ప్రైవేట్‌ టీచర్లకు హెల్త్‌కార్డులు ఇవ్వాలి   | Give health cards to private teachers | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ టీచర్లకు హెల్త్‌కార్డులు ఇవ్వాలి  

Jun 11 2018 7:13 PM | Updated on Oct 17 2018 6:10 PM

Give health cards to private teachers - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు రవిశ్రీ 

సుభాష్‌నగర్‌ (నిజామాబాద్‌ అర్బన్‌): ప్రైవేట్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్‌ స్కూల్స్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌పీఎస్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు రవిశ్రీ డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌లోని వైశ్యభవన్‌లో ఆదివారం నిర్వహించిన టీఎస్‌పీఎస్‌టీఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రైవేట్‌ ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం, అభివృద్ధి, సమైక్యతకు ప్రతిరూపంగా టీఎస్‌పీఎస్‌టీఏ ఆవిర్భవించిందని తెలిపారు.  ప్రధానంగా ఐదు లక్ష్యాలతో ఈ సంస్థ ఏర్పడిందన్నారు. సంస్థను ప్రకటించిన వారం రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కదలిక వచ్చిందని తెలిపారు. సెప్టెంబర్‌ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవం నాడు కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులకే అవార్డులు ఇస్తున్నారని, జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకొస్తున్న ప్రైవేట్‌ టీచర్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోరని ఆయన ప్రశ్నించారు.

రానున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రైవేట్‌ టీచర్ల సేవలను గుర్తించి అవార్డులు ఇవ్వాలని కోరారు. అర్హులైన ప్రైవేట్‌ టీచర్లకు డబుల్‌బెడ్రూం ఇళ్లను కేటాయించాలని, హెల్త్, డెత్‌ ఇన్సూరెన్స్‌ ప్రకటించాలని, డీఎస్సీ, టీఆర్‌టీల్లో ప్రైవేట్‌ టీచర్లకు అనుభవం ప్రకారం వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు 30లోపు తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తామని హెచ్చరించారు. 

రాష్ట్ర కమిటీ ఏర్పాటు..

తెలంగాణ స్టేట్‌ ప్రైవేట్‌ స్కూల్స్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎస్‌పీఎస్‌టీఏ) రాష్ట్ర కమిటీని ఆదివారం నిజామాబాద్‌లో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా రవిశ్రీ, ప్రధాన కార్యదర్శిగా సతీష్, ఉపాధ్యక్షుడిగా జైసన్, కోశాధికారిగా రాధాకిషన్, కార్యవర్గ సభ్యులుగా భోజన్న, గోవర్ధన్, సుమన్, శ్రీకాంత్, గురుచరణ్, హర్షరాజ్‌ తదితరులు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఏడు జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement