రబీ ఆశలు సజీవం

Hopes are alive for Rabi season - Sakshi

    ఎస్సారెస్పీ, సాగర్, కడెం కింద 

    ఆయకట్టుకు నీళ్లిచ్చే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు రబీలో నీరిచ్చే అవకాశాలు సజీవమయ్యాయి. కొన్ని ప్రాజెక్టుల పరిధిలో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటిలభ్యత ఉండటంతో అక్కడ తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూనే, మిగతా నీటిని రబీ అవసరాలకు ఇవ్వాలని రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్‌ కమిటీ (శివమ్‌) నిర్ణయించింది. ఎస్సారెస్పీ, కడెం, నాగార్జున సాగర్‌ పరిధిలో నిర్ణీత ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉండగా, నిజాంసాగర్, సింగూరు, జూరాల ప్రాజెక్టు ల్లో నిల్వలు ఆశించినంత లేని కారణంగా కింది ఆయకట్టుకు నీటి విడుదల చేయరాదని నిర్ణయించింది.  

తొలి ప్రాధాన్యం తాగునీటికే...  
రాష్ట్రంలో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యత, వినియోగం, తాగు, సాగునీటి అవసరాలపై చర్చించేందుకు గురువారం శివమ్‌ కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రత్యేకంగా భేటీ అయింది. సమావేశంలో ఈఎన్‌సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్‌కుమార్‌తోపాటు అన్ని ప్రాజెక్టులు, జిల్లాల చీఫ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు. మిషన్‌ భగీరథ కింద తాగు అవసరాలు, కనీస నీటిమట్టాలకు ఎగువన ఉండే లభ్యత జలాల లెక్కలపై భేటీలో చర్చించారు. ప్రభుత్వం మిషన్‌ భగీరథ కింద తాగునీటికి ప్రాధాన్యతిస్తున్న దృష్ట్యా, ఆ అవసరాల మేరకు కనీస నీటి మట్టాలను నిర్వహించాల్సిందేనని ఈఎన్‌సీలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ ఆయకట్టు నుంచి నీటి విడుదల కోసం రైతుల నుంచి వస్తున్న డిమాండ్లపై చర్చ జరిగింది. ఎస్సారెస్పీలో తాగునీటి కోసం పక్కన పెట్టగా కాకతీయ కెనాల్‌కు 15 టీఎంసీల నీటిని పంటలకు సప్లిమెంటేషన్‌ చేసేలా విడుదల చేయవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.

ఈ నీటితో కనిష్ఠంగా 2 నుంచి 3 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. ఇక లక్ష్మి కెనాల్, సరస్వతి కెనాల్‌ కింద చెరో 1.6 టీఎంసీల నీటితో 40వేల ఎకరాలకు ఇవ్వవచ్చని వివరించారు. దీనికి శివమ్‌ కమిటీ ఓకే చెప్పింది. ఇక కడెం కింద సైతం 2 టీఎంసీలతో గూడెం లిఫ్ట్‌ ద్వారా 20వేల ఎకరాలకు నీరిచ్చేందుకు సమ్మతించింది. నాగార్జునసాగర్‌ కింద ప్రస్తుతం 23 టీఎంసీల మేర నీటి లభ్యత ఉన్నందున దీనిద్వారా కనిష్టంగా 2.50 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయం జరిగినట్లుగా తెలిసింది. అయితే ఎన్ని తడులకు ఇవ్వాలి, ఎన్ని కిలోమీటర్ల వరకు ఇవ్వాలన్న దానిపై తుది నిర్ణయం ఇంకా చేయలేదు. ఇక ఆదిలాబాద్‌ జిల్లాలోని స్వర్ణ ప్రాజెక్టు కింద 5వేల ఎకరాలు, గడ్డెన్నవాగు కింద మరో 2వేల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top