ఐదో తేదీ వరకు పత్తి విత్తుకోవచ్చు

Guidelines for States Released about Cotton Crop - Sakshi

ఎక్కువ దిగుబడినిచ్చే బీటీ హైబ్రిడ్‌ విత్తనాలు వేసుకోండి 

రైతులకు ఐకార్‌ సూచనలు 

రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నెల ఐదో తేదీ వరకు పత్తి విత్తనాలను విత్తుకోవచ్చని రైతులకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) సూచించింది. తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడినిచ్చే బీటీ హైబ్రిడ్‌ విత్తనాలు వేసుకోవాలని పేర్కొంది. వానాకాలం సాగయ్యే పత్తి పంటలో గులాబీ రంగు పురుగును నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించింది. రైతులు సహా వ్యవసాయ శాఖ, పరిశోధన సంస్థలు, విత్తన కంపెనీలు, వ్యవసాయ వర్సిటీలు ఎలాంటి కార్యాచరణ పాటించాలో పేర్కొంది. ఈ మేరకు పలు మార్గదర్శకాలు రూపొందించి రాష్ట్రాలకు పంపింది. 

10 లక్షల ఎకరాల్లో నష్టం.. 
రాష్ట్రంలో గతేడాది 48 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా 10 లక్షల ఎకరాల్లో గులాబీ పురుగు సోకి దిగుబడి పడిపోయింది. 2009 లోనే బీటీ–2 గులాబీ పురుగును తట్టుకునే శక్తిని కోల్పోయింది. పరిశోధన ఫలితాల వివరాల ప్రకారం 2010లో అధికారికంగా దీన్ని నిర్ధారించారు. దేశవ్యాప్తంగా 93% బీటీ–2 విత్తనాలనే రైతులు సాగు చేస్తున్నారు. విత్తన లోపంతోపాటు రైతులు, ప్రభుత్వాలు, పరిశోధన సంస్థలు చర్యలు తీసుకోకపోవడం తెగులు విస్తృతికి కారణమని ఐకార్‌ పేర్కొంది. గులాబీ పురుగుతో 8 నుంచి 92 శాతం పంట నష్టం వాటిల్లుతున్నట్లు గుర్తించిన ఐకార్‌.. దిగుబడి 30 శాతం పడిపోతున్నట్లు వివరించింది. పత్తి అత్యధికంగా సాగవుతున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రైతులు ఈ తెగులుతోనే తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. గులాబీ పురుగుతో ఇంతలా నష్టం జరుగుతున్నా ప్రభుత్వం బీటీ–2 విత్తనాలకు ధరలు నిర్ణయించి సాగు చేయిస్తుండటంపై రైతు సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.  

ఐకార్‌ సూచనలివే.. 
- నల్లరేగడి నేలల్లో జూన్‌ 15 నుంచి జూలై 5వ తేదీ వరకు బీటీ, హైబ్రిడ్‌ పత్తి విత్తనాలను వేసుకోవాలి.  
- పత్తి పువ్వుకు 10 శాతం, ఆకుకు 10 శాతం పురుగు సోకితే వెంటనే రసాయన మందులు వాడాలి.  
- గులాబీ పురుగు నివారణకు ట్రైకోగ్రామా బ్యాక్టీరియా రసాయనం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ మధ్యలో వచ్చే అవకాశం ఉంది. 
- పత్తి విత్తులు వేసిన తరువాత 45 నుంచి 60 రోజుల వ్యవధిలోనే గులాబీ పురుగు దాడి జరుగుతోంది.  
- విత్తన ప్యాకెట్లతో పాటు గులాబీ పురుగు వస్తే సాయం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ను రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి.  
- తక్కువ కాలవ్యవధిలో ఎక్కువ ఉత్పాదకత వచ్చే బీటీ హైబ్రిడ్‌లపై గ్రామాలలో వ్యవసాయ వర్సిటీ సర్వే చేయాలి. 
- బయో పెస్టిసైడ్స్‌ వినియోగం, ఫలితాలను అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాలి. 
- రైతులకు సామూహికంగా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top