గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ పనులు వడివడిగా..!

Govt Speed Up Green Industrial Park Project Works In Choutuppal  - Sakshi

త్వరలో శంకుస్థాపన చేసే అవకాశం

రేయింబవళ్లు శ్రమిస్తున్న అధికారులు, సిబ్బంది

ఇప్పటికే 60శాతం వర్క్స్‌ పూర్తి

సాక్షి, చౌటుప్పల్‌: తెలంగాణకే తలమానికమైన చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం గ్రామంలో చేపట్టిన గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ పనులు వడివడిగా సాగుతున్నాయి. ప్రధాన రహదారి మధ్యన సెంట్రల్‌ లైటింగ్‌ సైతం ఏర్పాటు చేశారు. అంతర్గత రహదారులు, ప్రధాన డ్రెయినేజీ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పార్క్‌లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాకు అవసరమైన సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు సైతం పూర్తి కావొచ్చాయి. అయితే పార్క్‌ శంకుస్థాపన ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడడంతో ఈ సారి అలాంటి పరిస్థితి రాకుండా అధికారులు పక్కా ప్రణాళికతో పనులు చేపడుతున్నారు. 

చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ పనులు వేగవంతమయ్యాయి. తెలంగాణలోనే ప్రప్రథమ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఇదే కావడం విశేషంగా చెప్పవచ్చు. ఇప్పటికే వివిధ రకాల కారణాలతో రెండు పర్యాయాలు శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మరోసారి కూడా వాయిదా పడొద్దన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం పనులను ముమ్మరం చేసింది. ఇప్పటికే 60శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను వీలైనంత త్వరలో పూర్తి చేసేందుకు రేయింబవళ్లు పనులను కొనసాగిస్తున్నారు.  

పార్క్‌ కోసం 1,144 ఎకరాల భూసేకరణ
గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ కోసం 1.144ఎకరాల భూమిని సేకరించారు. సీలింగ్, అసైన్డ్, పట్టా భూములకు సంబంధించి మూడు దఫాలుగా భూసేకరణ చేశారు. మొదటి విడతలో 682, 693, 695, 697, 699, 701, 702, 704, 705, 706, 707, 708, 709, 711, 712, 713, 714, 715, 716, 717 సర్వే నంబర్లలోని 128మంది రైతుల వద్ద 377ఎకరాల సీలింగ్‌ అసైన్డ్‌ భూమిని సేకరించారు. రెండో విడతలో 644 సర్వేనంబర్‌లో 98మంది రైతుల నుంచి 194.04ఎకరాల ప్రభుత్వ అసైన్డ్‌ భూమిని సేకరించారు. మూడో విడతలో 727, 735, 736, 737, 753, 755, 756, 757, 765, 758, 754 సర్వేనంబర్లలోని 207మంది రైతుల వద్ద 472 ఎకరాల సీలింగ్, పట్టా భూములను సేకరించి పరిహారం అందజేశారు. అదే విధంగా 698, 701, 703, 704, 705, 710 సర్వేనంబర్లలోని 24మంది రైతుల వద్ద 101.19ఎకరాల పట్టా భూమిని సైతం సేకరించగా పరిహారం విషయంలో రైతులు కోర్టుకు వెళ్లారు. గత ఏడా ది ఆగస్టు నెలలో, ఈ ఏడాది ఏప్రిల్‌లో శంకుస్థాపన జరగాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా పడింది. కాగా త్వరలోనే పార్క్‌ శంకుస్థాపన జరిగే అవకాశాలు ఉన్నాయి.  

ముమ్మరంగా నిర్మాణ పనులు  
ఇండస్ట్రియల్‌ పార్క్‌లో ప్రధాన రహదారితో పాటు అంతర్గత రోడ్లు, ఇతర వసతుల కోసం ప్రభుత్వం గత ఏడాది రూ.36కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రధానంగా 65వ నంబరు జాతీయ రహదారి నుంచి రెండు కిలోమీటర్ల దూరం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.18కోట్లు కేటాయించగా ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. ప్రధాన రహదారి మధ్యన సెంట్రల్‌ లైటింగ్‌ సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పార్క్‌లోని అంతర్గత రహదారులు, ప్రధాన డ్రెయినేజీ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పార్క్‌లో ఏర్పాటయ్యే  పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాకు అవసరమైన సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు సైతం పూర్తి కావొచ్చాయి. అలాగే పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా పార్క్‌లోని భూమిని చదును చేస్తున్నారు.  

రూ.12వేల కోట్ల పెట్టుబడులు 
ఇండస్ట్రియల్‌ పార్క్‌లో సేకరించిన భూమిలో ఇప్పటికే 377ఎకరాల్లో పరిశ్రమల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా 396మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఆ మేరకు వారికి అవసరమైన స్థలాల కేటాయింపు సైతం జరిగింది. ఈ పరిశ్రమల ఏర్పాటుతో ప్రభుత్వానికి 12వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. ప్రత్యక్షంగా 20వేలు, పరోక్షంగా మరో 20వేల మందికి ఉపాధి లభించనుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top