కొమురన్న.. ఎల్లన్న.. బాగున్నారా? | Sakshi
Sakshi News home page

కొమురన్న.. ఎల్లన్న.. బాగున్నారా?

Published Wed, Mar 20 2019 1:40 PM

Harish Rao Meet  Raghavapur Peoples - Sakshi

సాక్షి, సిద్దిపేటజోన్‌: ఏం కొమురన్న... గొర్రెలు ఎట్లున్నాయి? బేరం మంచిగా నడుస్తుందా..  మీరందరూ బాగుండాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరిక అందుకే ఎక్కడా లేనివిధంగా  రాష్ట్రంలో గొర్లకురుమలకు ఆర్థిక భరోసాతో పాటు కుటుంబాల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏం ఎల్లన్న.. నీ ఆరోగ్యం ఎట్లుందే... ఊరు బాగుండాలి, మీరు బాగుండాలి అంటే గొర్రెల షెడ్లు నిర్మించుకోవాలి. అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు గొల్లకురుమలతో మాటామంతి కలిపారు. మంగళవారం తన నివాసంలో సిద్దిపేట  మండలం రాఘవాపూర్‌ గ్రామ గొల్లకురుమలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ గొల్లకురుమల కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని చేపట్టి ఆర్థికంగా ఎదుగుదలతో పాటు స్వయం సంవృద్ధికోసం ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. ఇదే సమయంలో గొర్రెల పెంపకందారులు కూడా ఆర్థికంగా నిలదోక్కుకునేలా పెద్దఎత్తున గొర్రెల పెంపకానికి నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో గొల్లకురుమలు ఆనందంగా ఉండాలని, సామూహిక గొర్రెల షెడ్లు నిర్మించుకోవాలని అందుకు అవసరమైన స్థలాన్ని చూడాలంటూ సర్పంచ్, తహసీల్దార్‌లకు సూచించారు. 


ఒక్కొక్కరితో ఆప్యాయంగా..
గొల్లకురుమల సమావేశానికి వచ్చిన కురుమ పెద్దలను హరీశ్‌రావు ఒక్కొక్కరిని పేరుపెట్టి ఆప్యాయంగా పిలుస్తూ వారితో ముచ్చటించారు. గ్రామానికి చెందిన కొమురయ్యతో పథకం గూర్చి ఆరా తీశారు. కొమురన్న గొర్రెలు ఎట్లున్నయి, ఎన్ని పిల్లలు అయినయి మంచిగా చూసుకుంటున్నావా అంటూ ఆరా తీశారు. ఒక దశలో కొమురయ్య బదులిస్తూ మీ దయతో గొర్రెలు మంచిగానే ఉన్నాయని వాటిని బాగానే సాదుకుంటున్నట్లు పేర్కొన్నారు. అక్కడే ఉన్న సాయిలు అనే వ్యక్తిని పలకరిస్తూ  బాగున్నావా సాయిలు బేరం చేస్తున్నావా, ధరఎంత పలుకుతుంది అంటూ  స్థితిగతులపై ఆరా తీశారు.

అలా సమావేశానికి వచ్చిన ప్రతి గొల్లకురుమను పలుకరిస్తూ గొర్రె పిల్లల స్థితిగతులు, వ్యవసాయ సాగు వివరాలు, రైతుబంధు అమలుతో పాటు కుటుంబ సభ్యుల గూర్చి పిల్లల చదువు గూర్చి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. మీ ఆర్థిక ఎదుగుదలకు, జీవనోపాధి కోసం ప్రభుత్వం గొర్రెలను ఇస్తుందని, మీ పిల్లలను వాటికి కాపాల కోసం పంపకుండా మంచిగా చదివించాలని భవిష్యత్తులో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటుచేస్తున్నామని బాగా చదివితే ఉపాధి అవకాశాలు ఉంటాయని దిశనిర్దేశం చేశారు.

అదేవిధంగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని సిద్దిపేటలో ప్రభుత్వ ఆస్పత్రిని బాగా చేశామని, అన్ని సౌలతులు ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో మొక్కలు నాటాలని, ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించి పరిశుభ్రమైన గ్రామంగా మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ గ్యార వజ్రవ్వయాదగిరి, ఎంపీపీ యాదయ్య, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు శ్రీనివాసరావు, గొర్లకురుమ సంఘం జిల్లా నాయకులు శ్రీహరియాదవ్, రాఘవాపూర్‌ సర్పంచ్‌ ఎర్వ రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement