కంది.. చెల్లింపులేవి..!

government not paying money for toordall to farmers - Sakshi

కందులు కొనుగోలు చేసినా చెల్లింపులు పెండింగ్‌

 ఉమ్మడి జిల్లాలో రైతులకు రూ.వంద కోట్లకు పైగా బకాయిలు

మంత్రి హరీష్‌రావు     లేఖతోనైనా     డబ్బులు     విడుదలయ్యేనా..!

సాక్షి, ఆదిలాబాద్‌ : కందులు కొనుగోలు చేసిన వారం రోజుల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 15,270 మంది రైతులు సుమారు రెండు లక్షల క్వింటాళ్ల కందులు విక్రయించారు. డబ్బులు చెల్లించడంలో జాప్యం జరుగుతుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు రూ.100 కోట్లకు పైగా రైతులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. 
కంది బకాయిలు కొండంత పేరుకపోయాయి. రైతుల నుంచి కొనుగోలు చేసినప్పటికీ చెల్లింపులను పెండింగ్‌లో పెట్టడంతో వారు లబోదిబోమనే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రైతులకు రూ.వంద కోట్లకు పైగా బకాయిలు ఏర్పడ్డాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తితోనైనా ఆ డబ్బులు విడుదలయ్యేనా అని రైతులు ఎదురుచూస్తున్నారు. మంత్రి సోమవారం కేంద్ర మంత్రికి ఈ డబ్బులు విడుదల చేయాలని లేఖ రాసిన విషయం విదితమే. రైతులకు వారంలో పంట సొమ్మును అందజేస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు కంది మూటలయ్యాయి.

గోరంత చెల్లింపు
ఉమ్మడి జిల్లాలో ఇప్పటికి వందల కోట్ల రూపాయల కందులు కొనుగోలు చేయగా, గోరంత చెల్లింపులు మాత్రమే చేశారు. పంట కొనుగోలు చేసిన వారం రోజుల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేక పోయింది. జనవరి 22న ఆదిలాబాద్‌తోపాటు నిర్మల్, కుమురంభీం జిల్లాల్లో కంది కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మంచిర్యాలలో ఇటీవల ప్రారంభం అయ్యాయి. ఆదిలాబాద్‌లో ఆరు, నిర్మల్‌లో ఆరు, కుమురంభీంలో మూడు, మంచిర్యాలలో రెండు చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో మార్క్‌ఫెడ్‌ అధికంగా కొనుగోలు చేస్తుండగా, కొన్ని కేంద్రాల్లో డీసీఎంఎస్, పీఏసీఎస్‌లో కూడా కొనుగోలు చేస్తున్నాయి. నిర్మల్‌లో పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్, కుమురంభీం జిల్లాలో మార్క్‌ఫెడ్, పీఏసీఎస్, మంచిర్యాలలో పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి.

మద్దతు ధర నేపథ్యంలోనే..
కందులకు కేంద్ర ప్రభుత్వం క్వింటాలుకు రూ.5450 ధర ప్రకటించిన విషయం తెలిసిందే. బయట మార్కెట్లో కందులకు క్వింటాలుకు రూ.4వేల నుంచి రూ.4500 లోపే ఇస్తున్నారు. దీంతో రైతులు మద్దతు ధరతో ప్రభుత్వ రంగ సంస్థలకే విక్రయిస్తున్నారు. జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ద్వారా అధికంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఆదిలాబాద్‌లో 9,675 మంది రైతులు, కుమురంభీం జిల్లాలో 1,997, నిర్మల్‌లో 3,566, మంచిర్యాలలో 32 మంది రైతులు కంది పంటను విక్రయించారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో సుమారు 2లక్షల క్వింటాళ్ల వరకు కంది కొనుగోళ్లు జరిగాయి. ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే కంది పంట 19,447 హెక్టార్లలో సాగు కాగా, 2లక్షల 43వేల 090 క్వింటాళ్లు దిగుబడి అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్‌ జిల్లాలో లక్షా 36,022 క్వింటాళ్ల కంది కొనుగోళ్లు జరిగాయి. మిగతా జిల్లాలోనూ ఇంకా మార్కెట్‌కు పెద్ద ఎత్తున రావాల్సి ఉంది. ప్రధానంగా మద్దతు ధరతో ప్రభుత్వ రంగ సంస్థ కొనుగోలు చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్న ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కందులను తీసుకొస్తున్నారు. చెల్లింపులు మాత్రం ఆలస్యంగా జరుగుతుండడంతో రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. పంటను అమ్మి సొమ్ము కోసం ఎదురుచూసే పరిస్థితులు నెలకొన్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top