మండే సూరీడు.. | high temparatures in telangana and andhrapradesh | Sakshi
Sakshi News home page

మండే సూరీడు..

May 23 2015 2:54 AM | Updated on Sep 3 2017 2:30 AM

శుక్రవారం ఎండ తీవ్రత కారణంగా బోసిపోయిన బషీర్ బాగ్ ఫ్లై ఓవర్

శుక్రవారం ఎండ తీవ్రత కారణంగా బోసిపోయిన బషీర్ బాగ్ ఫ్లై ఓవర్

ప్రచండ భానుడి భగభగలకు రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రోజురోజుకూ తీవ్రమవుతున్న ఎండ వేడిమికి తాళలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే వడదెబ్బకు తాళలేక రాష్ట్రవ్యాప్తంగా 234 మంది మృత్యువాత పడ్డారు.

- వడదెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా 234 మంది బలి
- నిజామాబాద్, రామగుండంలలో 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత
- రాజస్తాన్ ఎడారి నుంచి వేడిగాలులు వీస్తున్నందునే..
- ఆంధ్రప్రదేశ్‌లో వడదెబ్బతో 193 మంది మృతి
 
హైదరాబాద్:
ప్రచండ భానుడి భగభగలకు రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రోజురోజుకూ తీవ్రమవుతున్న ఎండ వేడిమికి తాళలేక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే వడదెబ్బకు తాళలేక రాష్ట్రవ్యాప్తంగా 234 మంది మృత్యువాత పడ్డారు. రాజస్థాన్ ఎడారి నుంచి వస్తున్న వేడి గాలుల వల్ల రాష్ట్రంలో భారీ స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.

రామగుండం, నిజామాబాద్‌లలో శుక్రవారం అత్యధికంగా 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా హైదరాబాద్‌లో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత 24 గంటల్లో నల్లగొండ, ఖమ్మంలలో 47, హన్మకొండ, ఆదిలాబాద్‌లలో 45, మెదక్‌లో 43, హకీంపేటలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అన్నిచోట్లా సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటితే ఎండ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

అధిక ఉష్ణోగ్రతలు తాత్కాలికంగా ప్రజలకు ఇబ్బందులు కలిగించినా రుతుపవనాల రాకపై సానుకూల ప్రభావం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేడి గాలులతో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రత పెరిగి రుతుపవనాలు ఉధృతంగా కదిలే అవకాశం ఉంటుందంటున్నారు. రుతుపవనాల కదలికలో అధిక ఉష్ణోగ్రతలను కూడా కీలకాంశంగా చెబుతున్నారు. వ్యవసాయశాఖ కూడా భారీ ఎండలు రుతుపవనాల రాకకు శుభసూచకమని చెబుతోంది. అయితే వాతావరణ మార్పుల్లో ఈ ఆశ ఎంతవరకు నిజమవుతుందో వేచిచూడాల్సి వుందని వాతావరణశాఖ పేర్కొంది.

ఒక్క రోజే 234 మంది మృతి...
భానుడి ప్రతాపానికి తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం ఒక్కరోజే 234 మంది మృత్యువాతపడ్డారు. నల్లగొండ జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. వడదెబ్బతో జిల్లావ్యాప్తంగా 56 మంది చనిపోయారు. శుక్రవారమిక్కడ 46.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం జిల్లాలోనూ ఎండలు మండిపోతున్నాయి. ఇక్కడ శుక్రవారం 55 మంది మృతి చెందారు. వరంగల్ జిల్లాలో ఎండవేడిమికి తాళలేక 54 మంది చనిపోయారు.

జిల్లాలోని ములుగు, నర్సంపేటలలో శుక్రవారం అత్యధికంగా 45 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కరీంనగర్ జిల్లాలోని రామగుండంలో 46.8, కరీంనగర్‌లో 46, జగిత్యాలలో 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా 27 మంది వడదెబ్బకు బలయ్యారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు 14 మంది ప్రాణాలు కోల్పోగా, మహబూబ్‌నగర్ జిల్లాలో 10 మంది, ఆదిలాబాద్‌లో 9, మెదక్‌లో ఆరుగురు, రంగారెడ్డిలో ఇద్దరు, నిజామాబాద్ జిల్లాలో ఒక్కరు వడదెబ్బతో మృతి చెందారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే 193 మంది..
విజయవాడ బ్యూరో: ప్రచండ భానుడి ధాటికి రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. మండే ఎండలకు వడగాడ్పులు తోడవడంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గత కొన్నేళ్లలో లేని విధంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 193 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగానే రికార్డయ్యాయి.  

గన్నవరం, నందిగామల్లో 47 డిగ్రీలు, బాపట్ల, మచిలీపట్నంలలో 46, ఒంగోలులో 45, కావలి 44, కాకినాడ, కర్నూ లు, తిరుపతి, నెల్లూరుల్లో 42, అనంతపురం 41, తునిలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తప్పని పరిస్థితుల్లో ఇళ్లనుంచి బయటకు వచ్చిన వారు పెద్దసంఖ్యలో వడదెబ్బకు గురవుతున్నారు. అటు వడగాడ్పులు, ఇటు ఉక్కపోతలతో జనం నానా అవ స్థలు పడుతున్నారు.

ప్రకాశం జిల్లాలో అత్యధిక రికార్డు..
మండుతున్న ఎండల ధాటికి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 56మంది మరణించారు. గుంటూరు జిల్లాలో 22 మంది, కృష్ణా జిల్లాలో 22 మంది, శ్రీకాకుళం జిల్లాలో 09, విజయనగరం జిల్లాలో 09, విశాఖపట్నం జిల్లాలో 10, నెల్లూరు జిల్లాలో 27, కర్నూలు జిల్లాలో 07, తూర్పు గోదావరి జిల్లాలో 14, పశ్చిమ గోదావరి జిల్లాలో 10, చిత్తూరు జిల్లాలో నలుగురు, అనంతపురం జిల్లాలో ఒకరు, కడపలో ఇద్దరు  మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement