‘ఐఏఎస్‌’ కోసం ‘ఐపీఎస్‌’ అడ్డదారి!

High-tech copying of the Civils mains exam

సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలో ఓ ఐపీఎస్‌ నిర్వాకం

బ్లూటూత్‌ ద్వారా పక్కాగా హైటెక్‌ కాపీయింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆయన ఐపీఎస్‌.. ఐఏఎస్‌ కావాలని కల. ఆ కలను ఎలాగైనా నిజం చేసుకోవాలని భావించాడు.. అందుకోసం అడ్డదారులు తొక్కాడు. అడ్డంగా బుక్కయ్యాడు. సోమవారం సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ ఎగ్జామ్స్‌లో హైటెక్‌ కాపీయింగ్‌కు పాల్పడుతూ చెన్నై పోలీసులకు దొరికాడు.

హైదరాబాద్‌ కేంద్రంగా సాగిన ఈ వ్యవహారంలో అతడి భార్య జోయ్‌సీ జోయ్‌ సహకరించింది. చెన్నై పోలీసుల నుంచి సమాచారం అందుకున్న హైదరాబాద్‌ సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జోయ్‌సీ జోయ్‌తో పాటు లా ఎక్స్‌లెన్స్‌ ఐఏఎస్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు రాంబాబును సైతం అదుపులోకి తీసుకున్నారు. వీరిని తీసుకెళ్లేందుకు చెన్నై నుంచి ప్రత్యేక బృందం హైదరాబాద్‌కు బయల్దేరింది.  

2015లో ఐపీఎస్‌కు ఎంపిక..  
కేరళకు చెందిన సఫీర్‌ కరీం బీటెక్, ఎంఏ చదివారు. 2015లో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాసి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఉన్న నంగునేరి సబ్‌–డివిజన్‌కు ఏఎస్పీగా పని చేస్తున్నారు. కొన్నాళ్ల కింద జోయ్‌సీ జోయ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. కరీంకు ఐఏఎస్‌ అధికారి కావాలనే కోరిక బలంగా ఉంది. అయితే మరోసారి సివిల్స్‌ రాసి ఉత్తీర్ణుడయ్యేందుకు అడ్డదారులు తొక్కారు.

ఇందుకు తన భార్య జోయ్‌సీ జోయ్‌  సాయం తీసుకున్నారు. అశోక్‌నగర్‌లోని లా ఎక్స్‌లెన్స్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడైన రాంబాబు దేశ వ్యాప్తంగా అనేక ఇన్‌స్టిట్యూట్స్‌లో సివిల్స్‌ అభ్యర్థులకు పాఠాలు చెబుతుంటారు. గతంలో కేరళలోని ఇన్‌స్టిట్యూట్స్‌కు వెళ్లినపుడు కరీంతో పరిచయమైంది. హైటెక్‌ కాపీయింగ్‌కు ప్లాన్‌ చేసిన కరీం తనకు సహకరించాల్సిందిగా రాంబాబును కోరడంతో ఆయన అంగీకరించారు. ప్లాన్‌లో భాగంగా తన భార్య జోయ్‌సీ జోయ్‌ను హైదరాబాద్‌కు పంపాడు.
 
భారీ స్కెచ్‌..
హైటెక్‌ కాపీయింగ్‌కు ప్లాన్‌ చేసిన కరీం భారీ స్కెచ్‌ వేశారు. అత్యాధునికమైన బ్లూటూత్, చిన్న సైజులో ఉండే శక్తిమంతమైన కెమెరాను సమకూర్చుకున్నారు. కెమెరాను చొక్కా గుండీల మధ్య అమర్చుకున్నారు. దీన్ని క్లిక్‌ చేయడానికి రిమోట్‌ బటన్‌ను టేబుల్‌పై కీ–చెయిన్‌లో అమర్చారు. బ్లూటూత్‌ డివైజ్‌ ఎవరికీ కనిపించకుండా చెవిలో పెట్టుకున్నారు. చెన్నైలోని ఎగ్మోర్‌ గర్ల్స్‌ హైస్కూల్‌లో ఉన్న కేంద్రంలో కరీం ప్రస్తుతం సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు రాస్తున్నారు. శనివారం జనరల్‌ స్టడీస్‌ పేపర్‌–1 రాసిన ఆయన సోమవారం పేపర్‌–2కు సిద్ధమయ్యారు.  

వ్యవహారం సాగింది ఇలా..
పరీక్ష హాలులో పేపర్‌ ఇచ్చిన వెంటనే దాన్ని ఛాతి భాగంలో అమర్చిన కెమెరాతో క్లిక్‌ చేసేవారు. ఈ డివైజ్‌తో పాటు బ్లూటూత్‌ సైతం గది బయట ఉన్న తన సెల్‌ఫోన్‌తో అనుసంధానించి ఉంటుంది. ప్రత్యేక సెట్టింగ్స్‌ ద్వారా ఓ ఫొటోను క్లిక్‌ చేయగానే ఆటోమేటిక్‌గా గూగుల్‌ డ్రైవ్‌లోకి అప్‌లోడ్‌ అయ్యేలా ఏర్పాటు చేశారు.

లా ఎక్సలెన్స్‌ కోచింగ్‌ సెంటర్‌లో కూర్చున్న జోయ్‌సీ జోయ్, రాంబాబు తమ వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌ను వినియోగించి గూగుల్‌ డ్రైవ్‌లో కరీం అప్‌లోడ్‌ చేసిన పేపర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వారు. ఆ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను రాంబాబు ద్వారా తెలుసుకునే జోయ్‌సీ తన భర్త కరీం సెల్‌కు కాల్‌ చేసేది. ఆటోమేటిక్‌గా కనెక్ట్‌ అయ్యే ఈ కాల్‌ కరీం చెవిలో ఉన్న బ్లూటూత్‌ డివైజ్‌కు వెళ్లేది.

ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానాలను జోయ్‌సీ నుంచి వింటూ కరీం రాసేవాడు. ఎప్పుడైనా జోయ్‌సీ చెప్పింది అతడికి సరిగ్గా వినిపించకపోతే అదే విషయాన్ని పరీక్ష పేపర్‌ వెనుక వైపు ఉండే ‘రఫ్‌’ఏరియాలో రాసి మళ్లీ ఫొటో ద్వారా పంపంచే వాడు. దీన్ని చూసి జోయ్‌సీ మరోసారి ఆ సమాధానాన్ని చెప్పేది. ఈ పంథాలో ఎక్కడా కరీం మాట్లాడాల్సిన అవసరం లేకుండానే కాపీయింగ్‌ సాగిపోతోంది.  

దొరికింది ఇలా..
శనివారం ఈ విధానంలోనే పరీక్ష రాసిన కరీం సోమవారం సైతం సిద్ధమయ్యారు. ఇది గమనించిన పరీక్ష నిర్వాహకుల సమాచారంతో చెన్నై పోలీసులు కరీంను సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. విచారణ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఉన్న జోయ్‌సీ, రాంబాబు తనకు సహకరిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో అక్కడి పోలీసులు హైదరాబాద్‌ పోలీసులను అప్రమత్తం చేశారు.

టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సి.శశిధర్‌రాజు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయి శ్రీనివాస్‌ రావు.. జోయ్‌సీతో పాటు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లో కరీం ద్వారా వచ్చిన సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షలోని ప్రశ్నలకు సంబంధించి అనేక ఫొటోలను స్వాధీనం చేసుకున్నారు. జోయ్‌సీ, రాంబాబును తీసుకెళ్లడానికి ఓ ప్రత్యేక బృందం చెన్నై నుంచి బయల్దేరింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top