నీకు సగం.. నాకు సగం..

govt land occupation in nizamabad - Sakshi

బల్దియాలో భూ అక్రమాలు 

 ఒక్కొక్కటిగా వెలుగులోకి.. 

 లేఅవుట్‌ ఫైళ్లు గల్లంతు 

 ఇన్‌చార్జి కమిషనర్, ఆర్డీవో విచారణ 

బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీగా ఆవిర్భవించడంతో గతంలో గ్రామ పంచాయతీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఆర్డీవో రాజేశ్వర్‌ బాధ్యతలు స్వీకరించి, బల్దియాపై పూర్తిస్థాయి దృష్టి సారించారు. బల్దియాలో జీతభత్యాలు, జమా ఖర్చులు, ఆదాయ వనరులు, అక్రమ లే అవుట్లు, మున్సిపల్‌ స్థలాలపై ఆయన విచారిస్తున్నారు. అయితే వీటిలో కీలకమైన లేఅవుట్లు, 10శాతం భూముల కేటాయింపులపై ఆర్డీవో చేతికి ఫైళ్లు అందకుండా కొందరు అక్రమార్కులు ఫైళ్లనే మాయం చేశారు. 1990 నుంచి 2015 వరకు గల ఫైళ్లను మొత్తం బల్దియాలోనే లేకుండా చేశారు. కొందరు వార్డు సభ్యులు, అధికారులు కలిసి చేసిన అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు ఏకంగా పాత ఫైళ్లనే గల్లంతు చేయడం చర్చనీయాంశమవుతోంది. బల్దియా పరిధిలో చేసే లే అవుట్ల సందర్భంగా పార్కులు, ఇతర ప్రజా కార్యకలాపాల కోసం కేటాయించే భూమిని కొందరు వార్డు సభ్యులు, అధికారుల సహకారంతో విక్రయించిన సంఘటనలు కోకొల్లాలుగా ఉన్నాయి. 1995 నుంచి 2018 వరకు లే అవుట్లకు సంబంధించిన భూములు జీపీ పరిధిలో ఉండాలి. అయితే వార్డు సభ్యులు ‘నీకు సగం.. నాకు సగం’ అనే రీతిలో అధికారులతో మిలాఖాత్‌ అయి ఆ భూములను అమ్ముకున్నారు.

చేతులు మారిన భూములు.. 
వాస్తవానికి బాన్సువాడ బల్దియా పరిధిలో అధికారికంగా 28,509 గజాల భూమి ఉందని రికార్డులు చెబుతున్నాయి. 1983 నుంచి 2018 వరకు గ్రామ పంచాయతీ(ప్రస్తుత బల్దియా) పరిధిలో 63 లే అవుట్లు చేశారు. వీటిలో 10 శాతం చొప్పున భూములను కేటాయించారు. అయితే ప్రజాప్రతినిధులు వివిధ కుల సంఘాల పేరిట భూములను ధారాదత్తం చేశారు. వాటిని ప్లాట్లుగా మార్చి ఇద్దరు, ముగ్గురు చేతులు మార్చి మరీ అమ్ముకున్నారు. ప్రస్తుతం పదిశాతం భూముల్లో భవనాలు వెలిసాయి. జీపీ లెక్కల ప్రకారం 4,298 గజాల భూమిని సంఘాలకు కేటాయించారు. అయితే అనధికారికంగా మరో 10వేల గజాల భూమి కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. కొందరు అక్రమార్కులు 10శాతం భూములను కాజేసేందుకు పాలకవర్గంతో తీర్మానాలు కూడా చేయించారు. ప్రస్తుతానికి 14,211 గజాల భూమి  మున్సిపాలిటీ ఆధీనంలో ఉంది. లేఅవుట్‌ ఫైళ్లు గల్లంతవడంతో ఆ భూములను గుర్తించడం మున్సిపల్‌ సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. ఇన్‌చార్జి కమిషనర్‌ రాజేశ్వర్‌ మున్సిపల్‌ కార్యాలయంలోని అన్ని రికార్డులను పక్షం రోజుల క్రితమే  స్వాధీనం చేసుకున్నారు. వాటిలో లేఅవుట్‌ ఫైళ్లు లేకపోవడం గమనార్హం.   

ఫైళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం.. 
బల్దియాకు కీలకం లే అవుట్‌ ఫైళ్లు. వాటి ఆధారంగానే రోడ్లు, ప్లాట్లు, ఇండ్ల నిర్మాణాలు, జీపీకి కేటాయించిన భూములను గుర్తిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత గల ఈ ఫైళ్ల మాయంతోపాటు వాటి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ ఫైళ్లను గల్లంతు చేస్తే తాము చేసిన అక్రమాలను కప్పి పుచ్చవచ్చని, అమ్మిన భూములను స్వాధీనం చేసుకొనే వీలుండదని పక్కా ప్రణాళిక ప్రకారం వీటిని మున్సిపాలిటి కాకముందే మాయం చేశారు.  

అనుమతులన్నీ పెండింగ్‌లోనే.. 
గత నెల 20న బాన్సువాడను మున్సిపాలిటీగా మార్చుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే మూడు నెలల క్రితమే బాన్సువాడ మున్సిపాలిటీగా మారనుందనే ప్రచారం జరగడంతో అనేక మంది భవన నిర్మాణాల కోసం దరఖాస్తులు చేసుకొని వార్డు సభ్యుల ద్వారా అనుమతులు పొందారు. అయినా మరో వంద దరఖాస్తులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. మున్సిపల్‌ నిబంధనల ప్రకారం వాటికి అనుమతి ఇవ్వాలి. లేఅవుట్ల ఫైళ్లు కూడా ఆర్డీవో పెండింగ్‌లో పెట్టారు. మున్సిపాలిటీలో ఆదాయ వనరుల వివరాలు స్పష్టంగా లేవు.

అక్రమాలపై వెంటనే విచారిస్తాం.. 
మున్సిపాలిటీలో గతంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతాం. లే అవుట్‌ ఫైళ్ల గల్లంతవగా, దీనిపై ఆరా తీçస్తున్నాం. ఇంకా పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. సిబ్బంది రాగానే బల్దియా పాలనను గాడిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తా. జీపీకి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నాం. ఇకపై ఏ అనుమతి లేనిదే పనులు చేయరాదు. 
–రాజేశ్వర్, ఇన్‌చార్జి కమిషనర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top