
అమ్మో.. కార్పొ‘రేట్’ వైద్యం!
‘కార్పొరేట్ ఆస్పత్రుల ఫీజులను తలచుకునే పరిస్థితి లేదు. ఇటీవల ఓ మహిళ నా దగ్గరకు వచ్చింది. అతని కొడుక్కి జబ్బు చేస్తే కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తోంది.
ఆస్తులు అమ్ముకుంటున్న పేదలు
డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆవేదన
హైదరాబాద్: ‘కార్పొరేట్ ఆస్పత్రుల ఫీజులను తలచుకునే పరిస్థితి లేదు. ఇటీవల ఓ మహిళ నా దగ్గరకు వచ్చింది. అతని కొడుక్కి జబ్బు చేస్తే కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేయిస్తోంది. తన దగ్గర ఉన్న డబ్బంతా కట్టింది. ఇంకా మిగిలిపోయిన రూ. 4 లక్షలూ కట్టాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఇల్లు అమ్మకానికి పెట్టానని, ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి వారంరోజులు గడువు ఇప్పించాలని వేడుకుంది. కార్పొరేట్ ఆస్పత్రుల వైద్య బిల్లులు చెల్లించడానికి చాలామంది ప్రజలు నగలు, ఇళ్లు, ఆస్తులు అమ్ముకున్నారు. ఇప్పుడు పూట గడపుకోడానికి సైతం వాళ్లు అష్టకష్టాలు పడుతున్నారు..’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. భగవాన్ మహవీర్ మెమోరియల్ ట్రస్టు, పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మహవీర్ ఆస్పత్రిలో ‘పర్సనలైజ్డ్ మెడిసిన్’పై జాతీయస్థాయి సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, కార్పొరేట్ ఆస్పత్రుల ఫీజులను ఉద్దేశించి పై వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తనకు తెలిసిన ఓ వ్యక్తి మూత్రపిండాల సమస్యతో నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లగా, అక్కడి వైద్యులు రూ.2 లక్షలు డిపాజిట్ చేయమన్నారు. అ వ్యక్తిని నిమ్స్‌కు పంపితే రూ.20 వేలకే వైద్యం అందిందన్నారు. సరైన విద్యా, వైద్య సేవలందక ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఔషధాల పనితీరుపై లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరముందన్నారు. అలర్జీ నివారణకు ఓసారి తాను తీసుకున్న ఔషధం వికటించడంతో.. అస్వస్థతకు గురై ప్రాణపాయాన్ని ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్‌కే దిక్కు లేదన్నారు..
ఈ మధ్య ఓ పదేళ్ల బాలికను నా దగ్గరికి తీసుకొచ్చారు. కంటికి తీవ్ర గాయం కావడంతో కట్టు కట్టి ఉంది. స్కూల్లో తోటి విద్యార్థి పెన్సిల్‌తో ఆ బాలిక కంటిలో గుచ్చితే గాయమైందని ఆ బాలిక తల్లి తెలిపింది. 24 గంటల్లోపు ఆపరేషన్ చేస్తేనే ఆ కన్ను పనిచేస్తుందని ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులు పేర్కొనడంతో దిక్కుతోచక సహాయం కోసం నా దగ్గర వచ్చారు. వారి దయనీయ స్థితిని చూడలేక వెంటనే కేసీఆర్‌ను కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కింద డబ్బులు మంజూరు చేయిం చాను. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చాలా ఉన్నందున శస్త్ర చికిత్స చేయబోమన్నారు. మళ్లీ నేను స్వయంగా వైద్యులను ఒప్పించి ఆ పాపకు శస్త్ర చికిత్స చేయించాల్సి వచ్చింది..అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు కేఎస్.రత్నాకర్, ట్రస్టు చైర్మన్ సురేంద్ర లూనియా పాల్గొన్నారు.