వచ్చే ఖరీఫ్‌కు గోదావరి నీళ్లు

Godavari water for the next kharif - Sakshi

‘కాళేశ్వరం’పురోగతిపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష

సాక్షి, సిద్దిపేట: కరువుతో అల్లాడిన తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు అనుగుణంగా అధికారులు, కాంట్రాక్టర్లు అంకితభావంతో పనిచేసి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని నీటిపారుదుల శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి నిర్ధేశిత లక్ష్యం మేరకు గోదావరి జలాలను రైతులకు అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన 9,10,11,12 ప్యాకేజీ పనుల పురోగతిపై సిద్దిపేట కలెక్టర్‌ కార్యాలయంలో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా హరీశ్‌ మాట్లాడుతూ అనంతగిరిసాగర్‌ రిజర్వాయర్‌ భూసేకరణను వేగంగా చేశారని, అలాగే టన్నెల్‌ లైనింగ్, పంప్‌హౌస్, సర్జిపుల్‌ పనుల వేగాన్ని పెంచాలని సూచించారు.

అనంతగిరిసాగర్‌ రిజర్వాయర్‌ పనులను జూన్‌ నెలాఖరు వరకు పూర్తి చేస్తే దిగువన రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, అక్కడి నుండి కొండపోచమ్మసాగర్‌ వరకు గోదావరి నీటికి తరలించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ కట్ట నిర్మాణం పనుల నాణ్యతను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. మల్లన్నసాగర్‌ మెయిన్‌ కెనాల్‌ భూసేకరణలో మిగిలిన ఉన్న భూమిని త్వరగా సేకరించాలని అన్నారు. ఒకవైపు భూసేకరణ, మరోవైపు రిజర్వాయర్, కాల్వల నిర్మాణం పనులు వేగవంతం చేయాలన్నారు. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో చెట్లు, బోర్లు, బావులకు సంబంధించిన రైతులకు నష్టపరిహారాన్ని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, కృష్ణభాస్కర్, నీటిపారుదల శాఖ అధికారులు హరిరాం, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top