ఉందిలే మంచి కాలం..!  | Heavy Rain In Telangana | Sakshi
Sakshi News home page

ఉందిలే మంచి కాలం..! 

Aug 4 2019 2:40 AM | Updated on Aug 4 2019 2:40 AM

Heavy Rain In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్య మహారాష్ట్ర, కోస్తా కర్ణాటక, కొంకణ్‌ (గోవా) ప్రాంతాలతోపాటు మహాబలేశ్వర్‌లో గడచిన వారం రోజులుగా సగటున 20సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా నివేదికలో వెల్లడించింది. భారీ వర్షాలు కురుస్తాయని, ఇందుకు తగ్గట్లుగానే ముందుజాగ్రత్తలు తీసుకోవాలని మహారాష్ట్ర, కర్ణాటక, గోవా రాష్ట్రాలను హెచ్చరించింది.

పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురువస్తుండటంతో గడచిన 3రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టుకు 50 టీఎంసీల నీరొచ్చి చేరింది. ప్రస్తుతం 2.15 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. వచ్చే వారం పాటు భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రవాహం 3.5–4 లక్షల క్యూసెక్కుల (32–37టీఎంసీలు)కు పెరగవచ్చని కేంద్ర జల సంఘం (సీడబ్లు్యసీ) అంచనా వేస్తోంది. అదే నిజమైతే శ్రీశైలం రిజర్వాయర్‌ గరిష్ట నీటి మట్టానికి చేరడానికి నాలుగైదు రోజులు పడుతుంది. కనిష్ట నీటి మట్టానికి చేరిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వారం రోజుల్లోనే కృష్ణానది ప్రవాహం మొదలవుతుంది. 

25 నుంచి 30 సెంటీమీటర్ల వర్షం 
కృష్ణానది జన్మస్థలమైన పశ్చిమ కనుమల్లో వచ్చే 5రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తాజా నివేదిక వెల్లడించింది. మహాబళేశ్వర్‌తో పాటు మధ్య మహారాష్ట్ర, కోస్టల్‌ కర్నాటక, కొంకణ్‌ గోవాలో (కృష్ణా నది పరీవాహక ప్రాంతాలు) భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఐఎండీ ఈ మూడు రాష్ట్రాలకు సూచించింది. వచ్చే ఐదు రోజుల పాటు కనిష్టంగా 25 గరిష్టంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేస్తోంది.

ఐఎండీ సూచనలను పరిగణనలోకి తీసుకుని సీడబ్లు్యసీ కృష్ణానది, దాని ఉప నదులపై ఉన్న ప్రాజెక్టుల్లో నీటిమట్టాల నిర్వహణను జాగ్రత్తగా గమనించాలని తెలంగాణ సహా పరీవాహక ప్రాంతాల్లోని రాష్ట్రాలకు సూచించింది. పశ్చిమ కనుమల్లో నమోదవుతున్న వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రవాహాలను కిందకు వదిలాలని సూచించింది. నదీ పరీవాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురవడంతో కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో రోజురోజుకూ వరద ప్రవాహం పెరుగుతోంది. గడిచిన 3రోజులతో పోలిస్తే శనివారం కృష్ణానదిలో వరదఉధృతి మరింతగా పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో శనివారం రాత్రికి శ్రీశైలంలో నీటి నిల్వ 80టీఎంసీలకు చేరింది. మరో 135 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోతుంది. 

ఆగస్టు చివరి నాటికి సాగర్‌కు జలకళ  
ఆగస్టు 15కు కాస్త అటూ ఇటుగా శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 312 టీఎంసీలకు గానూ 126.30 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వలున్నాయి. కృష్ణా ఉపనది భీమాలోనూ వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. దాదాపు 38,078 క్యూసెక్కులు వచ్చి చేరడంతో భీమా నదిపైన ఉన్న ఉజ్జయిని (మహారాష్ట్ర) జలాశయంలో నీటి నిల్వ 81.35 టీఎంసీలకు చేరుకుంది. మరో 35.89 టీఎంసీలు వస్తే ఉజ్జయినీ నిండుతుంది. వరద ఇదే రీతిలో కొనసాగితే ఈ నెల రెండో వారం నాటికి ఉజ్జయినీ నిండుతుంది. ఆ తర్వాత భీమా వరద జూరాల మీదుగా శ్రీశైలాన్ని చేరుతుంది. ఐఎండీ అంచానాలు నిజమైతే ఈ నెలాఖరు నాటికి నాగార్జునసాగర్‌కు భారీగా ప్రవాహాలు వచ్చే అవకాశం ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement