నాలుగురోజులుగా ప్రసవ వేదన

government hospital staff change blood group pregnent women  - Sakshi

జమ్మికుంట ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

‘బీ పాజిటివ్‌’కు బదులు ‘ఓ పాజిటివ్‌’ అంటూ రిపోర్టు

వరంగల్‌కు వెళ్లాలంటూ సూచన

జమ్మికుంట(హుజూరాబాద్‌): ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి నాలుగు రోజులుగా నరకం చూపించారు  జమ్మికుంట సర్కార్‌ దవాఖానా వైద్యులు. సాధారణ ప్రసవం కోసం అంటూ చెప్పి ఇబ్బందులకు గురిచేశారు. అంతేకాకుండా రక్తపరీక్షలు చేసి బ్లడ్‌ గ్రూప్‌ తప్పుగా రిపోర్టు ఇచ్చారు. అనుమానం వచ్చి ప్రైవేట్‌ డయాగ్నోసిస్‌లో మళ్లీ పరీక్షలు చేస్తే అసలు విషయం తెలిసింది. దీంతో గర్భిణి భర్త వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. జమ్మికుంట మండలం పెద్దంపల్లికి చెందిన మోతె సుధాకర్‌–సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు. సుజాత గర్భం దాల్చడంతో జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రతి నెల వైద్యసేవలు పొందుతున్నారు. ప్రసవానికి ఈనెల 22న జమ్మికుంట ప్రభుత్వాస్పత్రిలో చేరింది. సుజాతను పరీక్షించిన అనంతరం రక్తం తక్కువగా ఉందంటూ సూచించారు. ఆస్పత్రి ల్యాబ్‌లో రక్తపరీక్షలు చేసి ‘ఓ పాజిటివ్‌’ గ్రూప్‌గా రిపోర్టు ఇచ్చారు. ఆమె భర్త సుధాకర్‌ రిపోర్టుతో హన్మకొండలోని రెడ్‌క్రాస్‌ బ్లడ్‌బ్యాంక్‌కు వెళ్లాడు.

రిపోర్టు చూసిన ల్యాబ్‌ నిర్వాహకులు వెంట తీసుకెళ్లిన శాంపిల్‌బ్లడ్‌తో పరీక్షలు చేయగా గ్రూప్‌వేరేగా వచ్చింది. మళ్లీ పరీక్ష చేయించుకొని రమ్మనడంతో అనుమానం వచ్చిన సుధాకర్‌ జమ్మికుంటలోని ఓ ప్రైవేట్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో రక్త పరీక్ష నిర్వహించాడు. అక్కడ అసలు విషయం బయటపడింది. సుజాత బ్లడ్‌ గ్రూపు ‘బీ పాజిటివ్‌’ అని తేలింది. అంతేకాకుండా నాలుగు రోజులుగా సాధారణ ప్రసవం అవుతుందంటూ చెప్పిన వైద్యులు తీర ఆదివారం హన్మకొండకు తీసుకెళ్లాలని సూచించారు. ఆగ్రహించిన సుధాకర్‌ తన భార్యకు ఇక్కడే ప్రసవం చేయాలని, పరిస్థితి విషమించాక తీసుకెళ్లాలంటే ఎట్లా..? అని ప్రశ్నించాడు. ఈ విషయం తెలుసుకున్న యువజన కాంగ్రెస్‌ నాయకులు సాయిని రవి ఆస్పత్రికి చేరుకొని వైద్యులను సస్పెండ్‌ చేయాలంటూ ధర్నాకు దిగారు. మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణిని అంబులెన్స్‌లో హన్మకొండకు తరలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top