ప్రభాస్‌ కేసులో కౌంటర్‌ దాఖలు చేసిన రెవెన్యూశాఖ | High Court Postpones Hearing on Prabhas petition | Sakshi
Sakshi News home page

Dec 24 2018 12:06 PM | Updated on Dec 24 2018 1:11 PM

High Court Postpones Hearing on Prabhas petition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ హీరో ప్రభాస్ భూమి వివాదం కేసులో  తెలంగాణ రెవెన్యూ శాఖ అధికారులు సోమవారం హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయ్‌దుర్గ్‌ పన్మక్త గ్రామంలోని సర్వే నంబర్‌ 5/3లో ప్రభాస్‌కు చెందిన 2,083 చదరపు అడగుల స్థలాన్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందో తమ కౌంటర్‌లో అధికారులు వివరించారు. కౌంటర్‌ను స్వీకరించిన హైకోర్టు ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. తన స్థలం విషయంలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్‌ చేస్తూ ప్రభాస్‌ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

తన ఆస్తి విషయంలో జోక్యం చేసుకోకుండా రెవెన్యూ అధికారులను నియంత్రించాలని కోరుతూ ప్రభాస్‌ గత బుధవారం అత్యవసరంగా లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ స్థలాన్ని 2005లో బి.వైష్ణవీరెడ్డి, ఉషా, బొమ్మిరెడ్డి శశాంక్‌రెడ్డిల నుంచి తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, ఈ భూమిపై ఎటువంటి వివాదాలు లేవని ప్రభాస్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ఆస్తి పన్ను, విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నానని తెలిపారు. ఈ భూమిలో తాత్కాలిక నిర్మాణాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఎటువంటి వివాదాలు లేకపోయినా ముందస్తు జాగ్రత్త చర్యగా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుని రూ. 1.05 కోట్ల ఫీజు కూడా చెల్లించామని, క్రమబద్ధీకరణ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. అకస్మాత్తుగా రెవెన్యూ అధికారులు వచ్చి తన భూమిని ప్రభుత్వ భూమిగా చెబుతూ, ఆ భూమి నుంచి తను ఖాళీ చేయాలని కోరారని పేర్కొన్నారు. ఇందుకు సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చూపారని ఆయన తెలిపారు.

వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పులో తాను పార్టీ కాదని వివరించారు. అసలు ఆ సుప్రీంకోర్టు తీర్పు గురించి తమకు ఏమీ తెలియదన్నారు. ఈ తీర్పును బూచిగా చూపుతూ తనను తన స్థలం నుంచి బలవంతంగా ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాక పిటిషనర్‌ తన వాదనలు వినడం గానీ, నోటీసు ఇవ్వడం గానీ చేయలేదన్నారు. అధికారులు సహజ న్యాయ సూత్రాలను అనుసరించలేదని తెలిపారు. అధికారుల చర్యలు తన హక్కులను హరించే విధంగా ఉన్నాయని, అందువల్ల వారిని నియంత్రించాలని ఆయన కోర్టును కోరారు.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement