పైరుకు ప్రాణం!

Heavy Rains In Telangana Farmers Happiness Mahabubnagar - Sakshi

మహబూబ్‌నగర్‌ రూరల్‌ : కళ్లు కాయలు కాచేలా రైతులు ఎదురుచూసిన వానలు కాస్త ఆలస్యంగానైనా వచ్చాయి. నెల రోజులుగా వర్షాధార పంటలు వాడుపట్టిపోయాయి. పంటలపై ఆశలు వదులుకుంటున్న తరుణంలో వరుణుడు ఎట్టకేలకు రైతులపై కరుణ చూపాడు. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ముసురు వర్షాలు కురుస్తుండటంతో రైతుల కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయి. పలుగుపార పట్టి పొలానికి పరులుగు పెడుతున్నారు. కూలీలకు సైతం చేతినిండా పని దొరికింది.
 
వర్షాధారమే అధికం.. 
సాధారణంగా జిల్లాలో ఖరీఫ్‌ పంటల సేద్యం ఎక్కువగా వర్షాధారంపైనే ఉంటుంది. అయితే జి ల్లాలో ఇప్పటి వరకు వర్షాలు సమృద్ధిగా కురియక పోవడంతో ఖరీఫ్‌ సేద్యం డోలాయమానంలో పడింది. ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ఆ ప్రభావం జిల్లాపై పడి ముసురు పట్టింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన ఓ మోస్తారు వర్షానికి రైతన్నకు ఉపశమం కలిగించింది. మెట్ట పంటలు ప్రాణం పోసుకున్నాయి.
 
పొలాలకు ఉరుకులు.. పరుగులు 
నెల రోజులుగా చినుకు రాలక వాడుపట్టిన పంటల కు ఈ వర్షం ప్రాణం పోసింది. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, కందులు పలు వాణిజ్య పంటలకు మేలు జరిగింది. కురిసిన వర్షంతో రైతన్న పొలంబా ట పట్టారు. పత్తి పంటకు ఎరువులు వేస్తున్నారు. ముఖ్యంగా కంది పైరుకు జీవం పోసింది. కానీ ఈ వర్షం వరి పంటకు ఏ మాత్రం సరిపోదు. ఇంకా వ ర్షాలు బాగా పడితేనే ప్రయోజనం చేకూరుతుంది.
 
అత్యధికంగా బాలానగర్‌లో.. 
జిల్లాలో అత్యధికంగా బాలానగర్‌ మండలంలో 73.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇంత  పెద్దమొత్తంలో ఇక్కడే వర్షం ఎక్కువగా కురిసింది. అలాగే అతితక్కువగా క్రిష్ణ మండలంలో 9.8 మి.మీ వర్షపాతం నమోదైంది. దామరగిద్ద మండలంలో 29.2 మి.మీ, నారాయణపేటలో 22.2 మి.మీ, ఊట్కూర్‌లో 15 మి.మీ, మాగనూర్‌లో 10 మి.మీ, మక్తల్‌లో 13 మి.మీ, నర్వలో 10 మి.మీ, చిన్నచింతకుంటలో 10 మి.మీ, మరికల్‌లో 10 మి.మీ, దేవరకద్రలో 15.2 మి.మీ, కోయిలకొండలో 14.2 మి.మీ, మద్దూరులో 31.0 మి.మీ, కోస్గిలో 50.2 మి.మీ, గండీడ్‌లో 47.6 మి.మీ. హన్వాడలో 34.0 మి.మీ, మహబూబ్‌నగర్‌లో 20.5 మి.మీ, దేవరకద్రలో 16.8 మి.మీ, అడ్డాకులలో 18.0 మి.మీ, ముసాపేటలో 20.5 మి.మీ, భూత్పూర్‌లో 26.2 మి.మీ, మహబూబ్‌నగర్‌ అర్బన్‌లో 34.6 మి.మీ, నవాబుపేటలో 59.6 మి.మీ, రాజాపూర్‌లో 63.5 మి.మీ, జడ్చర్లలో 30.2 మి.మీ, మిడ్జిల్‌లో 39.2 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున సరాసరి 27.9 మి.మీ వర్షపాతం నమోదైంది.

పెసరకు నష్టం 
ముసురు వర్షాలు మెట్ట, వరి పంటలకు మేలు చేకూరినా పెసర పంటకు మాత్రం నష్టం కలిగించేలా ఉంది. ముసురు వర్షం వస్తే పెసరకు నష్టం వాటిల్లుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పంట నారాయణపేట, దామరగిద్ద మండలాల్లో ఎక్కువ గా సాగుచేస్తారు. జిల్లాలో వేరే ప్రాంతాల్లో ఈ పం ట సేద్యం అంతగా ఉండదు. కొన్ని రోజులుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం.. చివరగా ముసురు పట్టడంతో పెసర దిగుబడి ఆశించేలా వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా జిల్లాలో ఈ ఖరీఫ్‌లో 33,089 హెక్టార్లలో వరి సాగుకు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 18,014 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి 2,42,508 హెక్టార్లలో సేద్యం చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,27,972 హెక్టార్లలో సాగులో ఉంది.  

మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం బొక్కలోనిపల్లిలో వరి నాట్లు వేస్తున్న కూలీలు 

అంతా దేవుడి కరుణే..
ఈ యేడు వర్షాలు సరిగా రాలేదు. నాలుగున్నర ఎకరాల్లో వరి, జొన్న పంటలు సాగు చేశాను. ఈ పంటలన్నీ ఎండిపోయినయి. కష్టమంతా పాయే..అని ఆశలు వదులుకున్నాం. కానీ వరుణదేవుడు కరుణించాడు. పంటలకు ప్రాణం పోశాడు. ఇలాంటి పెద్దవర్షం ఇంకా పడితేనే ప్రయోజనం. – జంగం దాసు, రైతు, బొక్కలోనిపల్లి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top