
స్పిరిట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతిజ్ఞ చేయిస్తున్న ఎంపీ కవిత
హైదరాబాద్: మంచి సమాజ రూపకల్పనపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయడమే ‘స్పిరిట్ ఆఫ్ లైఫ్’లక్ష్యమని శాంతి సరోవర్ డైరెక్టర్ కుల్‌దీప్ దీదీ పేర్కొన్నారు. బ్రహ్మకుమారీస్ సంస్థ, తెలంగాణ రాష్ట్ర ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ‘స్పిరిట్ ఆఫ్ లైఫ్’కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. గచ్చిబౌలి శాంతిసరోవర్ లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి వెంకటేశం, శాంతి సరోవర్ డైరెక్టర్ కుల్‌దీప్ దీదీ జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కుల్‌దీప్ దీదీ మాట్లాడుతూ 80వ వార్షిక వేడుకల్లో భాగంగా ఈ నూతన ప్రచార కార్యక్రమాన్ని ఏడాది పాటు నిర్వహిస్తామన్నారు. మహిళల్ని గౌరవించడం, ఆత్మహత్యల నివారణ, డ్రగ్స్, మద్యపానాన్ని విడనాడేలా చేయడం, ఒత్తిడిని జయించేలా చేయడం, అందరూ కలసి మెలసి ఉండేలా చేయడం ఈ ప్రచార లక్ష్యమని అన్నారు. ఎంపీ కవిత మాట్లాడుతూ బతుకమ్మ అంటే బతుకునిస్తూ, ధైర్యం, ఉత్సాహం, నింపే అమ్మ అని, ప్రకృతిని అమ్మగా భావించి పూజించడమేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బతుకమ్మ వేడుకల ద్వారా ప్రజలందరినీ ఒక్కతాటి పైకి తేగలిగామన్నారు. ప్రజల్లో ధైర్యం, ఉత్సాహం నింపి శాంతితో జీవనం సాగించేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఆకట్టుకున్న గ్రేసీ సింగ్ నృత్య ప్రదర్శన
రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి వెంకటేశం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, బ్రహ్మకుమారీస్ సంస్థ కలసి స్పిరిట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ ఫిలిం చాంబర్ చైర్మన్ ఆర్‌కే గౌడ్, రాజయోగిని మున్నీ దీదీ, కుసుమ్ దీదీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీనటి గ్రేసీ సింగ్ బృందం చేసిన నృత్య ప్రదర్శన కార్యక్రమానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతకుముందు మధురవాణి గ్రూప్, ప్రత్యేకంగా అంధులు కూడా నృత్య ప్రదర్శన నిర్వహించారు.