టెన్త్‌ పరీక్షలపైనా జీఎస్‌టీ! 

GST effect also on tenth public exam

     రూ. కోటి వరకు పెరగనున్న పేపర్, ముద్రణ ధరలు 

     విద్యాభివృద్ధి కార్యక్రమాలపై  రూ. 43 కోట్ల జీఎస్టీ భారం 

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షలపైనా జీఎస్‌టీ ప్రభావం తప్పడం లేదు. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యే పరీక్షలకు అవసరమైన పేపర్‌ కొనుగోలు, ప్రశ్నపత్రాల ముద్రణపై జీఎస్‌టీ భారాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం అంచనా వేసింది. ఆ ప్రకారం పేపర్, ముద్రణ ధరల పెరుగుదల రూపంలో గతంలో కంటే ఈసారి రూ.కోటి వరకు భారం పడే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అంచనా వేసింది. అయితే ఈ భారాన్ని విద్యార్థులపై వేస్తారా, లేక ప్రభుత్వమే భరిస్తుందా.. అనేది తేల్చాల్సి ఉంది. ఈ మేరకు అంచనాలను ఆర్థిక శాఖకు పరీక్షల విభాగం పంపింది.

ప్రస్తుతం ఏటా పరీక్షల నిర్వహణకు రూ.18 కోట్ల వరకు అవుతుండగా విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో రూ.11 కోట్ల వరకు వస్తోంది. మిగిలిన రూ.7 కోట్లను ప్రభుత్వం భరిస్తోంది. ఈ నేపథ్యంలో పరీక్ష ఫీజు రూ.125ను పెంచాలని ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రభుత్వానికి గతేడాదే ప్రతిపాదనలు పంపింది. అయితే ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఈసారి జీఎస్‌టీ భారం కూడా పడనుంది. ఇప్పటివరకు పేపర్‌ కొనుగోలు, మద్రణకు సంబంధించిన వ్యవహారాలపై 4.5 శాతం పన్నుల రూపంలో వెచ్చించాల్సి వస్తుండగా, ఇకపై 12 శాతం జీఎస్‌టీ రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి. పరీక్ష ఫీజులను ప్రభుత్వం పెంచుతుందా, లేదా అనేది తేలిన తర్వాతే విద్యార్థుల నుంచి ఫీజుల వసూలుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ పరీక్షల విభాగం భావిస్తోంది. 

రూ. 43 కోట్ల అదనపు భారం 
పాఠశాల విద్యలో ఇతర విద్యాభివృద్ధి కార్యక్రమాలపై జీఎస్‌టీ భారం రూ.43 కోట్లుగా విద్యాశాఖ అంచనా వేసింది. స్కూలు భవనాల అద్దె, భవనాల మరమ్మతులు, నిర్వహణ, మధ్యాహ్న భోజనం, నిర్మాణ దశలో ఉన్న మోడల్‌ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల నిర్మాణాలు, నిర్వహణ, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ) సివిల్స్‌ వర్క్స్‌పై గతంలో రూ.17.27 కోట్లు వ్యాట్‌ ఉండగా, ప్రస్తుత జీఎస్‌టీ రూ.60.11 కోట్లు పడుతుందని విద్యా శాఖ లెక్కలు వేసింది. దాని ప్రకారం అదనంగా రూ.42.84 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని తేల్చింది. ఇందులో ఒక్క ఆర్‌ఎంఎస్‌ఏ సివిల్‌ వర్క్స్‌లోనే గతంలో రూ.13.09 కోట్లు వ్యాట్‌ అవుతుండగా, ప్రస్తుత జీఎస్‌టీతో రూ.47.11 కోట్లకు పెరగనున్నట్లు లెక్కలు వేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top