ఇసుక తవ్వకాలపై మార్గదర్శకాలు  | Sakshi
Sakshi News home page

ఇసుక తవ్వకాలపై మార్గదర్శకాలు 

Published Fri, Dec 21 2018 1:07 AM

Guidelines on sand mining - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇసుక తవ్వకాలకు సంబంధించి గతంలో తాము ఇచ్చిన మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్రమ ఇసుక తవ్వకాలను సవాల్‌ చేస్తూ రేలా అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన కేసు విచారణలో భాగంగా ఎన్జీటీ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. 2016లో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు తోడుగా నదీపరీవాహక ప్రాంతాల్లో తవ్వకాలకు సంబంధించి మహారాష్ట్ర కేసులో తాము ఇచ్చిన ఆదేశాలే అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని గురువారం విచారణ సందర్భంగా జస్టిస్‌ రాఘవేంద్ర రాథోర్‌ బెంచ్‌ పేర్కొంది. ‘నదీ పరీవాహక ప్రాంతాల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలకు సంబంధించి ముందస్తు అనుమతి తప్పనిసరి. మైనింగ్‌ విలువను బట్టి 25 శాతం వ్యయాన్ని ఆ ప్రాంతంలో జీవావరణాన్ని పెంచడానికి వసూలు చేసేలా నిబంధనలు ఉండాలి.

అక్రమ తవ్వకాలు జరిపితే దాని వ్యయం సహా పర్యావరణానికి ఎంతమేర నష్టం కలిగిందో అంచనా వేసి నష్టపరిహారాన్ని వసూలు చేయాలి. ఇప్పటివరకు ఇచ్చిన మైనింగ్‌ అనుమతులకు హద్దులు ధ్రువీకరించి ప్రజలకు అందుబాటులో ఉంచాలి. తవ్వకాలకు సంబంధించి ఏటా ఒక థర్డ్‌ పార్టీ ద్వారా ఆడిట్‌ చేయించి వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలి’అని ఎన్జీటీ తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. మైనింగ్‌లను నిరంతరం పర్యవేక్షించేందుకు శాశ్వతవ్యవస్థను రూపొందించుకోవాలని సూచించింది. పూడికతీతపేరుతో తెలుగు రాష్ట్రాల్లో అక్ర మ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ గతంలోనే ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఏర్పాటైన కమిటీ కూడా ఇదే విషయాన్ని నిర్ధారించిందని చెప్పారు.  ఇసుక తవ్వకాలపై  మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ కేసు విచారణను ట్రిబ్యునల్‌ ముగించింది.   

Advertisement
Advertisement