స్వచ్ఛ డ్రైవ్‌ | GHMC Special Drive On Swachh Hyderabad | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ డ్రైవ్‌

Nov 19 2019 12:03 PM | Updated on Nov 19 2019 12:03 PM

GHMC Special Drive On Swachh Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘స్వచ్ఛ హైదరాబాద్‌’లో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ మరో స్పెషల్‌ డ్రైవ్‌కు సిద్ధమైంది. త్వరలో జరగనున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌ తనిఖీలను దృష్టిలో ఉంచుకొని ఇందుకు కార్యాచరణ రూపొందించింది. గతంలో పారిశుధ్యం, వల్నరబుల్‌ గార్బేజ్‌ పాయింట్ల తొలగింపు లాంటి పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపిన బల్దియా... ఈసారి పారిశుధ్యం సహా ఆయా వార్డుల్లోని ప్రధాన రహదారులపై గుంతల పూడ్చివేత, డెబ్రిస్, బురద, పిచ్చి మొక్కలు, నాలాల్లో పూడిక తొలగింపు, సీవరేజీ లైన్లు, మ్యాన్‌హోళ్లు, ఫుట్‌పాత్‌లు, డివైడర్ల మరమ్మతులు తదితర పనులు కూడా చేయనుంది. అంతేకాకుండా ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించడం, బహిరంగ మల, మూత్ర విసర్జన కేంద్రాలను గుర్తించి శుభ్రం చేయడంతో పాటు తిరిగి అక్కడ ఆ పనులు చేయకుండా చర్యలు తీసుకోనుంది.

స్పెషల్‌ డ్రైవ్‌లో   భాగంగా ఆయా పనులు నిర్వహించే విభాగాలన్నీ క్షేత్రస్థాయిలో పని చేస్తాయి. వార్డు యూనిట్‌గా ఈ పనులు నిర్వహిస్తారు. సంబంధిత వార్డులోని శానిటేషన్, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, ఎంటమాలజీ, అర్బన్‌ బయోడైవర్సిటీ, వెటర్నరీ, యూసీడీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తదితర విభాగాలన్నీ ఇందులో పాల్గొంటాయి. స్థానిక రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లు, కాలనీ సంఘాలు, మహిళా సంఘాలు, ఎన్జీఓలను కూడా డ్రైవ్‌లో భాగస్వామ్యం చేస్తారు. గ్రేటర్‌ పరిధిలోని 150 వార్డుల్లోనూ అక్కడి పరిస్థితులను బట్టి రెండు మూడు రోజులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తారు. ఒక వార్డులో డ్రైవ్‌ నిర్వహించే సమయంలో సంబంధిత సర్కిల్‌లోని ఇరుగుపొరుగు వార్డుల క్షేత్రస్థాయి పారిశుధ్య సిబ్బందిలో సగం మందిని కూడా తీసుకుంటారు. మిగతా సగం మందితో ఆయా  వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలకు విఘాతం కలగకుండా చూస్తారు.  

ఇదీ కార్యాచరణ...   
పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో  చేయాల్సిన, చేయకూడని పనుల వివరాలతో ప్రత్యేక సైన్‌బోర్డులను ఏర్పాటు చేస్తారు. అన్ని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, రోడ్‌సైడ్‌ సెంటర్లలో ఆహార పదార్థాలను పరీక్షిస్తారు. వార్డులోని అన్ని డస్ట్‌బిన్‌లు, కాంపాక్టర్లకు రంగులు వేస్తారు. ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ఫాగింగ్, లార్వా నివారణ కార్యక్రమాలను విస్తృతంగా చేపడతారు. వీధి కుక్కల సమస్యలను పరిష్కరిస్తారు.

ఆయా వార్డుల పరిధిలోని పెట్రోల్‌ బంకులు, రెస్టారెంట్లలో టాయ్‌లెట్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటారు. వాటి సమాచారం తెలిసేలా సైన్‌బోర్డులు ఏర్పాటు చేస్తారు. అన్ని దుకాణాల్లో తప్పనిసరిగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ప్రత్యేక డబ్బాలు ఏర్పాటు చేయిస్తారు. స్పెషల్‌ డ్రైవ్‌కు ముందే  జీహెచ్‌ఎంసీ చెత్త తరలింపు వాహనాలను సైతం నీటితో క్లీన్‌ చేయడంతో పాటు అవసరమైన మరమ్మతులు చేస్తారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ జోనల్, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.  

విజయవంతం చేయండి  
స్వచ్ఛ హైదరాబాద్‌ కోసం వార్డుల వారీగా నిర్వహించనున్న స్పెషల్‌ డ్రైవ్‌లో భాగస్వాములై విజయవంతం చేయాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ కోరారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సోమవారం కాలనీ సంక్షేమ సంఘాలు, బస్తీ కమిటీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  కార్యక్రమ నిర్వహణకు వార్డుల్లోని మహిళా సంఘాలతో సహా అన్ని అసోసియేషన్ల సహకారం తీసుకుంటామన్నారు. కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ మాట్లాడుతూ... స్పెషల్‌ డ్రైవ్‌కు సంబంధించి సర్కిల్, జోనల్‌ స్థాయిల్లోనూ ఆయా సంఘాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement