పదోన్నతుల మాటేమిటి?

Government Teachers Demanding Promotions In Mahabubnagar - Sakshi

ఉమ్మడి జిల్లాలో  టీఆర్టీ అభ్యర్థుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు  

1,979 పోస్టులు  భర్తీ చేసేందుకు ఏర్పాట్లు  

సాక్షి, మహబూబ్‌నగర్‌ : టీఆర్టీ ద్వారా ఉద్యోగాలకు అర్హత సాధించిన ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భర్తీకి ప్రభుత్వం ఓకే చెప్పిడంతో అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2017నవంబర్‌లో పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసి రెండేళ్లు పూర్తయింది. భర్తీ ఉత్తర్వులు అందకపోవడంతో అభ్యర్థులు అనేక విధాలుగా ఉద్యమాలు చేశారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1,979 ఉపాద్యాయ పోస్టుల  గాను 2018 ఫిబ్రవరీ, మార్చిలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించన పరీక్షకు  దాదాపు 50వేల మందికి పైగా అభ్యర్థులు టీఆర్టీ పరీక్ష రాశారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి అనందంగా ఉన్నా సీనియర్‌ ఉపాధ్యాయులకు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోకుండానే నేరుగా పోస్టులు భర్తీ చేయడం సరికాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.  

1,979 పోస్టుల భర్తీకి కసరత్తు 
టీఆర్టీ నోటిఫికేషన్‌ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ  ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా జరగనుంది. ఇందుకు సంబందించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. కలెక్టర్‌ కమిటీ చైర్మన్‌గా, జాయింట్‌ కలెక్టర్‌ను వైస్‌ చైర్మన్‌గా, డీఈఓను కార్యదర్శిగా నియమించారు. ఈ కమిటీ పాత జిల్లాలో ఎంపికైన అభ్యర్థుల రోస్టర్‌ పాయింట్లకు సంబంధించిన వివరాలను విద్యాశాఖకు అందిస్తారు. పాత, కొత్త జిల్లాల వారీగా ఖాళీలు, సబ్జెక్టు, మాధ్యమం, ప్రాంతాల వారీగా వివరాలు సేకరించాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమిస్తూ కమిటీ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది.  వివిధ సబ్జెక్టుల వారీగా 1,979 పోస్టులను ఖాళీలకు భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. 1979 ఎస్జీటీ, 1400 ఎస్టీటీ పోస్టులు ఇవ్వనుండగా, మిగతావి వివిధ సబ్జెక్టులకు సంబంధించి స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఇవ్వనున్నారు.

ప్రమోషన్లు కల్పించాల్సిందే 
గత డీఎస్సీలో సీనియర్ల ఉపాధ్యాయులకు ప్రమోషన్లు బదిలీలు ఇచ్చిన తర్వాత మాత్రమే నూనతంగా వచ్చిన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం ఉంది. కనీసం అడ్‌హాక్‌ పద్ధతిలో అయినా పోస్టింగ్‌లు ఇచ్చి, విద్యాసంవత్సరం ప్రారంభంలో వారిని రివర్ట్‌ చేస్తే ఇబ్బంది ఉండదు. లేకపోతే సీనియర్‌ ఉపాధ్యాయులు నష్టపోయే అవకాశం ఉంది.
-గట్టు వెంకట్‌రెడ్డి,పీఆర్‌టీయు జిల్లా అధ్యక్షుడు

న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి 
ప్రస్తుతం ప్రభుత్వం టీఆర్టీ అభ్యర్థుల అభ్యర్థుల భర్తీ ప్రక్రియను ఎటువంటి న్యాయపరైమన ఇబ్బందులు రాకుండా భర్తి చేస్తే బాగుటుంది. మొదటిగా సీనియర్‌ ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు ఇవ్వాలి. అదికూడా పాత జిల్లాల ప్రకారమే ఇస్తే ఇబ్బందులు ఉండవు. కానీ నూతనంగా ఏర్పడిన జిల్లాల వారీగా ఇస్తే సమస్యలు ఎదురవుతాయి. పాత జిల్లాల వారీగా టీఆర్టీ నోటిఫికేషన్‌ ఇచ్చి, ప్రమోషన్లు మాత్ర కొత్త జిల్లాల ప్రకారం ఇవ్వడం సరికాదు. 
– దుంకుడు శ్రీనివాస్, టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు      

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top