చెకింగ్స్‌ చేయిస్తుండటంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ సమస్య హైదరాబాద్‌లో మరీ ఎక్కువగా ఉంది.

ఉదాహరణకు గతేడాది మార్చిలో ఉప్పల్‌ డిపో పరిధిలో టికెట్‌ లేని ప్రయాణికుల నుంచి వసూలు చేసిన పెనాల్టీ మొత్తం రూ. 450కాగా, మేలో రూ. వెయ్యిగా నమోదైంది. కానీ ఈ సంవత్సరం జనవరిలో అదే డిపో పరిధిలో టికెట్‌ లేని ప్రయాణికుల నుంచి పెనాల్టీగా వసూలైన మొత్తం రూ. 58 వేలుగా, ఫిబ్రవరిలో ఇప్పటివరకు ఆ మొత్తం రూ. 31 వేలుగా నమోదైంది. ఇక హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలో జనవరిలో ఆ మొత్తం రూ. 2.5 లక్షలుగా రికార్డయింది. ఫిబ్రవరి ప్రథమార్థంలో ఇప్పటివరకు రూ. 85 వేలుగా నమోదైంది. దీన్ని ఆర్టీసీ తీవ్రంగానే పరిగణిస్తోంది.  ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో 10వ నంబర్‌ బస్సు తిరిగే మార్గంలో 24 డిపోలకు చెందిన 70 మంది సిబ్బంది ద్వారా ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేసింది.  వందల మంది ప్రయాణికులు పట్టుబడ్డారు. 

కిం కర్తవ్యం?:  గతంలో ఇలాంటి ప్రయాణికులు చెకింగ్‌లో పట్టుబడితే కండక్టర్లకు మెమోలు జారీ చేసేవారు. కొన్ని సందర్భాల్లో సస్పెండ్‌ కూడా చేసేవారు. ఇది వారి ఉద్యోగ భద్రతకు ప్రశ్నార్థకంగా మారింది. దీన్ని కార్మిక సంఘాలు అప్పట్లో తీవ్రంగా పరిగణించాయి. ఇటీవలి సమ్మె నోటీసులో కూడా ఈ అంశాన్ని ఎజెండాలో చేర్చాయి. అయితే చర్యలు తీసుకుంటారన్న భయంతో కండక్టర్లు టికెట్ల జారీలో అప్రమత్తంగా ఉండేవారు. కిక్కిరిసిన బస్సుల్లో తప్ప మిగతా బస్సుల్లో ప్రయాణికులు ఠంచన్‌గా టికెట్‌ తీసుకొనేవారు. తాజాగా టికెట్‌లెస్‌ ప్రయాణాలు పెరిగిపోవడంతో అధికారులు ఎలా వ్యవహరిస్తారన్నది చర్చకు దారితీస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement