రాష్ట్రపతికి గవర్నర్‌ విందు

Governor Narasimhan hosts dinner for President at Raj Bhavan - Sakshi

శీతాకాల విడిదికి వచ్చిన సందర్భంగా ఏర్పాటు

హాజరైన ఇరురాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు

అంతకుముందు ఎయిర్‌పోర్టు వద్ద రాష్ట్రపతికి ఘన స్వాగతం

సాక్షి, హైదరాబాద్‌: నాలుగు రోజుల శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం హైదరాబాద్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సీఎం కె.చంద్రశేఖర్‌రావుతోపాటు ఏపీ  సీఎం చంద్రబాబునాయుడు, శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్, ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ రావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఏపీ మంత్రులు యనమల, చినరాజప్ప, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీలు కేశవరావు, చిరంజీవి, బాల్కసుమన్, తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య, జీహెచ్‌ఎంసీ మేయర్‌ రామ్మోహన్, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, షబ్బీర్‌అలీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, సినీనటుడు రానా, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌తో సీఎం కేసీఆర్‌ ముచ్చటిస్తూ కనిపించారు. విందు సమయంలో ఇండియన్‌ ఐడల్‌ విజేత రేవంత్‌.. బాహుబలి చిత్రంలోని ‘ఎవ్వడంట ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుంది’ అనే పాట పాడి ఆహూతులను అలరించారు.

రాష్ట్రపతికి గవర్నర్, సీఎం ఘన స్వాగతం
అంతకుముందు రాష్ట్రపతికి హకీంపేట ఎయిర్‌పోర్టు వద్ద గవర్నర్‌ నరసింహన్, సీఎం కేసీఆర్‌ ఘనస్వాగతం పలికారు. గవర్నర్‌ సతీమణి విమలా నరసింహన్, మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, స్పీకర్‌ మధుసూదనా చారి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మో హన్, ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సీఎస్‌ ఎస్పీ సింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు కోవింద్‌కు స్వాగతం పలికారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ మధ్యాహ్నం 12.45 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి కోవింద్‌ చేరుకున్నారు. ఈనెల 27 వరకు ఆయన అక్కడే బస చేయనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top