ఎట్టకేలకు ఉస్మానియా ఖాళీ

Governament Orders Issued To Vacate Osmania General Hospital In Patient Block - Sakshi

శిథిలావస్థకు చేరిన పాత  భవనాన్ని సీల్‌ చేయాలని ఆదేశాలు

తాత్కాలికంగా రోగుల సర్దుబాటు

టిమ్స్‌ను కేటాయించాలని వైద్యుల డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్ ‌: పూర్తిగా శిథిలావస్థకు చేరిన చారిత్రక ఉస్మానియా ఆసుపత్రిలోని పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలని డీఎంఈ రమేశ్‌రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. భవనాన్ని వెంటనే ఖాళీ చేసి సీల్‌ వేయాలని ఆదేశించారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న పాత భవనంలోని రోగులు, ఇతర కార్యాలయాలను వేరే భవనాల్లో సర్దుబాటు చేయాలని సూచించారు. ఆదేశాలు జారీ కావడంతో ఆస్పత్రి యంత్రాంగం వెంటనే చర్యలకు ఉపక్రమించింది. భవనాన్ని ఖాళీ చేసింది.

1925లో ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. నిర్వహణ లోపం వల్ల ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనం పై అంతస్తుల్లోని పైకప్పు తరచూ పెచ్చులూడి పడుతోంది. గోడలు బీటలు వారాయి. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షానికి పాత భవనంలోని వార్డులను వరద ముంచెత్తడం, మురుగు నీటి మధ్యే రోగులకు చికిత్స అందించాల్సి రావడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ వైద్య సేవలు అందించడం ఏ మాత్రం సురక్షితం కాదని భావించిన ప్రభుత్వం తక్షణమే భవనాన్ని ఖాళీ చేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ప్రస్తుతం ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను ఇతర భవనాల్లో సర్దుబాటు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో ఇటీవలే ఆధునికరించిన హౌజ్‌ సర్జన్ల భవనంలో 150 పడకలు, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో రోగుల సహాయకుల కోసం ఏర్పాటుచేసిన రాత్రి వసతిగృహంలో 250 పడకలు, మరో భవనంలో ఇంకో 100 పడకలను సర్దుబాటు చేశారు. సూపరింటెండెంట్‌ కార్యాలయం సహా పలు ఆపరేషన్‌ థియేటర్లను ఖాళీ చేస్తున్నారు. ఉస్మానియా పాత భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన కూల్చివేసి అక్కడ కొత్తగా ట్విన్‌ టవర్స్‌ను ఏడాదిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత భవనాన్ని కూల్చి అదే స్థలంలో నిర్మాణం చేపట్టిన తర్వాత మిగతా భవనాలను కూల్చివేయనున్నారు. 

భవిష్యత్తులో రోగుల రద్దీని తట్టుకోవాలంటే..
ఇప్పటికే గాంధీ, కింగ్‌కోఠి ఆస్పత్రులను ప్రభుత్వం పూర్తిస్థాయి కోవిడ్‌ సెంటర్లుగా మార్చింది. సాధారణ రోగులకు ప్రస్తుతం అక్కడ చికిత్సలు అందించలేని పరిస్థితి. తాజాగా ఉస్మానియా పాత భవనం కూడా ఖాళీ చేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో జ్వరపీడితుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఉస్మానియా ఆస్పత్రిలో ఇప్పటికే 1,500 మంది వరకు చికిత్స పొందుతున్నారు. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో వచ్చే రోగులకు ఇక్కడ చికిత్సలు ఇబ్బందిగా మారుతాయి. ఇటీవల గచ్చిబౌలిలో ప్రారంభించిన తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌)ను తాత్కాలికంగా ఉస్మానియాకు కేటాయించి, ప్రస్తుతం ఇక్కడ ఉన్న çకొన్ని విభాగాలను అక్కడికి తరలించడం వల్ల రోగుల రద్దీని నియంత్రించవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ప్రతిపాదించిన పదేళ్ల తర్వాత మళ్లీ కదలిక
చారిత్రక ఈ భవనంలో వైద్యసేవలు ఇటు రోగులకు..అటు వైద్యులకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని దివంగత నేత ,అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భావించారు. నాలుగు ఎకరాల విస్త్రీర్ణంలో ఏడు అంతస్థుల భవనాన్ని నిర్మించాలని భావించి ఆ మేరకు 2009లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన రోశయ్య 2010 బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కిరణ్‌ కుమార్‌రెడ్డి ఇందుకు రూ.50 కోట్లు కేటాయించారు. శంకుస్థాపన కోసం ఓ పైలాన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఏడు అంతస్థుల భవనానికి ఆర్కియాలజీ విభాగం అ«భ్యంతరం చెప్పడంతో నాలుగు అంతస్థులకు కుదించారు.

2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ ఆస్పత్రిని సందర్శించారు. వారం రోజుల్లో పాత భవనాన్ని ఖాళీ చేసి, దాని స్థానంలో కొత్త భవనం నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆమేరకు తెలంగాణ తొలి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. తాత్కాలికంగా పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రులకు పలు వార్డులను తరలించాలని నిర్ణయించి, ఆ మేరకు ఆయా ఆస్పత్రుల్లో పడకలు కూడా సిద్ధం చేశారు. అక్కడికి వెళ్లేందుకు వైద్యులు నిరాకరించడంతో రోగుల తరలింపు నిలిచిపోయింది. ఇదే సమయంలో పాతభవనం కూల్చివేతకు ఇటు ఆర్కియాలజీ..అటు ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇదే ఆస్పత్రి ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలంలో మరో రెండు బహుళ అంతస్థుల భవనాలు నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు పునాదిరాయి కూడా వేయలేదు. రక్షణ లేని ఈ పాతభవనంలో వైద్యసేవలు అందించలేక పోతున్నామని ఆస్పత్రి వైద్య సిబ్బంది 2018లో వందరోజుల పాటు ఆందోళన చేపట్టింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా వార్డుల్లోకి వరద నీరు చేరడంతో పాతభవనం ఖాళీ, కొత్త భవన నిర్మాణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top