చల్లని వేళ చక్కటి ఆహారం | Sakshi
Sakshi News home page

చల్లని వేళ చక్కటి ఆహారం

Published Tue, Nov 25 2014 3:04 AM

good food for cold time

వేరుశనగలు
 వేరుశనగల్లో విటమిన్ ఇ, బి3 పుష్కలంగా ఉంటాయి. మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. వేరు శన గగింజల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో తేమను పెంచి పొడిబారకుండా కాపాడుతుంది.

 పాలకూర
 ఆకు కూరలు చలికాలంలో ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. పాలకూరలో ఇనుము, కాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. ప్రతి రోజు పాలకూరను ఉడికించి లేదా సూపు, రసం రూపంలో తీస్జుకుంటే ఎంతో మంచిది. ఎముకల పటిష్టానికి దోహదం చేస్తుంది.

 నువ్వులు
 నువ్వులు తగిన మోతాదులో తీసుకుంటే శరీరానికి చక్కటి వేడి లభిస్తుంది. నువ్వుల్లో కాల్షియం, ఖనిజ లవణాలు, మాంగనీసు, ఇనుము, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. భోజనం తరువాత నువ్వులతో చేసిన పదార్థాలను తీసుకోవడంవల్ల  ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. నువ్వులవల్ల చర్మం పొడిబారకుండా తేమగా ఉంటుంది.

 జొన్నలు
 వారానికి ఒక్క సారైనా జొన్నతో చేసిన ఆహారం తీసుకోవాలి. జొన్నలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కండరాల కదలికలకు బాగా ఉపకరిస్తుంది. జొన్నతో చేసిన పదార్థాలను అల్లం చట్నీతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ.

 డ్రైఫ్రూట్స్
 డ్రైఫ్రూట్స్‌ను చలికాలంలో తప్పనిసరిగా తీసుకోవాలి. అన్ని రకాల డ్రైఫ్రూట్స్‌లోనూ పోషకాలు మెండుగా ఉంటాయి. చలికాలంలో కావలసిన శక్తి వీటివల్ల లభిస్తుంది. జీర్ణశక్తిని అధికం చేస్తాయి. రక్తాన్ని బాగా శుద్ధి చేస్తాయి. డ్రైఫ్రూట్స్ సహజంగానైనా, ఆహారంలో భాగంగానైనా తీసుకోవచ్చు.

 దానిమ్మ
 సకల పోషకాల నిధి దానిమ్మ. రక్తకణాల వృద్ధికి దోహదం చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్‌లు, ఖనిజ లవణాలు, ఫాస్పరస్ కావలసినంత లభిస్తాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచి శరీరం అనారోగ్యం బారినపడకుండా కాపాడుతాయి.

 చిలగడ దుంపలు
 చక్కటి పోషకాహారం. ఈ దుంపలు శరీరానికి కావలిసిన వేడిని అందిస్తాయి. పిల్లలు, వయోధికులకు ఇది ఎంతో అవసరం. ఈ దుంపల్లో ఉండే పీచు, కార్బోహైడ్రేట్స్, విటమిన్ ఏ, సీతో పాటు ఖనిజ లవణాల్ని శరీరానికి అందిస్తాయి. చిలగడ దుంపలను ఉడికించి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి జల్లుకొని తింటే ఆ మజాయే వేరు. దీంతో చలికాలంలో ఎదురయ్యే చాలా రకాల సమస్యలను నివారించవచ్చు.

Advertisement
Advertisement