రేవంత్‌ పిటిషన్‌పై కీలక విచారణ

HC ordered TS Govt to file counter in parliamentary secretaries issue - Sakshi

‘పార్లమెంటరీ కార్యదర్శుల నియామక వివాదం’

కేబినెట్‌ పదవులపై వివరణ ఇవ్వండి : సర్కారుకు హైకోర్టు ఆదేశం

పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పలువురికి కేబినెట్‌ హోదానిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు వివరణ కోరింది. ఈ వ్యవహారంపై మార్చి 14 నాటికి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని, మరోసారి గడువునిచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. కేబినెట్‌ హోదా పొందిన వారిలో నోటీసులు అందని వారికి వ్యక్తిగతంగా మళ్లీ నోటీసులిచ్చే వెసులుబాటును పిటిషనర్‌ రేవంత్‌రెడ్డికి కల్పించింది. తదుపరి విచారణను మార్చి 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.  

కేబినెట్‌ పదవులూ లాభదాయకమే..: పిటిషనర్‌
ఇ.బాలకిషన్, ఆర్‌.విద్యాసాగర్‌రావు, ఎ.కె.గోయల్, ఆర్‌.రామలక్ష్మణ్, బి.వి.పాపారావు, కె.వి.రమణాచారి, జీఆర్‌రెడ్డి, దేవులపల్లి ప్రభాకర్‌రావు, పేర్వారం రాములు, ఎస్‌.వేణుగోపాలాచారి, రామచంద్రు తెజావత్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, పిడమర్తి రవి, జి.వివేకానంద, వి.ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ తదితరులకు ప్రభుత్వం కేబినెట్‌ హోదా కల్పించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి గతేడాది జనవరిలో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటరీ కార్యదర్శులుగా లాభదాయక పదవులు అనుభవిస్తున్న 20 మంది ఆప్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న ఎన్నికల సంఘం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో కేబినెట్‌ హోదా కూడా లాభదాయకమేనని, కాబట్టి ఈ వ్యాజ్యంపై త్వరగా విచారించాలని ఇటీవల రేవంత్‌ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిల ధర్మాసనం ఇటీవల పిటిషన్‌ను విచారణ జరిపింది.  

ప్రభుత్వం కాలయాపన చేస్తోంది
న్యాయవాదిగా ఉన్నపుడు వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న వారిలో ఒకరి తరఫున జస్టిస్‌ విజయలక్ష్మి వకాలత్‌ దాఖలు చేయడంతో కేసును విచారించేందుకు ఆమె విముఖత చూపారు. దీంతో జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు బుధవారం వ్యాజ్యం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని అధికరణ 164 (1ఎ) ప్రకారం ముఖ్యమంత్రితో సహా మంత్రులు 15 శాతానికి మించడానికి వీల్లేదన్నారు. కావాల్సిన వారికి కేబినెట్‌ హోదా ఇచ్చేందుకు రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవని, అయినా ప్రభుత్వం ఇష్టమొచ్చిన వారికి కేబినెట్‌ హోదానిచ్చిందని తెలిపారు. వ్యాజ్యంపై కౌంటర్‌ దాఖలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ‘20 మంది ఆప్‌ ఎమ్మెల్యేలపై ఆనర్హత వేటు’విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

Back to Top