ఫైల్‌ ప్లీజ్‌... | HMDA Delay Master Plan Files Move | Sakshi
Sakshi News home page

ఫైల్‌ ప్లీజ్‌...

Apr 22 2019 7:26 AM | Updated on Apr 22 2019 7:26 AM

HMDA Delay Master Plan Files Move - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగర శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే కావల్సిన ఛేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్, మాస్టర్‌ ప్లాన్‌ కరెక్షన్స్‌ దరఖాస్తుల క్లియరెన్స్‌ ప్రక్రియ నిలిచిపోవడం ‘మహా’ దరఖాస్తుదారులకు చుక్కలు చూపెడుతోంది.  అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో దాదాపు ఆరు నెలల పాటు ఈ ఫైళ్ల క్లియరెన్స్‌ ప్రక్రియ ముందుకు జరగకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో కష్టాలకోర్చి కొన్న భూమి ఆగ్రికల్చర్‌ నుంచి ఇండస్ట్రియల్‌ జోన్‌కు మార్చాలంటూ కొందరు, అగ్రికల్చర్‌ నుంచి రెసిడెన్షియల్‌ జోన్‌కు మార్చాలంటూ మరికొందరు, ఇండస్ట్రియల్‌ జోన్‌ నుంచి రెసిడెన్షియల్‌ జోన్‌కు మార్చాలంటూ ఇంకొందరు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు దరఖాస్తులు చేశారు.

అయితే హెచ్‌ఎండీఏ అధికారులు సైట్‌ ఇన్‌స్పెక్షన్‌కు వెళ్లి ఆయా పరిస్థితులను గమనించి నివేదిక తయారుచేసి మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌(ఎంఏయూడీ)కి పంపారు. అయితే ఆరు నెలల నుంచి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వల్ల ఆ ఫైళ్ల కదలికలో వేగం లేదు. వీటిని ఆమోదించాల్సిన పురపాలక శాఖ మంత్రి కూడా లేకపోవడం కూడా ఈ ఫైళ్ల ఆలస్యానికి కారణంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఈ పురపాలక శాఖ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఈ ఫైళ్ల క్లియరెన్స్‌కు ప్రత్యేక అధికారాలను మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి అప్పగించి త్వరితగతిన క్లియర్‌ చేసేలా ఆదేశాలివ్వనున్నారని తెలిసింది. సాధ్యమైనంత తొందరగా ఈ ఫైళ్ల క్లియరెన్స్‌లో నిర్ణయం తీసుకోవాలని ఆయా దరఖాస్తుదారులు కోరుతున్నారు.

ఆదాయంపై కసరత్తు
భవన నిర్మాణ అనుమతుల కోసం చేసిన కొన్ని దరఖాస్తుల్లో మాస్టర్‌ప్లాన్‌ రోడ్లు ఉన్నవి కూడా చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. మాస్టర్‌ప్లాన్‌లో 300 ఫీట్ల రోడ్డు పోతున్నా క్యాడెస్ట్రియల్‌ కరెక్షన్‌  కోసం మున్సిపల్‌ అడ్మినిస్ట్రేన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌కు వచ్చిన వాటిని కూడా త్వరతిగతిన పరిష్కరించాలని అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. దీనివల్ల ప్రభుత్వానికి కోట్ల ఆదాయం సమకూరడటంతో పాటు శివారు ప్రాంతాల అభివృద్ధిలో వేగం పెరుగుతుందన్నారు.

దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి
భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తులను క్లియరెన్స్‌ చేసే పనిపై ప్రస్తుత హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడూ ఆయా ప్లానింగ్‌ విభాగాధిపతులతో సమీక్షలు చేస్తూ ఎదురవుతున్న సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. చాలావరకు దరఖాస్తులు ఎన్‌వోసీల వల్లే పెండింగ్‌లో ఉండటంతో కామన్‌ అప్లికేషన్‌(సింగిల్‌ విండో పద్ధతి)ని ఆన్‌లైన్‌ చేశారు. దీనివల్ల అనుమతుల కోసం హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకున్న సమయంలోనే ఇరిగేషన్‌ ఎన్‌వోసీ కావాలంటూ ఇరిగేషన్‌ అధికారులకు, నాలా సర్టిఫికెట్‌ కావాలంటే రెవెన్యూ అధికారులకు వెళ్లేలా తెచ్చిన కొత్త అప్లికేషన్‌ ఇప్పటికే ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. సాధ్యమైనంత తొందరగా దరఖాస్తుదారులకు అందుబాటులోకి తేనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement